వైకాపా నేతల్లో ప్రాంతీయ అభిమానం ఎక్కడ? తరలిపోతున్నా గొంతు పెగలడం లేదు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన వైకాపా నేతల్లో ప్రాంతీయ అభిమానం పూర్తిగా చచ్చిపోయింది. తమ రాజకీయ భవిష్యత్ కోసం అమరావతి రాజధాని ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారు. అమరావతి రాజధానిని అడ్డుగాపెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మూడుముక్కలాట ఆడుతున్నా.. అమరావతి ప్రాంతానికి చెందిన ఒక్కరంటే ఒక్క నేత కూడా వ్యతిరేకించిన పాపానపోలేదు. కానీ, ఆ పార్టీకి చెందిన నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం ఇందుకు మినహాయింపు. ఈయన ఒక్కరే రైతులకు సంఘీభావం తెలిపారు. రాజధాని కోసం భములిచ్చిన వారికి న్యాయం చేయాలంటూ ఆదినుంచి తన గళాన్ని వినిపిస్తున్నారు.
నిజానికి గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన వైకాపా నేతల్లో ప్రాంతీయ అభిమానం పూర్తిగా చచ్చిపోయింది. వీరిలో తమ ప్రాంతంపై అభిమానం మచ్చుకైనా కనిపించడం లేదు. ఫలితంగా అమరావతి రాజధానిని సమాధి చేస్తూ మూడు రాజధానులకు సీఎం జగన్ నిర్ణయం తీసుకొన్నా కనీసం ఒక్కరు కూడా గళం విప్పడం లేదు కదా ఓహో.. అద్భుత నిర్ణయమంటూ కొనియాడుతున్నారు. ముఖ్యంగా, రాజధాని ప్రాంతం నుంచి ప్రజల ఓట్లతో గెలుపొందిన మంగళగిరి, తాడికొండ ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకత వ్యక్తం చేయకపోగా సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తూ మాట్లాడుతున్నారు.
వాస్తవానికి గుంటూరు, కృష్ణా జిల్లాలకు ఇంతటి అద్బుతమైన అవకాశం మరోసారి రాదు. కానీ, వైకాపా నేతలు చేతులారా కాలదన్నుతున్నారు. జిల్లాలో ఆ పార్టీకి చెందిన 15మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు గెలిచారు. వీరిలో ఇప్పటివరకు అమరావతి రాజధాని రైతులకు సంఘీభావం తెలిపింది, ఒక్క నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాత్రమే. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగాలని ఆయన తొలినుంచి డిమాండ్ చేస్తున్నారు.
ఎన్నికలకు ముందు రాజధాని ఇక్కడే ఉండాలని పలికిన గొంతులు నేడు మాట పెగలడం లేదు. గత ఏడాది నుంచి అమరావతి సమాధిగా మారిపోతున్నా నామమాత్రంగానైనా ప్రాంతీయ అభిమానాన్ని చాటకపోగా రాజధాని తరలింపుని స్వాగతిస్తున్నారు. వైసీపీ నాయకులు అవలంభిస్తున్న తీరు ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకేలా చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన తీరుతో ఆ పార్టీ రాష్ట్రంలో నామరూపాలు లేకుండా పోయింది. కనీసం ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని కూడా గెలుచుకోలేని పరిస్థితికి పడిపోయింది. ఒక విధంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు సమాధి చేశారు. ఇప్పుడు అమరావతి రాజధాని తరలింపు విషయంలోనూ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో వారి ఆగ్రహం ఓటు రూపంలో చవి చూడక తప్పదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.