మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2020 (06:17 IST)

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కర్నూలులో కరోనా

కర్నూలులో ప్రభుత్వం చోద్యం చూస్తోందని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కర్నూలులో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయని అఖిలపక్ష రాజకీయ పార్టీలు అన్నాయి.

కర్నూలును కరోనా బారి నుండి కాపాడేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు. కర్నూలులోని కరోనా పరిస్థితిపై సమీక్షించిన అనంంతరం సిపిఎం కర్నూలు కార్యాలయంలో విలేకరులతో అఖిలపక్ష నాయకులు మాట్లాడారు.

సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ.గఫూర్‌ మాట్లాడుతూ అనుమానితులను ఉంచిన క్వారంటైన్‌ లో భౌతిక దూరం పాటించే పరిస్థితి లేదని, గుంపులు, గుంపులుగా ఒకే దగ్గర ఉండాల్సివచ్చిందని చెప్పారు. కనీసం విడివిడి బ్లాకులను కూడా ఏర్పాటు చేయలేదని, బాత్‌రూంలు, మరుగుదొడ్లను కూడా సామూహికంగా వాడుకోవాల్సి వచ్చిందన్నారు.

ఈ తరహా చర్యలు కరోనా మార్గదర్శకాలకు విరుద్దమని చెప్పారు. ఈ కారణంగానే క్వారంటైన్‌లకు అనుమాని తులుగా వెళ్లిన వారిలో అత్యధికులు పాజిటివ్‌లుగా మారారని, కర్నూలు నగరలో వైరస్‌ విజృంభణకు ఇది కూడా ఒక కారణమని చెప్పారు. 'ప్రజలకు తెలియకపోవచ్చు. అధికారయంత్రాంగం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా?' అని ప్రశ్నించారు.

కర్నూలును రాజధాని చేస్తామని అంటే ప్రజలు ఎదో అనుకున్నారని, కరోనా రాజధానిగా మారుస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా స్పందించి పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ వైద్యపరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

క్వారంటైన్‌లో ఉండేవారిని ప్రత్యేక ఐసోలేషన్‌లో ఉంచాలని సూచించారు. కర్నూలులో వైరాలజీ ల్యాబ్‌ ఏర్పాటులోనూ, ఈ ల్యాబ్‌లో పరీక్షల నిర్వహణలోనూ వందల సంఖ్యలో రిపోర్టులు బ్యాక్‌లాగ్‌లో ఉన్నాయని చెప్పారు. ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించాలని, ఇందుకు అవసరమైన కిట్లను యుద్ధప్రాతిపదికన తెప్పించాలని డిమాండ్‌ చేశారు.

వైద్యులకు పిపిఇ కిట్లు ఇవ్వాలని, అన్ని సౌకర్యాలూ కల్పించాలని కోరారు. జిల్లా మంత్రులు కర్నూలులో మకాం వేసి కరోనా నివారణకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

రాజకీయ పార్టీలను, స్వచ్ఛంద సంఘాలను భాగస్వాములను చేయాలని, రెడ్‌ జోన్‌ ప్రాంతంలో ప్రతి కుటుంబానికీ రూ.10 వేలు ఇవ్వాలని, కేరళ తరహాలో ప్రజలకు అన్ని సౌకర్యాలూ కల్పించాలని కోరారు.