శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 26 మార్చి 2020 (18:26 IST)

వాహనాలు వెంటనే వెళ్ళేలా చూడాలి: కేంద్రం

కోవిద్-19 పై గురువారం ఢిల్లీ నుండి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ వీడియో సమావేశంలో కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఏవిధంగా అమలవుతుందీ వివిధ రాష్ట్రాల సిఎస్ లు, డిజీపిలను అడిగి తెలుసుకున్నారు.

మరో మూడు వారాల పాటు ఈ లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. వివిధ నిత్యావసర వస్తువులు సరఫరాలో ఎక్కడా ఆటంకం లేకుండా చూడాలని ఆదేశించారు. వివిధ నిత్యావసర సరుకులు రవాణా చేసే లారీలు, ట్రక్కులు, గూడ్స్ వాహనాలు అవి చేరుకోవాల్సిన నిర్దేశిత ప్రాంతాలకు సకాలంలో చేరుకునేలా చూడాలని ఆదేశించారు.

ఇప్పటికే వివిధ ఆంతర్ రాష్ట్ర, ఆంతర్ జిల్లాల చెక్ పోస్టులో వద్ద ఆగిపోయిన వాహనాలు వెంటనే వెళ్ళేలా చూడాలని స్పష్టం చేశారు. నిత్యావసర వస్తువులు, వైద్య పరికరాలు, మందులు రవాణా చేసే వాహనాలకు ఏలాంటి ఆటంకం లేకుండా చూడాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను అన్ని రాష్ట్రాల్లోని క్షేత్ర స్థాయి వరకు వెళ్ళి సక్రమంగా అమలు జరిగేలా చూడాలని సిఎస్ లను ఆయన ఆదేశించారు.

అదేవిధంగా మందులు, ఇతర నిత్యావసర వస్తువులు ఇళ్ళ వద్దకే సరఫరా చేసే డెలివరీ బాయ్ లకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పారు. మరో మూడు వారాలు పాటు లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేయాలని అన్నారు. వివిధ నిత్యావసర వస్తువులు కూరగాయలు పాలు పండ్లు కొనుగోలు చేసే రైతు బజారులు ఇతర నిత్యావసర సరుకుల దుకాణాల వద్ద ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని ఎక్కడా పెద్ద పెద్ద క్యూలైన్లు లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు.

లాక్ డౌన్ వల్ల ఆయా రాష్ట్రాల్లో చిక్కుకు పోయిన వేరే రాష్ట్రాలకు చెందిన కార్మికులు, విద్యార్థులు, కూలీలు వంటివారు ఎక్కడుంటే అక్కడే ఆయా రాష్ట్రాలు తగిన భోజనం వంటి వసతులు కల్పించాలని రాజీవ్ గౌబ అన్ని రాష్ట్రాలకు స్పష్టం చేశారు. కోవిద్ రోగులకు తగిన చికిత్సలు అందించేందుకు వీలుగా అన్ని రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో సౌకర్యాలను మెరుగుపర్చుకవడంతో పాటు అవసరమైన అన్ని వైద్య పరికరాలను సమకూర్చుకోవాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ స్పష్టం చేశారు.

అంతేగాక కోవిద్ రోగుల చికిత్సలకై కొన్ని ఆసుపత్రులను సిధ్ధంగా ఉంచాలని ఆయన ఆదేశించారు. ఇప్పటి వరుకూ దేశవ్యాప్తంగా 8లక్షల మందికిపైగా విదేశాల నుండి వచ్చిన వారిని గుర్తించి వారికి కరోనా నియంత్రణకు తగిన సూచనలు సలహాలు ఇవ్వడం పట్ల అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ వీడియో సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మాట్లాడుతూ... రాష్ట్రంలో లాక్ డౌన్ విజయవంతంగా అమలు జరుగుతోందని చెప్పారు. కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు సప్లయ్ చైన్ సక్రమంగా నిర్వహిస్తున్నమని ఇందుకు సంబంధించి ఏమైనా సమస్యలు ఫిర్యాదులు ఉంటే తెలుసుకుని సత్వరం పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్ర స్థాయిలో 1902 నవంబరు తో కూడిన కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ కు వివరించారు.

లాక్ డౌన్ కాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 22న ప్రజలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారని అనగా తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయలు నగదు, వివిధ నిత్యావసర వస్తువులు గ్రామ, వాలంటీర్లు ద్వారా ఇంటింటికీ అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబకు వివరించారు.

వీడియో సమావేశంలో డిజిపి గౌతం సవాంగ్, ఆర్అండ్బి, హోం శాఖల ముఖ్య కార్యదర్శులు కృష్ణ బాబు, కుమార్ విశ్వజిత్, ఇతర ఉన్నతాధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.