బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 16 సెప్టెంబరు 2019 (18:39 IST)

ఏపీలో ఆ రెండు ఛానళ్ళును నిలిపేయండి... ఎందుకు? ఏమైంది?

మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం ఇదేమీ కొత్త కాదు. ఎపిలో రెండు ప్రధాన ఛానళ్ళను నిలిపివేయమని ఆదేశాలిచ్చారు. దీంతో రెండురోజుల క్రితం ఎపిలోని కేబుల్ ఆపరేటర్లందరూ టివి5, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానళ్ళ ప్రసారాలను పూర్తిగా నిలిపివేశారు. 
 
ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాక జగన్మోహన్ రెడ్డి టివి5, ఎబిఎన్, ఈటీవీ ఛానళ్ళ గురించి ప్రధానంగా ప్రస్తావించారు. ఎన్నికలకు ముందు వైసిపి పార్టీ గురించి తన గురించి ఈ ఛానళ్ళు పనిగట్టుకుని దుష్ర్పచారం చేశాయనీ, ఆ ఛానళ్ళ పనిపడతానని చెప్పారు. దీంతో ఇది కాస్తా తీవ్ర చర్చకు దారితీసింది. 
 
ఈ మూడు ఛానళ్ళు టిడిపికి సపోర్ట్ చేస్తున్నాయని, ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెడుతున్నా వాటిలో డొల్లతనం వున్నదంటూ కథనాలు చేస్తున్నాయనీ, ఏమీ లేకున్నా తెగ హడావిడి చేసేస్తున్నాయని జగన్ చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో ఎబిఎన్, టివి5లపై వేటు వేశారు.
 
ఛానళ్ళ ప్రసారాలను నిలిపివేయాలని ఆదేశాలిచ్చారు. గత శుక్రవారమే కేబుల్ ఆపరేటర్లకు ఈ ఆదేశాలొచ్చాయి. అయితే కొంతమంది కేబుల్ ఆపరేటర్లు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో శని, ఆదివారం ఇదే పనిగా పెట్టుకుని కేబుల్ ఆపరేటర్లకు హెచ్చరికలు రావడంతో వారికి ఏం చేయాలో పాలుపోలేదు. అధికార పార్టీ నేతలే ఇలా ఒత్తిడి చేస్తుండటంతో ఏమీ చేయలేక కేబుల్ ఆపరేటర్లు ఈ రెండు ఛానళ్ళ ప్రసారాలను నిలిపివేశారు. 
 
దీంతో జర్నలిస్టు సంఘాలన్నీ ఐక్యమయ్యాయి. ముక్తకంఠంతో ఆందోళనకు దిగాయి. ఎపిలోని 13 జిల్లాల్లో జర్నలిస్టు సంఘాల నేతలు నిరసన ర్యాలీలు, మానవహారాలు, శాంతియుత ప్రదర్సనలు, ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాలు చేపట్టాయి. ఛానళ్ళను పునఃప్రసారం చేయాలని డిమాండ్ చేశాయి.