శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 20 ఫిబ్రవరి 2020 (23:10 IST)

తెలుగు మహిళా సీఎంను చూడాలనుకుంటున్నా: వైసీపీ నేత పీవీపీ సంచలన ట్వీట్

తెలుగు మహిళా ముఖ్యమంత్రిని చూడాలనుకుంటున్నానంటూ ట్వీట్ చేసి వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ సంచలనం రేపారు. ఆయన చేసిన ట్వీట్ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. సొంత పార్టీ వైసీపీలో కూడా కాక రేపుతోంది. అసలు ఆయన చేసిన ట్వీట్ ఏమింటంటే...
 
'బూజు పట్టిన సాంప్రదాయాలకు తెరదించుతూ... మగ ఆఫీసర్స్ ఆడవారి ఆర్టర్లను తీసుకోరు అనే ప్రభుత్వ వాదనను పక్కనపెట్టి... కొత్త శకానికి నాంది పలికిన సుప్రీంకోర్టు.

ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు ఆడవారికి సమాన ఆస్తి హక్కులు కల్పించి, మన తెలుగు కుటుంబాల ఉదారతను ప్రపంచానికి తెలియజేశారు.

అదే స్ఫూర్తితో మన తెలుగువారు కూడా మన ఆడపడుచులను గౌరవిస్తూ, తెలుగు మహిళా ముఖ్యమంత్రిని చూడాలని కోరుకుంటున్నాను. అవకాశాల్లో సగం, ఆస్తిలో సగం, ప్రజా ప్రతినిధులలో సగం, ప్రభుత్వంలో సగం' అంటూ ట్వీట్ చేశారు.
 
పీవీపీ చేసిన ఈ ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయింది. అయితే, కాసేపటి తర్వాత ట్వీట్ ను ఆయన డిలీట్ చేశారు. కానీ, అప్పటికే ఈ ట్వీట్ ను స్క్రీన్ షాట్ తీసిన నెటిజన్లు దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

పీవీపీ కోరుకుంటున్న మహిళా సీఎం ఎవరు? అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. వైయస్ భారతి? వైయస్ షర్మిళ? వైయస్ విజయమ్మ? వీరిలో ఎవరనే చర్చ జరుగుతోంది. అసలు ఈ ట్వీట్ ఎందుకు చేశారనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.