1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 7 మే 2016 (15:31 IST)

ఒక్కసారి అన్నకు ఛాన్సివ్వండి.. తమిళ ఓటర్లకు వెంకయ్య నాయుడు విజ్ఞప్తి

ఇప్పటివరకు 'అయ్య.. అమ్మ' పాలనను చూశారు... ఈ దఫా ఎన్నికల్లో మాత్రం అన్నకు అవకాశం ఇవ్వండి అంటూ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తమిళ ఓటర్లకు పిలుపునిచ్చారు. చెన్నైలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ... తమిళం ప్రాచీన భాష అని, ఆ తమిళం తనకు కాస్తాకూస్తో తెలుసునని, అయితే చక్కగా ప్రసంగించలేనని చెబుతూ వీరపాండ్యకట్టబొమ్మన, పసుంపొన్ ముత్తురామ లింగదేవర్‌, స్వదేశీ ఓడనడిపిన చిదంబరం పిళ్లై, మహాకవి సుబ్రహ్మణ్య భారతి, నిరాడంబర ముఖ్యమంత్రులైన కామరాజ నాడార్‌, అన్నాదురై వంటి మహానాయకులు, శివాజీ, ఎంజిఆర్‌ వంటి మహానటులను పుట్టిన తమిళ గడ్డపై ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయన్నారు. 
 
దేశమంతా పురోగమన దిశగా పయనిస్తుంటే తమిళనాడు తిరోగమన దిశగా పయనిస్తోందని అన్నారు. తమిళనాట డీఎంకే కాంగ్రెస్‌ల మధ్య ఏర్పడిన కూటమి అపవిత్రమైన కూటమిగా ఆయన అభివర్ణించారు. ప్రస్తుతం మార్పుకు సమయం ఆసన్నమైందని, కేంద్రంలో రెండేళ్లకు మునుపు ఏర్పడిన మంచి మార్పును, నెలకొల్పిన సమర్ధవంతమైన ప్రభుత్వాన్ని ప్రపంచదేశాలంతా గమనించి విస్తుపోతున్నాయన్నారు. అండమాన్ నికోబార్‌లో, అరుణాచల్ర్‌పదేశ తదితర రాష్ట్రాలలో బీజేపీ విజయబావుటా ఎగురవేస్తున్నదని, తమిళనాట కన్యాకుమారి జిల్లా బీజేపీకి కంచుకోటమారిందన్నారు. అందువల్ల ఈ ఎన్నికల్లో అన్న నరేంద్ర మోడీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.