శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం

హుజూర్​నగర్​లో కేసీఆర్ బహిరంగసభ రద్దు

ముఖ్యమంత్రి కేసీఆర్​ హుజూర్​నగర్​ పర్యటన రద్దయింది. తెరాస బహిరంగ సభ రద్దు చేసినట్లు ఉప ఎన్నికల ఇన్​చార్జి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రకటించారు.

హుజూర్‌నగర్‌లో సీఎం కేసీఆర్​ పర్యటన రద్దయినట్లు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. భారీవర్షంతో హెలిక్యాప్టర్​లో వెళ్లేందుకు విమానయానశాఖ అనుమతి ఇవ్వలేదు. హూజూర్ నగర్​తోపాటు, మార్గమధ్యలోనూ ఉరుములు, పిడుగులతో కూడిన భారీవర్షం పడుతోంది. పైలట్ల సూచన మేరకు అనుమతి రద్దు చేసినట్లు విమానయాన శాఖ డైరెక్టర్ భరత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
 
ఓటమి అంగీకారం: విజయశాంతి
వాతావరణం అనుకూలించలేదనే సాకుతో సీఎం కేసిఆర్ హుజూర్‌నగర్ పర్యటనను వాయిదా వేసుకోవడం వెనక అసలు మతలబు వేరే ఉందని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి చెప్పారు.

నిజంగా హుజూర్‌నగర్‌లో పర్యటించాలని సీఎం భావించి ఉంటే రోడ్డు మార్గం ద్వారా కూడా వెళ్లవచ్చని, హెలికాప్టర్ ద్వారా హుజూర్ నగర్‌కు వెళ్లాలని కేసిఆర్ భావించడానికి కారణం వేరే ఉందన్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నిరసన సెగల భయం వెంటాడటమే కారణమని రాములమ్మ చెప్పారు.

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తనకు చేదు అనుభవం ఎదురవుతుందేమో అనే టెన్షన్ కేసీఆర్‌కు మొదలైనట్లుందన్నారు. అందుకే 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న హుజూర్ నగర్‌కు రోడ్డు మార్గం ద్వారా వెళ్లే సాహసం చేయలేకపోయారని విజయశాంతి ఎద్దేవా చేశారు.

సీఎం ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకోవడం ద్వారా ఉప ఎన్నికలో పరోక్షంగా తన ఓటమిని అంగీకరించినట్లైందని రాములమ్మ చెప్పారు.