సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (11:19 IST)

పాడిందే పాడరా.. పాచిపళ్ళ దాసరా... ప్రత్యేక హోదాపై కేంద్రం మాట ఇదే

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో వైకాపా విపక్ష నేత ఎంపీ మిథున్ రెడ్డి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని మరోమారు ఆయన డిమాండ్ చేశారు. అలాగే, టీడీపీ ఎంపీ కేశినేని నాని కూడా ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తారు. 
 
దీనికి ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సమాధానమిచ్చారు. జాతీయాభివృద్ధి మండలి సమావేశంలో ప్రత్యేక హోదా ఏయే రాష్ట్రాలకు కల్పించాలో స్పష్టంగా వర్గీకరించారని తెలిపారు. 2014 ఫిబ్రవరిలో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌.. నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చిన మాట వాస్తవమేనని, అయితే 14వ ఆర్థిక సంఘం సిఫారసుల తర్వాత ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా లేకుండా పోయిందని గుర్తుచేశారు. 
 
విభజన చట్టం కింద ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి తోడ్పడేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఇందులోభాగంగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని తెలిపారు. కాగా, గతంలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తమ పార్టీకి 25 మంది ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామంటూ ప్రగల్భాలు పలికారు. కానీ, ఇపుడు 22 మంది ఎంపీలు గెలిచినా ప్రత్యేక హోదాపై ఎలాంటి పోరాటం చేయకపోవడం గమనార్హం.