బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 28 డిశెంబరు 2020 (20:04 IST)

వైసీపీలో తారా స్థాయికి వర్గ విభేదాలు

వైసీపీలో ఎన్నడూ లేని విధంగా వర్గ విభేదాలు తారా స్థాయికి చేరుకొంటున్నాయి. వలస వచ్చిన పాత కొత్త నేతల మధ్య వివాదం కొనసాగుతుండగా వచ్చే ఎన్నికల విషయంలో ఇప్పటినుంచే తమ ఆధిపత్య ప్రదర్శనకు దిగుతున్న నేతల తీరుతో ఏపీ వైసీపీలో అంతర్గంతంగా హీట్ పుడుతోంది. ఇంత జరుగుతున్నా వైసీపీ నాయకత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో స్వయంగా ఆ పార్టీ నేతలే కొందరు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

మున్మందు పరిస్థితి ఇలాగే సాగితే పార్టీని గాడి ఎక్కించడం కష్టమవుతుందని ఆ పార్టీలోని కొందరు సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు కొందరు సీనియర్ నేతలు సొంత పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేయకపోయినా అధికార్ల తీరును తీవ్రంగా ఎండగడుతున్నారు. తద్వారా వారు పరోక్షంగా సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి.

గతంలోనూ, ఇటీవల అధికార్ల తీరుపై వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఆనం ఈ తరహా వ్యవహారం పార్టీకి కాస్త ఇబ్బందికలిగిస్తుందని స్వయంగా వైసీపీ నేతలు అంగీకరిస్తున్నారు. మరోవైపు జీతాల సమస్యల పరిష్కారం కోసం ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం ప్రభుత్వ వైద్యులతో కలసి ఆందోళనకు దిగారు. ఇలా ఎటు చూసినా వైసీపీలో ప్రతి జిల్లాలోనూ అంతర్గత పోరు సాగుతోంది.
 
ఇళ్ల స్థలాల పంపిణీ రసాభాస
వేటపాలెం మండలం అక్కాయిపాలెంలో ఇళ్ల స్థలాల పంపిణీ రసాభాసగా మారింది. కరణం బలరాం సమక్షంలో పాలేటి రామారావు, పోతుల సునీత  మధ్య వాగ్వాదం జరిగింది. కరణం బలరాంను 2024లోనూ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని పాలేటి రామారావు అన్నారు. 2024 సంగతి ఇప్పుడెందుకని పాలేటి ప్రసంగాన్ని పోతుల సునీత  అడ్డుకున్నారు. సముదాయించినా ఇరువురు నేతలు తగ్గలేదు. కరణం జోక్యంతో గొడవ సద్దుమణిగింది.
 
ఆమంచి వర్సెస్ కరణం బలరాం
చీరాల వైసీపీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఇటీవల కాలంలో రెండు వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వాడరేవులో మత్స్యకారుల మధ్య జరిగిన వివాదానికి ఆమంచి వర్గమే కారణమని కరణం వర్గం ఆరోపణలు చేసింది.

ఇక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా చీరాలలో ఆమంచి వర్సెస్ కరణంగా సాగింది. తాజాగా ఇళ్ల పట్టాల పంపిణీలో ఆమంచి కృష్ణమోహన్‌పై ఎమ్మెల్యే కరణం బలరాం పరోక్ష వ్యాఖ్యలు చేశారు. స్వార్థం కోసం కొంతమంది అధికార యంత్రాంగాన్ని ఛిన్నాభిన్నం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రోజు చీరాలలో అటువంటి పరిస్థితి లేదన్నారు. లా అండ్ ఆర్డర్ నిష్పక్షపాతంగా పని చేస్తోందని చెప్పారు.
 
సీఎం జగన్ ఫ్లెక్సీలను తగులబెట్టిన వైసీపీ కార్యకర్తలు
కృష్ణా జిల్లాలో వైసీపీ నేతల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. మైలవరం మండలం, పొందుగల గ్రామంలో పార్టీ కార్యకర్తలు వైసీపీ జెండాలు, క్యాలండర్లు, ఫ్లెక్సీలను తగులబెట్టారు. అర్హులైన తమకు ఇళ్ల పట్టాలు రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా.. అనర్హులకు ఇచ్చారంటూ వైసీపీ కార్యకర్తలు నేతలపై మండిపడ్డారు. అంతేకాదు.. ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే వంసత కృష్ణప్రసాద్ పంపిణీ చేసిన గడియారాలను పగులగొట్టారు. ఓట్ల కోసం తమ ఇళ్లకు నేతలు ఎలా వస్తారో చూస్తామంటూ హెచ్చరించారు.
 
కాక పుట్టిస్తున్న రఘురామ వ్యవహారం....
గత కొన్ని రోజులుగా సొంత పార్టీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నవైసీపీ ఎంపీ రఘురామకృష్ణమరాజు  మరోమారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై  మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. క్రిస్మస్ రోజు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో కనీస పరిజ్ఞానం లేకుండా..అమరావతిపై సీఎం వ్యాఖ్యలు సమంజసం కాదన్నారు.

అమరావతిలో ఎస్సీ వర్గానికి చెందినవారు 50 శాతం పైగానే ఉన్నారన్నారు. సీఎం జగన్ శాస్త్రియ గణాంకాలు తీసుకొని మాట్లాడితే బాగుంటుందన్నారు. అమరావతిలో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే వ్యాఖ్యలు చేయకుండా.. సమన్వయం పాటించాలని సూచించారు. ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా మాట్లాడడం వల్ల పార్టీకి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని రఘురామకృష్ణమరాజు వ్యాఖ్యానించారు