శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 8 డిశెంబరు 2020 (16:52 IST)

ఢిల్లీలో ఒకడ్రామా, గల్లీలో ఒకడ్రామా : వైసీపీపై టీడీపీ ఫైర్

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయబిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనచేస్తున్న సంగతి తెలిసిందేనని, ప్రధానంగా కనీసమద్ధతుధరపై రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని టీడీపీ జాతీయఅధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు.

మంగళవారం ఆయన మంగళ గిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.  కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ది ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ బిల్ -2020, ది ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్  అండ్  ఫార్మ్ సర్వీసెస్ బిల్ -2020,  ది అసెన్షియల్ కమోడిటీస్ అమెండ్ మెంట్ బిల్ -2020 లకు సంబంధించి మూడు బిల్లుల్లో ఎక్కడా కూడా కనీసమద్ధతు ధరప్రస్తావన లేకపోవడంవల్లే రైతులు తీవ్రంగా ఆందోళనలు తెలియచేస్తున్నారని పట్టాభి స్పష్టంచేశారు. 

అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ యార్డుల కొనసాగించాలనే డిమాండ్ కూడా రైతులనుంచి వస్తోందని, తెలుగుదేశం పార్టీ కూడా పార్లమెంట్ సాక్షిగా మూడుబిల్లుల్లో కొన్ని సవరణలు చేయాలని కోరడం జరిగిందన్నారు.  పార్లమెంట్ లోబిల్లులను స్వాగతించిన రోజునకూడా, కనీసమద్ధతు ధరసహా, మార్కెట్ యార్డులు, ఇతరేతర అంశాలపై టీడీపీ చాలాస్పష్టంగా, నిష్పక్షపాతంగా కేంద్రానికి సూచనలు, సవరణలు తెలియచేసిందన్నారు.

రైతులకు కనీసమద్ధతుధరపై స్పష్టత లేకపోతే, దానికి సంబంధించిన అంశాన్ని బిల్లుల్లో పొందుపరచకపోతే, రైతులు తీవ్రంగా నష్టపోతారని, కార్పొరేట్ కంపెనీలచేతచిక్కి కర్షకులు కోలుకోలేని విధంగా దెబ్బతింటారని, రైతులకు భరోసా కల్పించేలా ఎంఎస్పీ (కనీసమద్ధతుధర) అంశాన్ని చట్టంలో పొందుపరచాలని టీడీపీ చాలా స్పష్టంగా, గట్టిగా పార్లమెంట్ లో డిమాండ్ చేయడం జరిగిందని పట్టాభి వివరించారు.

లోక్ సభలోని ముగ్గురు ఎంపీలతో పాటు, రాజ్యసభలో కనకమేడల రవీంద్రకుమార్ లు చాలా స్పష్టంగా సవరణలు, సూచనలు తెలియచేశారన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం ఎక్కడా ఎటువంటి సవరణలు, సూచనలు చేయకపోగా, రాజ్యసభలో అడ్డగోలుగా బిల్లుకు మద్ధతు ప్రకటించాడన్నారు. ఎక్కడా కూడా కనీసమద్ధతుధరపై ఆయన ప్రతిపాదనచేయకుండా, గుడ్డిగా కేంద్రబిల్లులకు మద్ధతు ప్రకటిం చాడన్నారు. 

ఆనాడు రైతులకున్న సందేహాలను, వారిలోని ఆందోళనలను పసిగట్టకుండా, వారిసమస్యలను ప్రస్తవించకుండా పార్లమెంట్ లో అడ్డగోలుగా వ్యవహరించిన విజయసాయి, నేడు టీడీపీపై విమర్శలు చేస్తున్నాడన్నారు. వైసీపీ వ్యవహారశైలి ఇలా ఉండబట్టే ఆపార్టీని ఫేక్ పార్టీ అని, ఆపార్టీ వారిని ఫేక్ ఫెలోస్ అని ప్రజలంతా అనుకుంటున్నారన్నారు.

పార్లమెంట్ లో విజయసాయి ఏం మాట్లాడారో, లోక్ సభలోని 22మంది వైసీపీ ఎంపీలు  బిల్లులపై చర్చజరిగేటప్పుడు ఏంచేశారో, విజయసాయి రెడ్డి ఎందుకు నోరుతెరవలేదో వైసీపీ సమాధానం చెప్పాలని పట్టాభి డిమాండ్ చేశారు. రైతులపై వైసీపీకి చిత్తశుద్ది ఉంటే, కనీసమద్ధతు ధరపై విజయసాయి ఎందుకు మాట్లాడలేదో, ఆయనే సమాధానం చెప్పాలన్నారు.

విజయసాయి రెడ్డి ఏం మాట్లాడారో, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఏం మాట్లాడారో రాష్ట్రప్రజలందరూ తెలుసుకోవాలన్న పట్టాభి, వారిద్దరూ రాజ్యసభలో మాట్లాడిన వీడియోలను విలేకరులకు ప్రదర్శించారు. గల్లీలో ఒకలా, ఢిల్లీలో ఒకలా ప్రవర్తించడం వైసీపీకి అలవాటేనని, అందుకే ఆపార్టీనేతల బ్రతుకులే ఫేక్ గా మారాయని పట్టాభి మండిపడ్డారు. ఢిల్లీలోఒక డ్రామా, గల్లీలోఒక డ్రామా ఆడుతూ, స్వార్థప్రయోజనాలకోసం, రాష్ట్రాన్ని తాకట్టుపెట్టిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు.

కనీసమద్ధతుధరపై ఢిల్లీలో అయినా, రాష్ట్రంలో అయినా టీడీపీ ఒకేమాటపై నిలిచిందని, ఆ విషయాన్ని రాజ్యసభలో, లోక్ సభలో ఆపార్టీ ఎంపీలు మాట్లాడిన మాటలే రుజువుచేస్తున్నాయన్నారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయబిల్లులపై టీడీపీ ఆదినుంచీ ఒకేమాటపై నిలిచిందన్నారు. నేడుకూడా భారత్ బంద్ లోభాగంగా రాష్ట్రంలోని అన్నికలెక్టరేట్లవద్ద, అదేఅంశాన్ని ప్రస్తావిస్తూ, మెమొరాండాలు సమర్పిస్తూ ఏపీలోని రైతులకు అండగా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.

రాజ్యసభలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ,  బిల్లులకు మద్ధతిచ్చే వారంతా రైతులపక్షమని, మద్ధతు ఇవ్వనివారంతా దళారుల పక్షమని మూర్ఖంగా మాట్లాడటం  జరిగిందన్నారు. విజయసాయిరెడ్డి బిల్లులోని అంశాలు, క్లాజులను ప్రస్తావించకుండా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను సభలోచదివి వినిపించాడని పట్టాభి ఎద్దేవాచేశారు. బిల్లుని వ్యతిరేకించే పార్టీలపై విరుచుకుపడిన విజయసాయిరెడ్డి, హిపోక్రసీ అనేపదం వాడాడని, ఆయనకన్నా పెద్ద హిపోక్రైట్ మరొకరు ఉండబోరన్నారు.

ఆనాడు పార్లమెంట్ లో అలా మాట్లాడిన విజయసాయి, నేడు ట్వీట్లుపెడుతూ, టీడీపీ అధినేతను తప్పుపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. రాజ్యసభలో మాట్లాడినప్పుడు విజయసాయి మాటల్లో ఎక్కడాకూడా స్వామినాథన్ పేరుగానీ, కనీసమద్ధతుధర అనేమాటగానీ ఆయన నోటివెంట రాలేదన్నారు. విజయసాయి మాట్లాడినరోజునే,  టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో మాట్లాడుతూ కనీసమద్ధతుధరపై సవరణలు చేశారని, కనీసమద్ధతు ధర తప్పనిసరిగా అమలుకాకుంటే, కార్పొరేట్ చేతిలో రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందని పట్టాభి తేల్చిచెప్పారు.

ఇద్దరు మాట్లాడింది విన్నాక ఎవరు గుడ్డిగా వ్యవసాయ బిల్లులకు మద్ధతు పలికారో, ఎవరు రైతులకు న్యాయంచేయాల్సిందేనని డిమాండ్ చేశారో వారిమాటల్లోనే తేలిపో యిందన్నారు.  టీడీపీ రాజ్యసభలో, లోక్ సభలో ఏంమాట్లాడిందో, ఆధారాలతోసహా బయటపెట్టామని, దీనిపై ట్వీట్ల రెడ్డి విజయసాయి ఏం సమాధానం చెబుతారో చెప్పాలని కొమ్మారెడ్డి ధ్వజమెత్తారు.

బిల్లులపై చర్చజరిగే సమయంలో విజయసాయి నోటినుంచి స్వామినాథన్, కనీసమద్ధతు ధర అనేమాటలే రాలేదని, ఇప్పుడు మాత్రం ఆయన తాను అననివాటిని అన్నట్లుగా ట్వీట్లు పెడుతున్నాడని, అందుకే ఆయన్ని, ఆయనపార్టీ వారిని ఫేక్ ఫెలోస్ అని, వైసీపీప్రభుత్వాన్ని ఫేక్ ప్రభుత్వమని, జగన్మోహన్ రెడ్డిని ఫేక్ ముఖ్యమంత్రి అంటున్నా మన్నారు.  వ్యవసాయ శాఖామంత్రి కన్నబాబు కూడా ఒకసారి విజయసాయి రెడ్డి వీరోచితంగా రైతుల పక్షాన ఎలా పోరాడారో చూసి తరిస్తే మంచిదని పట్టాభి దెప్పిపొడిచారు.

రైతులపక్షాన నిలబడతాం, బంద్ కు సహకరిస్తామని చెప్పుకుంటున్న కన్నబాబు, విజయసాయి వీడియో చూశాక ఏంచెబుతారో చెప్పాలన్నారు? రైతులకు చెల్లించాల్సిన బీమాసొమ్ముని చెల్లించకుండా, రూ.1300కోట్లు కట్టామని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలుచెప్పిన ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ మంత్రులు రైతుల తాలూకా పంటలబీమా సొమ్ముకి సంబంధించి, సిగ్గులేకుండా అర్థరాత్రి జీవో ఇచ్చారని పట్టాభి ఆగ్రహం వ్యక్తంచేశారు.

వ్యవసాయ శాఖా మంత్రిగా ఉంటూ రైతులను దగాచేస్తున్న కన్నబాబు, సిగ్గులేకుండా రైతులను ఉద్ధరిస్తునట్లు చెప్పుకుంటున్నాడన్నారు. భారత్ బంద్ ని అడ్డుపెట్టుకొని కొత్తనాటకాలు ఆడితే ఎవరూ నమ్మరనే నిజాన్ని కన్నబాబు తెలుసుకుంటే మంచిదన్నారు.
 
కేంద్రం తీసుకొచ్చిన ది ఫార్మర్స్  అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫామ్ సర్వీసెస్ బిల్ – 2020లోని క్లాజ్ -5 (బీ)లో స్పష్టంగా కనీసమద్ధతుధర రైతులకు ఇచ్చితీరాల్సిందేనని సవరణ తీసుకురావాలని, లేనిచో  రైతులు తీవ్రంగా నష్టపోతారని టీడీపీ తరుపున తెలియచేస్తున్నట్టు పట్టాభి తెలిపారు. ఇదే విషయంపై ప్రధాని కూడా స్పందించారని, కనీసమద్ధతు ధర అనేది కొనసాగుతుందని సెప్టెంబర్ 20వతేదీన ట్వీట్ ద్వారా చెప్పడం జరిగిందన్నారు.

ప్రధాని ఇచ్చినహామీకి చట్టబద్ధత కల్పించి, రైతులకు కనీసమద్ధతు ధరను అమలుచేసి, వారికి తగినవిధంగా న్యాయం చేయాలని, అగ్రికల్చర్ మార్కెట్ యార్డులు కొనసాగేలా చూడాలని టీడీపీ డిమాండ్ చేస్తోందన్నారు. పార్లమెంట్ లో కనీసమద్ధతు ధరపై తమపార్టీ ఎంపీలు ఎలాగైతే పోరాడారో, భవిష్యత్ లో కూడా అదేవిధంగా రైతులకు కనీసమద్ధతుధర దక్కేలా పోరాటం చేస్తామని పట్టాభి తేల్చిచెప్పారు.

వైసీపీలా టీడీపీ ఫేక్ పార్టీ కాదని, రైతులకు న్యాయం జరిగేవరకు వారిపక్షాన పోరాటం సాగిస్తుం దన్నారు. వైసీపీప్రభుత్వం అడుగడుగునా రైతులను మోసగిస్తూనేఉందని,  రైతుభరోసా మొదలు పంటలబీమా వరకు అనేకఅంశాల్లో జగన్ అండ్ కో రైతులను మోసగిస్తూనే ఉన్నారన్నారు. ప్రజలెవరూ గమనించట్లేదని భావించి, ఇష్టానుసారం ట్వీట్లు పెడతాను,

తన బాగోతం ఎవరికీ తెలియదని  విజయసాయి భావిస్తే అంతకంటే మూర్ఖత్వం ఉండబోదని పట్టాభిరామ్ తేల్చిచెప్పారు. విజయసాయి ఇకనుంచైనా తననోటిని అదుపులో పెట్టుకొని, ఆయనకున్న బలహీనతలను, ఆయనపైఉన్నకేసులను పక్కకు పెట్టి,  టీడీపీని చూసి నేర్చుకునైనా రైతుల పక్షాన పోరాడితే సంతోషిస్తామన్నారు.

కన్నబాబు టీడీపీకి, ఆపార్టీనేతలకు నీతులు చెప్పడం మానేసి తనపార్టీఎంపీలకు సలహాలిస్తే మంచిదన్నారు. తెలుగుదేశంపార్టీ దేశవ్యాప్తంగా జరుగుతున్న బంద్ కు మద్ధతిస్తూనే, రైతులపక్షాన, వారికి న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తుందని స్పష్టం చేస్తున్నానన్నారు.