1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 26 మార్చి 2017 (16:35 IST)

సారీ చెపుతున్నాం... మనసు నొప్పించివుంటే క్షమించండి : టీడీపీ నేతలు బోండా - నాని

విజయవాడ రవాణాశాఖ ఆఫీసులో జరిగిన ఘటనపై విచారిస్తున్నామని, ఎవరి మనసునైనా నొప్పించి ఉంటే క్షమాపణ చెబుతామని ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. ఆర్టీఏ కార్యాలయంలో ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో గంటసేపు చర్చించామని

విజయవాడ రవాణాశాఖ ఆఫీసులో జరిగిన ఘటనపై విచారిస్తున్నామని, ఎవరి మనసునైనా నొప్పించి ఉంటే క్షమాపణ చెబుతామని ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. ఆర్టీఏ కార్యాలయంలో ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో గంటసేపు చర్చించామని, ఘటనపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. అధికార పార్టీ అంటే అరటాకులాంటిదని చంద్రబాబు మందలించారని బోండా ఉమ వ్యాఖ్యానించారు. 
 
అలాగే, విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందిస్తూ.. తాము ఎవరినీ దూషించలేదని, తమకు వ్యక్తిగత ఎజెండా అంటూ ఏదీ లేదన్నారు. ఆర్టీఏ కార్యాలయం రగడపై ఆయన మాట్లాడుతూ ఎవరి మనోభావాలైనా దెబ్బతీస్తే క్షమాపణలు చెబుతామన్నారు. తప్పు తమది కాకపోయినా తలదించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయని, వెంటనే కమిషనర్‌తో మాట్లాడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని కేశినేని నాని చెప్పారు. 
 
తాము దొంగతనంగా బస్సులు నడపడం లేదని, నిబంధనలు పాటించడం లేదని నిరూపిస్తే ఇప్పటికిప్పుడు బస్సులు నిలిపివేసేందుకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో అక్రమంగా తిరుగుతున్న బస్సులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
 
మరోవైపు... రవాణాశాఖలో రగడపై టీడీపీ నేతలు కమిషనర్‌ బాలసుబ్రమణ్యంను కలిసి క్షమాపణ చెప్పారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని టీడీపీ నేతలకు క్లాస్ తీసుకున్నారు. ఆయన ఆదేశాలతో టీడీపీ నేతలు కేశినేని, బోండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్‌ మీరా తదితరులు కమిషనర్‌ను కలిసి క్షమాపణ చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని బోండా ఉమ అన్నారు.