శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 23 అక్టోబరు 2019 (20:40 IST)

ఆర్ధికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.. ఆర్ధికమంత్రి బుగ్గన

రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా అభివృద్ధి వికేంద్రీకరణను దృష్టిలో పెట్టుకుని ప్రాంతీయ అసమానతలు లేకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ప్రాంతాలు సమాన అభివృద్ధికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతోందని రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు.

ఈ మేరకు బుధవారం అమరావతి సచివాలయం 4వ భవనం ప్రచార విభాగంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఇటీవల నాలుగైదు రోజులుగా ప్రతిపక్ష నేతలు మీడియా ద్వారాను,వివిధ సమావేశాల్లోను ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు ఆయన ధీటుగా సమాధానం చెప్పారు.

నీతిఆయోగ్ ఇండియా ఇన్నోవేషన్ ఇండక్ష్ పేరిట దేశవ్యాప్తంగా ఒక సర్వే చేస్తే ఆ సర్వేను వివరాలను పూర్తిగా తెల్సుకోకుండా రాష్ట్రం 10 స్థానానికి పడిపోయిందని, అప్పటి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను నిర్వహిస్తే వాటిని మూసివేసి ఈ ప్రభుత్వం మద్యం షాపులను నిర్వహిస్తోందని వాటితో మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారనే పలు ఆరోపణలను చేయడం వారు గతంలో నిర్వహించిన వివిధ  హోదాలకు ఏ మాత్రం సమంజసం కాని రీతిలో ఆరోపించడం సబబు కాదని వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని ఆయన హితవు చేశారు.

ఈ ప్రభుత్వం అధికారానికి వచ్చే నాటికి రాష్ట్ర్రాన్ని అన్ని విధాలా ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివెళ్ళారని గత మూడు మాసాలుగా రాష్ట్ర్రాన్ని ఆర్ధికంగా బలోపేతం చేసే చర్యలు చేపట్టడం జరిగిందని ఈ పరిస్థితులు చక్కదిద్దేందుకు మరింత సమయం పడుతుందని మంత్రి పేర్కొన్నారు.

ఈ ప్రభుత్వం అధికారానికి వచ్చిన వెంటనే ఫించన్ మొత్తాన్ని 2వేల నుండి 2వేల 250రూ.లకు పెంచడం జరిగిందని, నిరుద్యోగ యువతకు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించామని, వైఎస్ఆర్ రైతు భరోసా కింద రైతులకు సహాయం చేస్తున్నామని, జనవరిలో అమ్మఒడి పథకాన్ని అందుబాటులోకి తేనున్నట్టు చెప్పారు.
 
గత ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియా కనుసన్నల్లో ఇసుక సరఫరా జరిగేదని ఇక మీదట అలాంటి పరిస్థితులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని వర్షాలు కారణంగా నదుల్లో ఇసుకతీతకు కొంత ఇబ్బంది ఏర్పడిందని రెండు నెలల్లో ఇసుక సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు.

మద్యం  అమ్మకాలతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ప్రతిపక్షనేతలు ఆరోపించడం వాస్తవం కాదని 20 శాతం మద్యం షాపులను తగ్గించడం తోపాటు పల్లెల్లో ఎక్కడా బెల్టు షాపులు లేకుండా విచ్చల విడిగా మద్యం అందుబాటులో లేకుండా నివారించామని దానితో మహిళలు అన్ని విధాలా సంతృప్తికరంగా ఉన్నారని తెలిపారు.

అంతేగాక గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో పరిశ్రమలకు ఇవ్వాలని బడ్జెట్లో ప్రతిపాదించిన రాయితీలను ఇవ్వలేదేని 2014-15లో 2వేల కోట్లు,2015-16లో 26కోట్లు, 2016-17లో 290 కోట్లు,2018-19లో 740 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించిన దానికంటే తక్కువగా రాయితీలు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు.అలాగే విద్యుత్ కొనుగోలుకు సంబంధించి డిస్కంలకు పెద్దఎత్తున బకాయిలు చెల్లించలేదని చెప్పారు. 
 
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు(Sustainable Development Goals)కు సంబంధించిన వివిధ ఇండికేటర్లలో దేశంలో మన రాష్ట్రంలో వివిధ ర్యాంకుల్లో ఉందని అనగా ఆకలి రహిత(జీరో హంగర్)ఇండికేటర్లో దేశంలో 17వ ర్యాంకులో ఉందని అందుకే ప్రభుత్వం పేదలందరికీ చౌకధరల దుకాణాల ద్వారా బ్యాగులతో కూడిన మెరుగైన బియ్యాన్ని పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టిందని ఆర్ధికమంత్రి రాజేంద్రనాధ్ చెప్పారు.

అలాగే వాటర్ అండ్ శానిటేషన్ విషయంలో 16 ర్యాంకులో ఉందన అందుకే రాష్ట్రంలో వాటర్ గ్రిడ్ పధకాన్ని ప్రవేశపెట్టి ఇంటింటికీ స్వచ్చమైన తాగునీటిని అందించేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు. ఇండస్ర్టీ అండ్ ఇన్నోవేషన్ ఇండికేటర్లో 20వ ర్యాంకులో ఉన్నామని, ఆర్ధిక అసమానతలు విషయంలో 14వ ర్యాంకులో ఉన్నామని అందుకే 13 జిల్లాల సమాన అభివృద్ధికి ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతోందని చెప్పారు.

ఇంకా వివిధ ఇండికేటర్లలో రాష్ట్రంలో మెరుగైన ర్యాంకుల్లోనే ఉందని  మంత్రి బుగ్గన పేర్కొన్నారు. పదేళ్ళలో జరగాల్సిన అభివృద్ధి మూడు మాసాల్లోనే జరగాలనే విధంగా ప్రతిపక్షనేతలు మాట్లాడడం పూర్తి వాస్తవ విరుద్ధమని మంత్రి రాజేంద్రనాథ్ కొట్టిపడేశారు.

రాష్ట్రాన్ని ఆర్ధికంగా అన్ని విధాలా బలోపేతం చేయడమే ఈ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు.యువతకు పెద్దఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అధిక ప్రాధాన్యతనిచ్చి ఇప్పటికే తగిన చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన పునరుద్ఘాటించారు.

అలాగే విద్యా వైద్య రంగాల్లో మెరుగైన పరిస్థితులను కల్పించేందుకు పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధిని వికేంద్రీకరించే లక్ష్యంలో భాగంగా అన్ని జిల్లాల్లో పరిశ్రమలు నెలకొల్పేందుకు క్లస్టర్ల ఏర్పాటు చేసి పరిశ్రమలు ఏర్పాటుకు అవసరమైన అన్నివసతులు కల్పించడం జరుగుతోందని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు.