శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 1 మే 2020 (16:26 IST)

అప్పుడు 'డొక్కల కరువు' .. ఇప్పుడు కరోనా

కరోనా తెచ్చి పెట్టిన కరవు గత దుర్బర జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. కరోనాతో అల్లాడిపోతున్న గుంటూరు జిల్లా కూడా పాత చరిత్ర ను గుర్తు చేసుకుంటోంది. ఇప్పుడు కరోనా ఆకలి కేకలు  సుమారు రెండు దశాబ్దాల క్రితం కూడా వినిపించినట్లు చరిత్ర చెబుతోంది. 
 
1832-1833లో గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాలలో వచ్చిన మహా కరువును డొక్కల కరువు, నందన కరువు లేదా గుంటూరు కరువు అని పిలుస్తారు. 1831లో కురిసిన భారీ వర్షాల కారణంగా, కొత్త పంటలు వేయడానికి రైతులకు విత్తనాల కొరత ఏర్పడింది.

దాని తరువాతి సంవత్సరంలో (1832) తుఫాను వచ్చి వేసిన కొద్ది పంటను నాశనం చేసింది. అలా కొనసాగి 1833లో అనావృష్టి పెరిగిపోయింది. ఆ సమయంలో ఒంగోలు-మచిలీపట్నం రహదారి పైనా, గోదావరి జిల్లాల నుండి చెన్నై వెళ్ళే రహదారి పైనా బోలెడన్ని శవాలు పడి ఉండేవి.

కంపెనీ వారికి కరువును ఎదుర్కొనే శక్తి, ఆసక్తి లేక లక్షలాది మంది బలయ్యారు. కేవలం గుంటూరు జిల్లా లోనే 5 లక్షల జనాభాలో 2 లక్షల వరకూ చనిపోయారంటే, కరువు తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. దాదాపు 20 ఏళ్ళ వరకు ప్రజలు, పొలాలు కూడా సాధారణ స్థితికి రాలేక పోయాయి. కరువు బీభత్సం గుంటూరు జిల్లాలో మరీ ఎక్కువగా ఉండటం చేత దీనిని గుంటూరు కరువు అని కూడా అన్నారు. 

కరువు ఎంత తీవ్రంగా వచ్చిందంటే జనాలకు తినడానికి ఎక్కడా తిండి దొరక్క బాగా సన్నబడి, శరీరంలో కండమొత్తం పోయి డొక్కలు మాత్రమే కనపడేవి. ఇలా అందరికీ డొక్కలు (ఎముకలు) మాత్రమే కనపడటం వలన దీనిని డొక్కల కరువు అని పిలిచేవారు.

అంతేకాదు ఆ సమయంలో ప్రజలు ఆకలికి తట్టుకోలేక తినడానికి ఏది దొరికితే అది తినేసేవాళ్ళు. ఆఖరుకి విషపూరితమయిన కొన్ని మొక్కల వేర్లను కూడా తినేవారట. 

దొంగతనాలు, దారిదోపిడీలు, మానభంగాలు పెరిగాయి. వలసలు పెరిగి తమిళనాడు, నాగపూర్ తదితర ప్రాంతాలకు కూలీలలా తరలి వెళ్లారు. ఆడపిల్లల ను అమ్ముకొన్నారు కొందరు. అది చూసి చలించిన ఆర్థ్రర్ కాటన్ ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించాడు.