శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 15 ఆగస్టు 2015 (20:06 IST)

గవర్నర్ పై సిఎంలు అలగారా....! విందుకు రాలేదు ?

రాజ్‌భవన్‌లో ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తేనీటి విందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు గైర్హాజరయ్యారు. గవర్నర్ మీద కినుకు వహించారు. ఒకరి ముఖం ఒకరు చూసుకోవడం ఇష్టం లేకే రాలేదని తెలుస్తోంది. ముఖ్యమంత్రులు రాకపోవడంపై గవర్నర్ చమత్కరించారు. 
 
స్వాతంత్య దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో తేనీటి విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ విందుకు తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. 
 
విందుకు సీఎంల గైర్హాజరుపై విలేకరుల ప్రశ్నకు స్పందించిన గవర్నర్ నరసింహన్ ‘ఎవరూ రాకున్నా.. నేనున్నాను కదా.. నేనుంటే చాలదా?’ అని అన్నారు. సీఎంలు గైర్హాజరవడానికి కారణం ఉండి ఉంటుందని, అయితే ఆ కారణాలేంటో తనకు తెలియదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు పట్టిసీమలో బిజీగా ఉండగా, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇతర పనుల్లో బిజీగా ఉన్నారేమోనని అని గవర్నర్ అభిప్రాయపడ్డారు. 
 
అయితే ‘‘ఇద్దరు సీఎంలు రాకపోవడంతో మా మనవళ్లు నిరుత్సాహపడ్డారు. సీఎంలతో మా మనవళ్లు ఫోటో దిగుదామనుకున్నారు. కానీ కుదరలేదు’’ అని గవర్నర్ సైతం నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సీఎంల గైర్హాజరుపై విలేకరులతో గవర్నర్ సరదాగా సంభాషించారు. ‘చిన్నప్పుడు మా మనవళ్లు అలిగేవారు. అలిగింది వాస్తవమే కానీ.. ఎందుకో తెలియదు’ అని చమత్కరించారు.