శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 17 ఆగస్టు 2023 (16:28 IST)

వెలవెలపోతున్న అలిపిరి కాలినడక మార్గం

alipiri foot path
తిరుమల అలిపిరి కాలినడక మార్గం భక్తులు లేక వెలవెలపోతుంది. ఈ మార్గంలో మధ్యాహ్నంపైగా నడిచే భక్తుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఈ ప్రాంతం నిర్మానుష్యంగా మారిపోతుంది. సాధారణంగా తిరుమల శ్రీవారిని నిత్యం 70 వేల నుంచి 90 వేల మంది వరకు భక్తులు దర్శించుకుంటారు. వీరిలో 30 నుంచి 40 శాతం మంది కాలినడకన కొండెక్కుతుంటారు. 
 
వీరంతా అలిపిరి మార్గంలో 24 గంటల పాటు తిరుమలకు చేరుకోవచ్చు. శ్రీవారిమెట్టు మార్గంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకే భక్తులను అనుమతిస్తారు. కొవిడ్ తర్వాత అంటే గత ఏప్రిల్ నుంచి అలిపిరి మార్గంలో వచ్చే భక్తులకు 10 వేలు, శ్రీవారిమెట్టు మార్గంలో భక్తులకు 5 వేల చొప్పున 15 వేల దివ్యదర్శన టోకెన్లు జారీ చేస్తున్నారు. టోకెన్లు లేకుండా నడిచే భక్తులను కూడా కలిపితే 22 వేల నుంచి 28 వేల వరకు కాలినడక భక్తులు వస్తున్నారు. రద్దీ రోజుల్లో ఈ సంఖ్య 30 వేల నుంచి 32 వేల వరకు చేరుతోంది. 
 
ఇదిలావుంటే, గత శుక్రవారం రాత్రి అలిపిరి మార్గంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల లక్షిత అనే బాలికపై చిరుత దాడిచేసి హతమార్చింది. దీంతో భక్తుల్లో భయాందోళనలు నెలకొన్న క్రమంలో నడక మార్గంలో ప్రయాణంపై టీటీడీ ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో కాలినడక మార్గాలు మధ్యాహ్నం తర్వాత నిర్మానుష్యంగా మారుతున్నాయి. అలిపిరి నడకమార్గంలో వచ్చే భక్తులకు అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో దివ్యదర్శన టోకెన్లు జారీ చేస్తారు. వీటిని నడక మార్గం మధ్యలోని గాలిగోపురం వద్ద స్కాన్ చేసుకోవాలి. 
 
టోకెన్ స్కాన్ అయితేనే తిరుమల వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో దివ్యదర్శన క్యూలైనులోకి అనుమతిస్తారు. అయితే చిరుత దాడి నేపథ్యంలో దివ్యదర్శన టోకెన్లు పొందిన భక్తులు రోడ్డుమార్గాన తిరుమలకు చేరుకున్నప్పటికీ అనుమతిస్తామని టీటీడీ ప్రకటించింది. ఈ క్రమంలో చాలామంది భూదేవి కాంప్లెక్స్‌లో టోకెన్లు తీసుకుని బస్సుల్లో, ట్యాక్సీల్లో తిరుమలకు వస్తున్నారు.