శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (15:00 IST)

డాక్టర్ కాకర్ల మృతిపై ఉపరాష్ట్రపతి సంతాపం

ప్రముఖ వైద్యులు డా. కాకర్ల సుబ్బారావు పరమపదించారని తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నట్టు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వైద్యరంగానికి వారు చేసిన సేవలు చిరస్మరణీయం. సేవానిరతితో వృత్తికే జీవితాన్ని అంకితం చేసిన ఆయన, వైద్యులందరికీ ఆదర్శప్రాయులు.
 
రేడియాలజిస్టుగా, ఉస్మానియా వైద్యకళాశాల అధ్యాపకుడిగా, నిమ్స్ ఆసుపత్రి సంచాలకులుగా పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు వారు విశేష కృషి చేశారు. డా. కాకర్ల సుబ్బారావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

ప్రముఖ వైద్యులు పద్మశ్రీ కాకర్ల సుబ్బారావు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటని జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు తెలిపారు. 5 దశాబ్దాలకు పైగా ప్రజలకు వైద్య సేవలను అందించి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారన్నారు. రేడియాలజిస్టుగా, నిమ్స్ డైరెక్టరుగా ప్రజలకు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. 
 
హైదరాబాద్‌లోని నిమ్స్ అభివృద్ధికి విశేషమైన కృషి చేశారన్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి నేటి యువతకు కాకర్ల సుబ్బారావు ఆదర్శంగా నిలిచారన్నారు. సుబ్బారావు రాసిన పరిశోధనా వ్యాసాలకు, పుస్తకాలకు అంతర్జాతీయంగా ప్రశంసలు లభించాయన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.