గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 11 జులై 2020 (10:41 IST)

అంతర్జాతీయ నగరంగా విశాఖ: మంత్రి అవంతి

పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం నగరానికి అన్ని హంగులు సమకూర్చబోతున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు వెల్లడించారు.

భీమిలి‌ నియోజకవర్గంలోని మధురవాడ ప్రాంతంలో మంత్రి అవంతి రూ. 4.5 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ.. విశాఖలో పూర్తిస్థాయి మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించినట్లు చెప్పారు.
 
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గతేడాది విశాఖ నగరంలో రూ.1,000 కోట్ల పైగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని మంత్రి అవంతి వెల్లడించారు.

ఒక్క భీమిలి నియోజకవర్గంలోనే రూ. 17 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. శుక్రవారం రూ. 4.5 కోట్లతో మధురవాడ ప్రాంతంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు.

విశాఖపట్నం నగరంలో ప్రస్తుతం మౌలిక వసతులపై దృష్టి పెట్టినట్లు మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. అభివృద్ధి చెందడానికి విశాఖ నగరానికి అన్ని అర్హతలు ఉన్నాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో విశాఖ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయని తెలిపారు.

విశాఖ నగరం 2019కి ముందు.. ఆ తర్వాత అనే తేడాలను ప్రజలు స్పష్టంగా గుర్తిస్తారని తెలిపారు. ఎయిర్ పోర్టు, మూడు పోర్టులు, రైల్వే డివిజన్.. ఇలా అన్ని వసతులు విశాఖ నగరానికి ఉన్నాయని చెప్పారు. విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.