శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 13 నవంబరు 2021 (18:17 IST)

తిరుమలలో విజ‌య‌దాస‌రు ఆరాధనా మహోత్సవాలు ప్రారంభం

ప్ర‌ముఖ కర్ణాటక సంగీత దాస తత్వవేత్తలలో ఒకరైన విజ‌య‌దాస‌రు ఆరాధనా మహోత్సవాలు టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ‌నివారం ఉద‌యం తిరుమలలోని ఆస్థాన మండ‌పంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కోవిడ్ - 19 నిబంధ‌న‌లు పాటిస్తూ ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.
 
ఈ సంద‌ర్భంగా టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ ఒక జీవితకాలంలో 4.75 లక్షల సంకీర్తనలు రచించడం దైవాంశ సంభూతుడు, సాక్షాత్తు నారద స్వరూపులైన పురందరదాసుకే  సాధ్యమైందని తెలిపారు.

పురంద‌ర‌దాసుల‌కు 5 లక్ష‌ల సంకీర్త‌న‌లు ర‌చించాల‌నే సంక‌ల్పం ఉండేద‌ని, కానీ వ‌య‌స్సు స‌హ‌క‌రించ‌క త‌న చివ‌రి కుమారుడైన శ్రీ మ‌ధ్యాప‌తిని 25 వేల సంకీర్త‌న‌లు ర‌చించ‌వ‌ల‌సిందిగా సూచించార‌ని చెప్పారు.
 
ప్రాచీనులు తెలిపిన విధంగా మ‌ధ్యాప‌తి పునఃజ‌న్మిస్తార‌ని అప‌ర జ్ఞానులైన పురంద‌ర దాసుల‌వారు తెలియ‌జేశార‌న్నారు. దాదాపు 250 సంవ‌త్స‌రాల త‌రువాత విజ‌య‌దాస‌రుగా అవ‌త‌రించి పూర్వ‌జ‌న్మ తండ్రి అయిన పురంద‌ర దాసుల అజ్ఞానుసారంగా  25 వేల‌కు పైగా భక్తి గీతాలను స్వరపరిచారిచి శ్రీ‌వారికి స‌మ‌ర్పించార‌న్నారు.
 
విజయదాసరు ప్ర‌తి సంవ‌త్స‌రం తిరుమ‌ల శ్రీవేంక‌టేశ్వ‌ర‌స్వామివారి  బ్ర‌హ్మోత్స‌వాల‌కు శిష్య‌బృందంతో వ‌చ్చి ఉత్స‌వాల్లో భాగ‌మైన సంకీర్త‌న‌లు, న‌ర్త‌న సేవ‌లు చేసి శ్రీ‌వారిని సంతోషపెట్టేవార‌ని వివ‌రించారు.  
 
ఇందులో భాగంగా  ఉద‌యం 8 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు, మ‌ధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంట‌ల వ‌ర‌కు, ఆంధ్ర‌, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర రాష్ట్రాల‌కు చెందిన 150 మంది దాస సాహిత్య ప్రాజెక్టు క‌ళాకారులు విజ‌య‌దాసుల సంకీర్త‌న‌లు పారాయ‌ణం చేశారు.
 
అంత‌కుముందు బెంగూళూరుకు చెందిన ప్ర‌ముఖ క‌ళాకారులు ఐశ్వ‌ర్య‌, సంధ్య‌, ల‌క్ష్మీ మ‌ధూసూద‌న్ బృందం  విజ‌య‌దాస‌రు కీర్త‌న‌ల‌ను సుమ‌ధురంగా అల‌పించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఆల్ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ప్ర‌త్యేకాధికారి విజ‌య‌సార‌ధి, హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌ద‌ర్శి రామారావు, త‌దిత‌రులు పాల్గొన్నారు.
 
శ్రీ కపిలేశ్వరాలయంలో చండీయాగం  ప్రారంభం
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో  శ్రీ కామాక్షి అమ్మవారి హోమం(చండీయాగం) శనివారం ప్రారంభమైంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విష‌యం విదిత‌మే. ఇందులో భాగంగా నవంబరు 21వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు చండీయాగం జరుగనుంది.
 
ఆల‌య ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో ఉదయం పూజ, నిత్య‌హోమం, చండీహోమం, లఘుపూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం హోమం, చండీపారాయణం, సహస్రనామార్చన, విశేష దీపారాధన నిర్వ‌హిస్తారు.