గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 9 మే 2017 (18:46 IST)

పోలవరం నిర్వాసిత రైతుల ఖాతాల్లో రూ.1660 కోట్లు జమ: మంత్రి దేవినేని

అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లాల్లో నాలుగు మండలాలకు చెందిన 34 గ్రామాల నిర్వాసిత రైతుల 15,548.44 ఎకరాలకు 1,660 కోట్లకు పైగా నష్టపరిహారం చెల్లించినట్లు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు తెలిపారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ లో మంగళవారం

అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లాల్లో నాలుగు మండలాలకు చెందిన 34 గ్రామాల నిర్వాసిత రైతుల 15,548.44 ఎకరాలకు 1,660 కోట్లకు పైగా నష్టపరిహారం చెల్లించినట్లు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు తెలిపారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2018 జూన్ నాటికి పోలవరం నుంచి గ్రావీటి ద్వారా నీటిని అందించాలనే ధ్యేయంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ముందుగా పోలవరం ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులకు నష్టపరిహారం చెల్లించడానికి ప్రభుత్వం నడుంబిగించిందన్నారు. ఇందులో భాగంగా 15,582 ఎకరాల భూమిచ్చిన 6,842 మంది రైతులకు 1,479 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో నేరుగా జమచేయడం జరిగిందన్నారు. 
 
దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే రైతుల ఖాతాల్లోకి ఈ మొత్తాలను జమ చేసిందన్నారు. ఎకరానికి దాదాపు 10 లక్షల 50 వేల రూపాయలను రైతులకు అందించారన్నారు. మరికొందరికి వడ్డీతో కలిపి రూ.10.92 లక్షల వరకూ జమయ్యాయన్నారు. కుక్కునూరు, ఏలేరుపాడు, జీలుగుమల్లి, బుట్టయ్యగూడెం మండలాలకు చెందిన 34 గ్రామాల్లో ముంపునకు గురయ్యే 14,043 ఎకరాలకు 1,502 కోట్ల రూపాయలు, 1,505 ఎకరాల అసైన్ మెంట్ భూములకు రూ.158 కోట్లు... మొత్తం 15,548 ఎకరాలకు 1,660 కోట్లా 75 లక్షలా 48 వేలా 936 రూపాయలు రైతుల అకౌంట్లో జమ అయ్యాయని మంత్రి వెల్లడించారు. 
 
దేశ చరిత్రలోనే రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం ఇదే మొదటిసారన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, రైతులకు నష్టపరిహారం పంపిణీలో సీఎం చంద్రబాబునాయుడు వెనుకంజ వేయలేదన్నారు. 2018 జూన్ నాటికి గ్రావిటీ ద్వారా నీరు విడుదల చేయాలంటే ముందుగా ముంపు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సీఎం చంద్రబాబు భావించారన్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు. రైతులకు నష్టపరిహారం చెల్లింపులో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, ఇతర అధికారుల కృషిని అభినందిస్తున్నామన్నారు. రైతులకు చెల్లించిన నష్టపరిహారాలకు చెందిన  బిల్లులను పోలవరం అథారిటీ, కేంద్ర జల వనరుల శాఖ నాబార్డుకు పంపిస్తున్నామన్నారు. ఈ బిల్లులను పరిశీలించిన తరవాత ఆ మొత్తాన్ని రాష్ర్ట ప్రభుత్వానికి రీయింబర్స్ చేస్తారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మరో 7,500 ఎకకాలకు 800 కోట్ల అవసరమని చెప్పారు. దానికి సంబంధించిన చర్యలను అధికారులు తీసుకుంటున్నారన్నారు. పోలవరం పనులను సోమవారం స్వయంగా పరిశీలించానని, గ్యాలరీలో నడుచుకుంటూ వచ్చానన్నారు. ఇది ఒక మంచి అనుభూతి అని మంత్రి తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో గ్యాలరీ వాక్ నవంబర్లో పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. 
 
ఎప్పటికప్పుడు పోలవరం ప్రాజెక్టు పురోగతి పనులు దేశ, రాష్ర్ట ప్రజలకు తెలియాలన్నది సీఎం ఉద్దేశమన్నారు. కాంక్రీట్, ఎర్త్,  డయాఫ్రమ్ వాల్ పనులకు సంబంధించి, ఎల్అండ్ టి బావర్ సంస్థ 663 మీటర్లలో 203 మీటర్ల పనులు వేగవంతం చేసిందన్నారు. జర్మనీకి చెందిన 15 మంది నిష్ణాతులు ప్రాజెక్టు పనుల్లో రేయింబవళ్లు పని చేస్తున్నారన్నారు. ఈ సీజన్లో 663 మీటర్లు పూర్తి చేసి, వచ్చే సీజన్లో గోదావరి నదిలో పూర్తి చేసేలా ప్రణాళికల రూపొందించారన్నారు. కాపర్ డామ్ కు సంబంధించి వచ్చే వారం పనులు ప్రారంభించడానికి అధికారులు డిజైన్లు ఫైనలేజ్ చేసే పనిలో నిమగ్నమయ్యారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. 
 
స్పిల్ వే బ్రిడ్జి, కాపర్ డ్యామ్ పనులు వేగవంతానికి అధికారులు కృషి చేస్తున్నారన్నారు. డయాఫ్రమ్ వాల్ అయిన తరవాత ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్  పనులు జరుగుతాయన్నారు. ఈలోగా గ్రావిటీ ద్వారా కుడి, ఎడమ కాలువల ద్వారా నీరు విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. పునరావాసంలో భాగంగా పేదల ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. కాలనీల నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు అధికారులు శ్రీకారం చుట్టారన్నారు. ఇప్పటికే భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించామని, ఇళ్ల నిర్మాణాలపూర్తి చేసి వారికి అందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా స్ఫూర్తితో తూర్పుగోదావరి జిల్లాలోనూ నష్టపరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా ఆ జిల్లా అధికారులు లెక్కలు వేసే పనిలో తలమునకలయ్యారన్నారు.
 
చంద్రబాబుకు అవార్డు రాష్ర్ట ప్రజలకు గర్వకారణం...
ఈఎస్ఐపీసీ తరఫున జాన్ ఛాంబర్స్ నుంచి ట్రాన్స్ ఫర్మెటేవ్ చీఫ్ మినిస్టర్ అవార్డును సీఎం చంద్రబాబునాయుడు అందుకోవడం రాష్ర్ట ప్రజలు గర్వించదగ్గ విషయమని మంత్రి తెలిపారు. 
 
అమెరికా పర్యటనలో చంద్రబాబు బిజీబిజీ
అమెరికా పర్యటనలో రోజూ 17 నుంచి 18 గంటల వరకూ పారిశ్రామిక వేత్తలతో చర్చలు జరుపుతూ సీఎం చంద్రబాబు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఏపీలో అమలవుతున్న అమెరికాలోని ఐటీ పారిశ్రామికవేత్తలకు అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని సీఎం చంద్రబాబు ఆహ్వానం పలుకుతున్నారన్నారు. 
 
రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీస్తున్న ప్రతిపక్షం
సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ప్రతిపక్ష వైఎస్ఆర్ సిపి ఈ మెయిల్స్ పంపుతోందని జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. దాని మీద విచారణ జరుగుతోందన్నారు. త్వరలో వీటికి సంబంధించిన విషయాలు బయటకు వస్తాయన్నారు. గతంలో ఎందరో సీఎంలు విదేశాలకు వెళ్లారన్నారు. ఎప్పుడూ కూడా ఇటువంటి దిగజారుడు చర్యలకు ఎవరూ దిగజారలేదన్నారు. ఈ మెయిల్స్ ను పంపినవారిపై విచారణ చేపట్టి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. 
 
పోలవరం ప్రాజెక్టును అడ్డుకోడానికి కుట్రలు, కుతంత్రాలు...
జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం పనులను అడ్డుకోడానికి ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. 2009 నుంచి 2013 వరకూ పోలవరం టెండర్లు అటకెక్కించారన్నారు. ఒక కుటుంబం స్వార్థం వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నాలుగేళ్లు ఆలస్యం చోటు చేసుకుందన్నారు. దీనివల్ల రూ.20 వేల కోట్ల అంచనా వ్యయం పెరిగిందన్నారు. ఇటువంటి పార్టీ నేడు పోలవరం ప్రాజెక్టుపై విమర్శలు గుప్పించడం హాస్యాస్పదమన్నారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెంచేస్తున్నారంటూ తమపై ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టు అడ్డుకోడానికి కేవీపీ రామచంద్రావుతో కలిసి ఎంపి విజయసాయిరెడ్డి ఢిల్లీలో తిరుగుతున్నారన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ లో తప్పుడు కేసులు వేశారన్నారు. 
 
కేసులు వేయాలంటూ పక్క రాష్ట్రాలయిన ఒడిశా, చత్తీస్‌ఘడ్ ప్రభుత్వాలకు సూచనలిస్తున్నారన్నారు. రాజ్యసభలో ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి, పోలవరం సమాచారాన్ని పక్క రాష్ర్టాలకు పరోక్షంగా అందేలా చర్చకు పట్టుబడుతున్నారన్నారు. ఏ ప్రశ్నలు వేయాలో కూడా పక్క రాష్ర్టాలకు చెబుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా, 2018 నాటికి పోలవరం నీటిని గ్రావిటీతో అందజేసి, 2019 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడానికి సీఎం చంద్రబాబునాయుడు మహా సంకల్పం, మహా లక్ష్యంతో ముందుకు సాగుతున్నారన్నారు.
 
ఆగస్టు 15 నాటికి ‘పురోషోత్తమపట్నం’ జాతికి అంకితం..
ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి విశాఖపట్నానికి నీళ్లందించే పురుషోత్తమపట్నం ప్రాజెక్టును పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తామని రాష్ర్ట జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు తెలిపారు. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా ఏలేరు రిజర్వాయర్ కు గోదావరి జలాలు విడుదల చేయనున్నామన్నారు. పురుషోత్తమపట్నం నిర్వాసిత రైతులకు ఇవ్వాల్సిన రూ.20 కోట్లను ఇప్పటికే సంబంధిత అధికారులకు ఇవ్వడం జరిగిందన్నారు.
 
ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు ప్రారంభం...
బుధవారం నుంచి ప్రకాశం బ్యారేజీపై వాహన రాకపోకలకు అనుమతిస్తామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే ఎక్స్ పర్ట్ కమిటీ గేట్ల పనులను పరిశీలించిందన్నారు. మంగళవారం ఉదయం ప్రకాశం బ్యారేజీ పనులను స్వయంగా పరిశీలించానన్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు కృష్ణాడెల్టా పరిధిలో ఉన్న నాలుగు జిల్లాలకు తాగునీటి ఇబ్బందలు రానీయ్యబోమని మంత్రి దేవినేని ఉమ తెలిపారు.