మంగళవారం, 14 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 8 అక్టోబరు 2019 (14:54 IST)

తెలంగాణలో ఉధృతమైన ఆర్టీసీ సమ్మె... తెలంగాణలో ఆర్టీసి బస్సులు ఇక తిరగవా?

ఆర్టీసీ సమ్మె రోజురోజుకు ఉద్ధృతమవుతోంది. దీనిపై కార్మిక సంఘాలు వెనక్కి తగ్గడం లేదు.. ఆర్టీసీ పరిరక్షణ కోసం మొదలుపెట్టిన సమ్మె..... ప్రజాస్వామ్య పోరాటంగా రూపాంతరం చెందిందని కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు.

ఇవాళ బస్సు డిపోల ఎదుట జమ్మి పూజ నిర్వహించి నిరసన వ్యక్తం చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంబించింది. తమ సమస్యలు పరిష్కరిస్తే తప్ప కార్మిక సంఘాలు సమ్మె బాట వీడమని స్పష్టం చేశాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు సమ్మె ఆపే ప్రసక్తే లేదని ఐకాస నేతలు పేర్కొన్నారు.
 
10న కలెక్టర్లతో కేసీఆర్​ సమావేశం
హైదరాబాద్‌ ప్రగతిభవన్‌లో ఈ నెల 10న ఉదయం 11 గంటలకు అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. సమ్మె పరిణామాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బస్సులను నడపాలని, ఇతర ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాల కోసం చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం ఈ నెల 10న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ ప్రగతిభవన్‌లో జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి అన్ని జిల్లాల కలెక్టర్లకు సోమవారం రాత్రి సమాచారం అందించారు.

సమ్మె వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బస్సులను నడపాలని, ఇతర ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాల కోసం చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా సీఎం కలెక్టర్ల సమావేశం నిర్వహించి, దిశానిర్దేశం చేయనున్నారు.
 
వెంటనే కార్మికుల డిమాండ్లు పరిష్కరించండి: లక్ష్మణ్​
ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారానికి భాజపా పోరాడుతుందని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ తెలిపారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పనిచేయకుంటే.. వారే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

ఆర్టీసీని ప్రైవేటికరణ చేయడం ఇష్టంలేదని సీఎం అంటున్నా.. నిర్ణయాలు మాత్రం ఆ దిశగానే ఉన్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితికి ఆర్టీసీలోని యూనియన్లే కారణమని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడటం తగదన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ప్రజలకు తెలుసన్నారు.

నోటిసులు ఇచ్చిన తర్వాత సమ్మె చేసే అధికారం గుర్తింపు పొందిన యూనియన్లకు ఉంటుందని గుర్తుచేశారు. ఆర్టీసీ బస్ స్టేషన్ల వద్ద, డిపోల వద్ద ఆందోళనలు చేస్తే ప్రత్యేక బృందాల ద్వారా అరెస్ట్​ చేస్తామనడం రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణికి అద్దం పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని లక్ష్మణ్​ అన్నారు.

ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్లకుంటే వారే గుణపాఠం చెబుతారని హితవు పలికారు. పవిత్రమైన నవరాత్రి ఉత్సవాల్లో రాష్ట్ర ప్రజలకు మేలుచేయాల్సిన ముఖ్యమంత్రి.. రాజ్యాంగ విరుద్ధంగా నిర్ణయం తీసుకోవడం మంచిదికాదన్నారు. వెంటనే కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కానికి చొరవ తీసుకోవాలని సూచించారు.