శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 5 జూన్ 2020 (20:51 IST)

ఇంట్లోనే కరోనా వైద్యం.. 17 రోజుల పాటు వైద్య సలహాలతో చికిత్స..

కరోనా లక్షణాలు కనిపించిన బాధితులు ఇళ్లలోనే చికిత్స తీసుకునేందుకు ప్రభుత్వం గురువారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా 17 రోజుల పాటు ఇంట్లోనే ఉంటూ వైద్యుల సూచనలు, జాగ్రత్తలతో వైరస్‌ నుంచి బయటపడవచ్చని తెలిపింది.

లక్షణాలు తీవ్రమైతే వైద్యుని సలహా తీసుకోవాలని.. చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర జబ్బులతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలని సూచించింది. అలాగే పోషకాహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించింది.

కరోనా ఉన్నట్లు అనుమానించినా, నిర్ధారించినా ఆందోళన చెందవద్దని, వైద్యుల సూచనలు పాటించాలంది. అత్యవసరమైతే టోల్‌ఫ్రీ నంబరు 18005994455 ను సంప్రదించాలని కోరింది.
 
ఇంట్లో చికిత్సకు..
* గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే గదితో పాటు ప్రత్యేక మరుగుదొడ్డి ఉండాలి. ఆరోగ్యవంతులైన కుటుంబసభ్యులే సేవలు అందించాలి.

* సహాయకులు లేకుంటే 18005994455 టోల్‌ఫ్రీ నంబరులో తెలియజేయాలి.

* బాధితుడి ఇంట్లో 55ఏళ్ల పైబడిన వ్యక్తులు, గర్భిణి, క్యాన్సర్‌, ఆస్తమా, శ్వాసకోశ, మధుమేహం, బీపీ, గుండెజబ్బు, కిడ్నీ సంబంధిత వ్యాధులున్న వారు, చిన్న పిల్లలు ఉంటే బాధితుడు కోలుకునే వరకు వారిని వేరే చోటుకి పంపించాలి.

* అనుమానిత, నిర్ధారించిన బాధితుడు వైద్యుడి సలహా మేరకు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రలు తీసుకోవాలి. ఈ మాత్రలకు స్థానిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలి.

* ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు సమాచారం కోసం చేసే ఫోన్‌కాల్‌కు జవాబు ఇచ్చి, ఆరోగ్యస్థితిపై పూర్తి సమాచారమివ్వాలి.

బాధితుడికి జాగ్రత్తలు...
* మంచం నుంచి దిగినా, గది బయటకు వచ్చినా మాస్క్‌ ధరించాలి.

* దగ్గినపుడు, తుమ్మినపుడు రుమాలు, టిష్యూపేపర్‌ అడ్డుపెట్టుకుని అనంతరం వాటిని చెత్తబుట్టలో వేయాలి.

* రోజుకి కనీసం రెండు లీటర్ల గోరువెచ్చని నీటిని తాగాలి.

* టాయిలెట్‌క‌ు వెళ్లేముందు, తరవాత చేతులను సబ్బుతో కడుక్కోవాలి. అక్కడ చేతితో తాకిన వస్తువుల్ని సబ్బుతో శుభ్రం చేయాలి.

* తన గదిని తానే శుభ్రం చేసుకోవాలి. శుభ్రపరిచేందుకు క్రిమిసంహారం లేదా బ్లీచింగ్‌ పౌడర్‌ను వేసి వినియోగించాలి.

* ఊపిరితిత్తులపై ఈ వ్యాధి ఎక్కువగా ప్రభావం చూపుతుంది. పొగతాగే అలవాటు ఉంటే మానేయాలి.

* బాధితుడు తనకు కేటాయించిన దుస్తులను వేడినీటిలో డెటాల్‌ వేసి అరగంట నానబెట్టి, ఉతికి ఎండలో ఆరబెట్టాలి.

* వైద్యుడి సూచనల మేరకు కచ్చితంగా మందులు వాడాలి.
కరోనా వైరస్ టెస్ట్

ఈ లక్షణాలుంటే వెంటనే వైద్య సహాయం...
బాధితుడు ఆరోగ్యస్థితిని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. అస్వస్థత లక్షణాలు తీవ్రమైనా, కొత్త లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యసహాయం పొందాలి. దగ్గు, గొంతునొప్పి, పెదాలు, ముఖం నీలం రంగులోకి మారటం, విపరీతమైన జ్వరం, ఛాతీలో నొప్పి లేదా నొక్కినట్లు అనిపించడం, లేవలేక పోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే వెంటనే వైద్యసహాయం పొందాలి.

సహాయకులకు సూచనలు...
* బాధిత వ్యక్తి గదిలోకి వెళ్లినపుడు మూడు పొరల మెడికల్‌ మాస్కు ధరించాలి. మాస్కును తరచూ ముట్టుకోవడం, పైకి కిందకు కదపడం చేయకూడదు. వాడిన మాస్కులను ఇంటి బయట కాల్చేయాలి.

* సేవలందించే వ్యక్తులు బాధితుడితో ఉన్నపుడు తమ ముక్కు, నోరు, కళ్లను తాకకూడదు. అలాగే బాధితుడి చెమట, ఉమ్మి, ముక్కు నుంచి కారే నీటిని తాకవద్దు.

* రోగికి సేవలు అందించేందుకు వెళ్లేటపుడు, ఆ తరవాత చేతులను సబ్బుతో కనీసం 40-60 సెకన్లు కడుక్కోవాలి.

* ఆహారం వండేందుకు ముందు తరవాత, తినటానికి ముందు, మరుగుదొడ్డి వాడిన తరవాత కచ్చితంగా చేతులు కడుక్కోవాలి. కడుక్కున్న చేతులను పైకెత్తి గాలిలో ఆరబెట్టాలి.

* రోగి వాడిన బెడ్‌షీట్స్‌, టవల్‌, పళ్లెం, గిన్నెలు, గ్లాసులను వేరుగా ఉంచడంతో పాటు వాటిని 30 నిమిషాలు వేడినీటిలో పెట్టి శుభ్రం చేసి తిరిగి వాడాలి.

* రోగికి ఆహారాన్ని వారుంటున్న గదిలోనే అందించాలి. వైద్య సలహా మేరకు మందులు వాడేలా చూడాలి.

* రోగి శరీర ఉష్ణోగ్రత 37.80 సెంటీగ్రేడ్‌(100 ఫారన్‌హీట్‌) కంటే ఎక్కువ ఉన్నా, నాడి వేగం నిమిషానికి 100 కంటే ఎక్కువ ఉన్నా టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేయాలి.

ఇరుగు... పొరుగు... ఆందోళన వద్దు..
* నివాసం ఉంటున్న ప్రాంతంలో కరోనా సోకిందని నిర్ధారణ అయితే ఆందోళనకు గురి కావద్దు. మిమ్మల్ని, కుటుంబసభ్యులను రక్షించుకునేందుకు జాగ్రత్తలు తీసుకుని, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.

* అపార్టుమెంట్లలో ఉంటే ఉమ్మడి స్థలాన్ని, తరచూ తాకే మెట్లు, గోడలు, లిఫ్ట్‌ బటన్లు క్రిమి సంహారకాలతో శుభ్రం చేయాలి.

* క్వారంటైన్‌ స్టాంపు కలిగిన వ్యక్తులు ఇంట్లో కాకుండా బయట తిరుగుతుంటే టోల్‌ఫ్రీ నంబరుకు సమాచారమివ్వాలి.

* ఇంటి నుంచి బయటకు వెళ్లి వచ్చినపుడు చేతులు శుభ్రం చేసుకోవాలి. వ్యాధి సోకిన వ్యక్తికి సహకరించాలి.

ఆహారం ఇలా...
* బ్రౌన్‌రైస్‌, గోధుమపిండి, ఓట్స్‌, చిరుధాన్యాలు తీసుకోవాలి. బీన్స్‌, చిక్కుడు, పప్పు ధాన్యాలతో శరీరానికి అవసరమైన ప్రోటీన్‌ వస్తుంది.

* తాజా పండ్లు, క్యాప్సికమ్‌, క్యారెట్‌, బీట్‌రూట్‌, వంకాయ లాంటి కూరగాయలు చేర్చాలి. నిమ్మ, బత్తాయితో సీ విటమిన్‌ లభిస్తుంది.

* ఆహారంలో మసాల వస్తువులైన అల్లం, వెల్లుల్లి, పసుపు మొదలగువాటిని చేర్చాలి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

* మాంసాహారాన్ని తాజా పదార్థాలతో నిల్వ ఉంచవద్దు. స్కిన్‌లెస్‌ చికెన్‌, చేపలు, గుడ్డు తెల్లసొనలో ప్రోటీన్‌ ఎక్కువ ఉంటుంది. 

వీటిని తీసుకోవడానికి ప్రాధాన్యమివ్వాలి.
* మైదా, వేపుళ్లు, జంక్‌ఫుడ్‌ తీసుకోవద్దు. శీతల పానీయాలు తాగవద్దు. కొబ్బరి, పామాయిల్‌, బటర్‌ తినవద్దు.

* లివర్‌, వేపిన మాంసాన్ని తినవద్దు. వారంలో రెండు, మూడు రోజులే మాంసాహారాన్ని తీసుకోవాలి.