ఉద్యోగం ఇప్పిస్తామని ఇంటికి తీసుకెళ్లి ఇద్దరు ఉపాధ్యాయులు ఒక యువతిని..?
అది కరువు ప్రాంతం... దానికి తోడు పేదరికం. కనీసం తమ పిల్లలైనా ప్రయోజకులు కావాలన్నది తల్లిదండ్రుల కోరిక. పదో తరగతి తప్పిన తమ కూతురు తన కాళ్ళపై తాను నిలబడేలా చేస్తానన్న పాఠశాల ఉపాధ్యాయుడి మాయమాటలు నమ్మి బిడ్డని అప్పగిస్తే అతనితో పాటు అతని తమ్ముడు బాలికపై అత్యాచారం చేశారు. తనకు జరిగిన అన్యాయానికి తనువు చాలించింది యువతి. చిత్తూరు జిల్లాలో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం గురుకుల మడుగు గ్రామానికి చెందిన శ్రావణి తల్లిదండ్రులు కళావతి, చల్లానాయుడు. వీరు బతుకుదెరువు కోసం బెంగుళూరులో రోజు కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం పెండ్లి చింతమాను గ్రామానికి చెందిన గురుమూర్తి అతని తమ్ముడు గురుకుల మడుగులో టీచర్‌గా పనిచేస్తున్నారు.
పదవ తరగతి తప్పిన శ్రావణి ఇంటి స్థితిగతులు పసిగట్టిన అన్నదమ్ముల కన్ను శ్రావణిపై పడింది. ఒంటరిగా ఉన్న అమ్మాయిని చదివిస్తానని ఉద్యోగం ఇప్పిస్తానని ముందుగా ఆమె తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పాడు. వారి అసలైన ఉద్దేశం తెలియక ఉపాధ్యాయుడుని నమ్మి అంగీకరించారు.
ఆ తరువాత యువతిని కార్వేటి నగరంలోని ఒక ఇంటిలో ఉంచి ఆమెపై అత్యాచారం చేశాడు ఉపాధ్యాయుడు గురుమూర్తి. అతనితో పాటు అతని తమ్ముడు కూడా అత్యాచారం చేశాడు. దీంతో మనస్థాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు బోరున విలపించారు. ఇద్దరు ఉపాధ్యాయులు పరారీలో ఉన్నారు.