ఆఫీసుకు వెళ్లే ముందు మీ ఆరోగ్యం గురించి చెప్పండి.. ఏపీ ప్రభుత్వం
ఆరోగ్య సేతు యాప్ ను డౌన్‌లోడ్ చేసుకున్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తప్పనిసరిగా కార్యాలయానికి బయల్దేరే ముందు తన ఆరోగ్య పరిస్థితిని, లక్షణాలను అందులో స్టోర్ చేయాలని, ఆఫీసుకు వెళ్లే ముందు 'సేఫ్, లో రిస్క్' అని సందేశం వచ్చినప్పుడు మాత్రమే కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుందని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్య సేతు యాప్ ఉన్నవారిని మాత్రమే సచివాలయంలోకి అనుమతించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక నిబంధనలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఉద్యోగీ తప్పనిసరిగా ఆరోగ్యసేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆదేశించింది.
హై రిస్క్ జోన్లలో ఉన్న ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పించాలని, విధులకు వచ్చే ఉద్యోగులు కచ్చితంగా థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లు, మాస్కులు వినియోగించి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు.
ఉద్యోగులతో పాటు సచివాలయ సందర్శనకు వచ్చే వారిని కూడా ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్ ఉంటేనే అనుమతించాలని, లేదంటే అనుమతించరాదన్నారు. దీన్ని కఠినంగా అమలు చేయాల్సిందిగా సచివాలయ చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్‌కు సూచించారు.