సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 29 అక్టోబరు 2021 (12:13 IST)

ప‌ట్టాభి అరెస్టు వ్య‌వ‌హారంలో ఇద్దరు పోలీసు అధికారులపై బదిలీ వేటు

తెదేపా నేత పట్టాభి అరెస్టు సమయంలో నిబంధనలు పాటించలేదని ఇద్దరు పోలీసు అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. పోలీసుల తీరును న్యాయమూర్తులు తప్పుపట్టిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
 
తెదేపా నేత పట్టాభి అరెస్టు సమయంలో నిబంధనలు సరిగా పాటించలేదని పోలీసుల తీరును న్యాయమూర్తులు తప్పుపట్టిన నేపథ్యంలో ఇద్దరు అధికారులపై బదిలీ వేటు పడింది. నగర కమిషనరేట్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఏసీపీ రమేష్‌, సీఐ నాగరాజు బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ అయ్యాయి. 
 
అరెస్టు సమయంలో ఖాళీల ఉంచిన 41 (ఏ) సీఆర్‌పీసీ నోటీసు ఇచ్చినందునే వీరి బదిలీ జరిగినట్లు సమాచారం. సీఎం జగన్‌ను దూషించిన కేసులో గవర్నర్‌పేట పోలీసులు ఈ నెల 20న పట్టాభిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప‌ట్టాభిని 21న మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఖాళీలతో ఉన్న నోటీసు ఇవ్వడంపై మేజిస్ట్రేట్‌ అభ్యంతరం చెప్పారు. దీనిపై విచారణ అధికారిగా ఉన్న గవర్నర్‌పేట సీఐని వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. హైకోర్టులో వాదనల్లోనూ ఇదే విషయంపై పోలీసులను న్యాయమూర్తి తప్పుపట్టారు. ఈ నేపథ్యంలోనే పోలీసు అధికారుల బదిలీ చేసినట్లు తెలిసింది. 
 
ప్రస్తుతం సీటీసీ ఏసీపీగా ఉన్న రమేష్‌ను డీజీపీ కార్యాలయంలో, సీఐ నాగరాజును ఏలూరు రేంజ్‌ డీఐజీకి రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎస్‌బీలో పనిచేస్తున్న సురేష్‌ను గవర్నర్‌పేట ఇన్‌ఛార్జి సీఐగా సీపీ శ్రీనివాసులు నియమించారు. పట్టాభికి బెయిల్‌ మంజూరులో అసంపూర్తి నోటీసులు, అయన నుంచి వివరణ తీసుకోకుండానే అరెస్టు అంశాలు కీలకమయ్యాయి. పోలీసు ఉన్నతాధికారులు దీన్ని పరిగణనలోకి తీసుకుని బాధ్యతగా వ్యవహరించలేదన్న కారణంతో బదిలీ చేసినట్లు సమాచారం.