శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 10 నవంబరు 2016 (18:54 IST)

ఏపీ... ఆకుపచ్చగా... ఏపీ వనం-మనం కోసం...

విజయవాడ : రాష్ట్రాన్ని హరితాంధ్రగా మార్చాలనే ధ్యేయంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రమంతటా వనం మనం పేరుతో కోటి మొక్కలు నాటడానికి పూనుకుంది. అదే సమయంలో అటవీ విస్తీర్ణం పెంపుదలకు నిర్ణయించింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటే కార్

విజయవాడ : రాష్ట్రాన్ని హరితాంధ్రగా మార్చాలనే ధ్యేయంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రమంతటా వనం మనం పేరుతో కోటి మొక్కలు నాటడానికి పూనుకుంది. అదే సమయంలో అటవీ విస్తీర్ణం పెంపుదలకు నిర్ణయించింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని కూడా భావిస్తోంది. ఈ విషయంలో అటవీశాఖ కూడా కొన్ని పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేసింది. వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల హెక్టార్లకు పచ్చదనాన్ని పెంపొందించాలని భావిస్తోంది. ఇందు కోసం ఈ ఏడాది చివరికి 1,517 మెట్రిక్ టన్నుల విత్తనాలను చల్లాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. 
 
నేటి వరకూ 1,018 మెట్రిక్ టన్నుల విత్తనాలను జల్లారు. మరో అయిదొందల మెట్రిక్ టన్నుల విత్తనాలను జల్లాల్సి ఉంది. ఇలా ప్రతి యేటా 15 కోట్ల విత్తనాలు జల్లి, తాననుకున్న అటవీ విస్తీర్ణం లక్ష్యం పెందపులకు చేరుకోవాలని అటవీశాఖ భావిస్తోంది.  ప్రస్తుతం రాష్ట్ర వాప్తంగా 37 వేల చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం ఉంది. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో ఇది 23 శాతం. అలాగే, అడవులకు వెలుపల ఉన్న చెట్లతో కూడిన పచ్చదనం 4,200 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. మొత్తమ్మీద 25.64 శాతం పచ్చదనం రాష్ట్రంలో ఉంది. అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి, భారీగా చెట్లు నాటడం ద్వరా మరో 17 శాతం పచ్చదనం పెంపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 25 నుంచి 30 కోట్ల మొక్కల్ని నాటితే కానీ ఈ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యం కాదని ప్రభుత్వం భావిస్తోంది.
 
ఏపీలోని 13 జిల్లాల్లో ఉన్న కొండలపై హెలీకాఫ్టర్ల ద్వారా విత్తనాలు జల్లే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. 40 శాతం అటవీ ప్రాంతాన్ని అభివృద్ది చేసేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. కొన్ని జిల్లాల్లో అనుకున్న దానికంటే  ఎక్కవగా విత్తనాలను జల్లడంలో ఫారెస్టు అధికారులు విజయవంతమయ్యారు. తూర్పు గోదావరి జిల్లాలో 19 మెట్రిక్ టన్నుల విత్తనాలు జల్లాలని లక్ష్యంగా పెట్టుకోగా, నేటి వరకూ 60 మెట్రిక్ టన్నుల విత్తనాలను కొండలపై జల్లారు. శ్రీకాకుళం, విశాఖపట్నం,  విజయనగరం, వెస్ట్ గోదావరి జిల్లాల్లో అనుకున్న దానికంటే ఎక్కువగానే  కొండమీద  విత్తనాలను చల్లారు.
 
1985లో విజయవాడలో ఇదే తరహాలో కొండలపై విత్తనాలను జల్లే కార్యక్రమాలు నిర్వహించారు. ఇన్నేళ్ల తర్వాత అదే తరహాలో అలాంటి కార్యక్రమాన్ని మరోసారి నిర్వహిస్తున్నారు. చాపర్‌ హెలికాఫ్టర్ ద్వారా ఎక్కడెక్కడ విత్తనాలు చెల్లించాలన్నదానిపై తుది కసరత్తు చేస్తున్నారు. అందులో ఉండే పైలట్‌కు, సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. గుంటూరు జిల్లాలో కొండలపై పది మెట్రిక్‌ టన్నుల విత్తనాలు, కృష్ణా జిల్లాలోని కొండలపై 3.74 మెట్రిక్‌ టన్నుల విత్తనాలను వెదజల్లనున్నారు. కొండలపై జల్లే విత్తనాల్లో వేప, చింత, సుబాబుల్‌, సీమ తంగేడు, సీమ గానుగకు చెందనవి ఉన్నాయి. విజయవాడ, పరిసర ప్రాంతాలైన జి.కొండూరు, నవీపోతవరం, అడవినెక్కలం, చోడవరం, విజయవాడ కొత్తపేటలోని సుబ్రహ్మణ్యస్వామి కొండ ప్రాంతం, గుణదల కొండ ఇవన్నీ ఫారెస్ట్‌ అధికారుల ఆధీనంలో ఉన్నాయి. ఈ కొండలతో పాటు రెవెన్యూ ఆధీనంలో ఉన్న కొన్ని కొండలపైనా విత్తనాలు చల్లించనున్నారు.
 
వృక్షో రక్షిత రక్షితః...అంటే మొక్కను నాటితే  అవి పెద్దదై మనల్ని కాపాడుతుందని దాని అర్థం. పచ్చదనమివ్వడమే కాకుండా స్వచ్ఛమైన ఆక్సిజన్ ను  అందిస్తుంది. వాతావరణ సమతుల్యాన్ని కాపాడడంలో చెట్లు ఎంతో కీలకం.  భూగర్భ జలాన్ని పెంపొందించాలన్నా చెట్ల పెంపకం తప్పనిసరి. అందుకు ప్రభుత్వం, మొక్కలను నాటే కార్యక్రమంలో  ప్రజలందరూ భాగస్వామ్యులయ్యేలా చర్యలు చేపట్టింది, ఇందుకోసం ప్రజల్లో చైతన్యం కలిగించేలా, అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం మన రాష్ర్టంలో అయిదు కోట్లకు పైగా జనాభా ఉంది. అందరూ తలో పది మొక్కలు నాటితే, 50 కోట్ల మొక్కలు నాటినట్టే.
 
ప్రస్తుతం దేశంలో కాలుష్యం కోరలు చాస్తోంది. ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో కాలుష్యం చాపకింద నీరులా విస్తరిస్తోంది. కాలుష్య భారినుంచి తప్పించుకోవాలంటే పదేళ్లలో 500 కోట్ల మొక్కలు  నాటాలని సీఎం చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ప్రస్తుతం విజయవాడ, గుంటూరులో వేసవి ఉష్టోగ్రతలు భారీ నమోదవుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాలంటే, మొక్కల పెంపకమొక్కటే మార్గమని సీఎం చంద్రబాబునాయుడు సూచిస్తున్నారు.