శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 12 అక్టోబరు 2021 (23:44 IST)

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు ఏవీ?: కాంగ్రెస్

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించడంతో పాటు వారికి మౌలిక సదుపాయాలను అందించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ జగన్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు.  నాడు-నేడు పేరుతో జరిగిన అభివృద్ధి శూన్యం అని, ఆసుపత్రుల్లో అవసరమైన వాటిని ఏర్పాటు చేయడంలో జగన్ రెడ్డి  ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని శైలజనాథ్ ఆరోపించారు.

మంగళవారం విజయవాడ ఆంధ్ర రత్న భవన్ నుంచి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసారు.  మే 31వ తేదీన 14 మెడికల్ కాలేజీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారని, మరో రెండు కాలేజీలతో కలిపి 16 వైద్య కళాశాలలు నిర్మించాలన్నది ప్రతిపాదన అని, ఈ 130 రోజుల్లో కాలేజీల నిర్మాణ పనులు 130 సెంటీమీటర్లు కూడా ముందుకు కదల్లేదన్నారు.

ఆరోగ్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం 2021–22 బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించిందని,  గత ఆర్థిక సంవత్సరం ఆరోగ్య రంగానికి రూ.9,426.49 కోట్లు కేటాయించగా ఈ ఏడాది ఈ మొత్తాన్ని రూ.13,830.44 కోట్లకు పెంచిందని,  ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, 104, 108 పథకాలకు నిధుల కేటాయింపులు చేసినా ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు. 

రాష్ట్రవ్యాప్తంగా నాడు నేడు కింద ఆస్పత్రుల అభివృద్ధి పనులకు రూ.1,535 కోట్లు కేటాయించిందని,  వైద్యవిధాన పరిషత్ కు గతేడాది కంటే రూ.77.32 కోట్లు ఎక్కువగా ఇచ్చిందని,  తొలిసారిగా బడ్జెట్లో కోవిడ్ టీకా కోసం రూ.500 కోట్లు, కోవిడ్ నియంత్రణకు రూ.500 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని,  గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఆరోగ్య రంగానికి బడ్జెట్లో 4,403.95 కోట్లు అధికంగా కేటాయించినా ప్రజలు ఇంకా ఆసుపత్రుల్లో అవస్థలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో శస్త్రచికిత్సలు, ఇతర అవసరాల కోసం రూ.127 కోట్లు కావాలని వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనలు పంపితే కేవలం రూ.20 కోట్లు మాత్రమే ఇచ్చారని, ఇందులో బోధనాసుపత్రులకు రూ.12 కోట్లు, సీహెచ్సీ, ఏరియా, జిల్లా ఆసుపత్రులకు రూ.5 కోట్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రూ.3 కోట్లు కేటాయించారన్నారు.

వైద్య కళాశాలల్లో పీజీ సీట్లు పెరగడమంటే కేవలం వైద్య విద్యార్థులు చదువుకోవడమే కాకుండా, దీనికి సంబంధించి భారీ స్థాయిలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని,  ప్రతి విభాగంలోనూ యూనిట్లు పెంచాలని,  ఒక్కో యూనిట్కు ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు అసోసియేట్లు, ఒక ప్రొఫెసర్ ఉండాలని,  స్టాఫ్ నర్సులు, ఆపరేషన్ థియేటర్లు సంఖ్య పెంచాలని, ఇంటెన్సివ్ కేర్, ఆక్సిజన్ బెడ్స్ విధిగా ఎక్కువ మోతాదులో అందుబాటులోకి తీసుకురావాలని, ఇలా ఒక పీజీ సీటు పెరిగిందంటే చాలా రకాల మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుందని తెలిపారు. 

అప్పుల సర్కార్ గా మారిన వైసీపీ ప్రభుత్వం తక్షణం ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం పై దృష్టి సారించాలని శైలజనాథ్ కోరారు.