బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 28 డిశెంబరు 2020 (20:15 IST)

వెలగపూడి ఘటన బాధాకరం: హోంమంత్రి సుచరిత

తుళ్లూరు మండలం వెలగపూడిలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణలకు దారి తీసింది. ఆర్చి వ్యవహారంలో మొదలైన వాగ్వాదం తీవ్ర రూపం దాల్చడంతో రెండు వర్గాలవారు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి.

వారిలో మరియమ్మ అనే మహిళ పరిస్థితి విషమంగా మారి ప్రాణాలు కోల్పోయింది. దాంతో మృతురాలి బంధువులు రోడ్డుపై ధర్నాకు దిగారు. ఘర్షణల విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడ భారీగా మోహరించారు.

పరిస్థితిని సమీక్షించేందుకు హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ నందిగం సురేశ్‌, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున,  ఉండవల్లి శ్రీదేవి వెలగపూడికి చేరుకున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులను, ఘర్షణలో గాయపడినవారిని పరమర్శించారు. మరియమ్మ మృతదేహానికి నివాళులర్పించారు.
 
ఈ సందర్భంగా హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. వెలగపూడి ఘటన దురదృష్టకరమన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెలగాలని సూచించారు. మరియమ్మ మృతి బాధాకరమని ఘర్షణలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయిస్తామని స్పష్టం చేశారు. స్థానికంగా పోలీసులపై వస్తున్న ఆరోపణలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఘటనకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. గ్రామంలో పోలీస్ పికెట్, 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. సాధారణ పరిస్థితులు వచ్చే వరకు శాంతి కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఘటన జరిగిన వెంటనే బాధితులను పరామర్శించాలని సీఎం ఆదేశించారని తెలిపారు.

తక్షణ సాయంగా మృతురాలి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని హోంమంత్రి ప్రకటించారు. మరియమ్మ కుటుంబాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ వద్దకు తీసుకెళ్తామని అన్నారు.