శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: గురువారం, 23 జనవరి 2020 (20:07 IST)

త్వరలో ఏపీ శాసనమండలి రద్దు?

ఏపీ శాసనమండలి రద్దు దిశగా అడుగులు పడుతున్నాయి. గురువారం సీఎం జగన్ శాసనసభలో చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే... ఇది స్పష్టమవుతోంది. శాసనసభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆయన సభనుద్దేశించి మాట్లాడుతూ... "2019 ఎన్నికల్లో 151 స్థానాలతో మమ్మల్ని గెలిపించారు. శాసనసభలో 86 శాతం మార్కులు వచ్చాయి. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం మాది. 
 
మండలిలో నిన్న జరిగిన ఘటనలు నన్ను బాధించాయి. పాలకులు కాదు, సేవకులం అని చెప్పినట్టుగా నడుచుకుంటున్నాం. ఏడు నెలలుగా ప్రజల కోసమే పని చేస్తున్నాం. చట్టాలు చేయడానికి ఈ సభ ఏర్పాటయింది. 
 
మండలి చట్టబద్దంగా వ్యవహరిస్తుందని నమ్మాము. మండలి నుంచి సలహాలు, సూచనలు వస్తాయనుకున్నాం. లేదా బిల్లును తిప్పి పంపిస్తారని అనుకున్నాం. నిబంధనల ప్రకారం సెలెక్ట్ కమిటీకి పంపే అధికారం లేదని చైర్మన్ చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా సెలెక్ట్ కమిటీకి పంపారు. 
 
గ్యాలరీలో ఉండి మండలిని చంద్రబాబు నడిపించిన తీరు బాధాకరం. నిన్న శాసనమండలిలో చైర్మన్ విచక్షణ అధికారాన్ని చట్టాన్ని అతిక్రమించడానికి వాడారని స్పష్టంగా అర్థమవుతోంది.

తప్పు అని తెలిసి కూడా.. తప్పు ఒప్పుకొని కూడా.. నా విచక్షణ అధికారాన్ని ఉపయోగించి అదే తప్పును ఉద్దేశపూర్వకంగా చేస్తా అంటున్న మాటలను చూస్తే హత్య చేయడం తప్పు అయినా నేను హత్య చేస్తానని అంటుంటే ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా? 
 
ఆ తప్పుని ఇక చేయకుండా మనం ఆలోచించాలా వద్దా? దేశంలో కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి ఉంది. విడిపోయిన ఈ పేద రాష్ట్రానికి మండలి అవసరమా అనేది ఆలోచించాలి. శాసనసభలో ఎంతోమంది మేధావులు, డాక్టర్లు, లాయర్లు, రైతులు, జర్నలిస్టులు, విజ్ఞులు ఉన్నారు. ఇంత మంది మేధావులు ఇక్కడే ఉన్నప్పుడు మండలి అవసరమా అన్న విషయాల పైన కూడా ఆలోచించాలి. 
 
మండలి కోసం సంవత్సరానికి 60 కోట్లు ఖర్చు పెడుతున్నాం. అసలే పేదరికంలో ఉన్న రాష్ట్రంలో ఇంత ఖర్చు అవసరమా? మంచి చేయడం కోసం తమ బుర్రలను పెట్టకుండా ప్రతి మంచి పనిని ఎలా జరగకుండా చేయాలి, ఎలా ఆపాలి ఎలా డిలే చేయాలి అని రూల్స్ ను సైతం ధిక్కరిస్తూ ఉన్న ఇలాంటి మండలి కొనసాగించాలా వద్దా అన్నది సీరియస్గా ఆలోచించాలి. 
 
ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా.. చట్టసభల నిబంధనలకు వ్యతిరేకంగా.. ప్రజలు ఎన్నుకున్న శాసనసభకు వ్యతిరేకంగా..చట్టం రూల్స్ తో సంబంధం లేకుండా పని చేస్తున్న మండలి ఇక కొనసాగించడం అవసరమా అని గట్టిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.
 
మండలి ప్రజల కోసం నడుస్తోందా? ఓడిపోయిన నాయకుల కోసం నడుస్తోందా అని ఆలోచించాలి? ఆర్టికల్ 174 ప్రకారం రాష్ట్రంలో ఎక్కడినుంచైనా చట్టాలు చేయవచ్చు .పాలన సాగవచ్చు. దివంగత జయలలిత గారు ఊటీ నుంచి పాలన సాగించారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడితే అడ్డుకోవడం ఏంటి?
 
ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ కోసం బిల్లు పెడితే వ్యతిరేకిస్తారా? కేవలం రాజకీయ దురుద్దేశంతో వ్యవహరిస్తుంటే మండలి కొనసాగాలా వద్దా అని ఆలోచించాలి. మీరు అనుమతిస్తే సోమవారం సభ పెట్టాలని కోరుతున్నాం" అని జగన్ వ్యాఖ్యానించారు.

దీంతో స్పీకర్ సభనం సోమవారానికి వాయిదా వేశారు. ఆరోజు మండలి కొనసాగింపుపై సుదీర్ఘ చర్చ జరుగనుంది. అనంతరం మండలిని రద్దు చేస్తూ తీర్మానించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.