శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 16 అక్టోబరు 2019 (08:40 IST)

ప్రభుత్వం వల్లనే ఆర్టీసీ సమ్మె జటిలం.. మోదీకి తమిళిసై వివరణ

రాష్ట్ర ప్రభుత్వం వల్లనే ఆర్టీసీ సమ్మె జటిలంగా మారిందని ప్రధాన మంత్రి మోదీ దృష్టికి గవర్నర్‌ తమిళిసై తీసుకెళ్లారు. తమ డిమాండ్ల సాధనకు ఆర్టీసీ కార్మికులు 11 రోజులుగా చేస్తున్న సమ్మెతో ప్రజా రవాణా వ్యవస్థ దెబ్బతిందని తెలిపారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆమె ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

మంగళవారం ఢిల్లీ వెళ్లిన ఆమె.. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. సుమారు 40 నిమిషాలపాటు చర్చలు జరిపారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజ్‌భవన్‌లో తాను చేపట్టిన చర్యలను వివరించారు. రాష్ట్రంలోని పరిస్థితులను నివేదించారు.

విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం.. ఆర్టీసీ సమ్మె.. తదనంతర పరిణామాలను వివరించారు. ఈనెల 5వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లారని, దాంతో, పండుగ సీజన్‌లో ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఆర్టీసీ సమ్మెను నివారించడానికి అవకాశం ఉన్నా ప్రభుత్వం చొరవ తీసుకోలేదని, 48 వేల మంది కార్మికులను సెల్ఫ్‌ డిస్మి్‌సగా ప్రకటించడంతో పరిస్థితి తీవ్రమైందని వివరించినట్లు తెలిసింది. 

 
ప్రభుత్వ ప్రకటనతో ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని, రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని నివేదించారు. ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురికావడం వంటి అనర్థాలు జరుగుతున్నాయని వివరించారు. సమ్మెతో రోజురోజుకూ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.

ఆర్టీసీ సమ్మె, ప్రభుత్వ తీరుపై బీజేపీ సహా వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తనకు ఫిర్యాదు చేసినట్లు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు కరీంనగర్‌లో భారీగా గ్రానైట్‌ అక్రమ వ్యాపారం చేస్తూ, పన్నుల ఎగవేతకు పాల్పడ్డారని, ప్రభుత్వ ఆదాయానికి మైనింగ్‌ మాఫియా గండికొట్టకుండా చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఎంపీ బండి సంజయ్‌ తనకు ఫిర్యాదు చేసిన విషయాన్ని కూడా ఆమె వివరించినట్లు సమాచారం.

కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ టెండర్లలో జరిగిన అక్రమాల గురించి కూడా బీజేపీ నేతలు తనకు ఫిర్యాదు చేశారని చెప్పినట్లు తెలిసింది.