గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 6 ఆగస్టు 2020 (17:35 IST)

విశాఖ వైకాపాలో ముసలం : గంటా రాకకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ సీపీ విశాఖపట్టణం జిల్లాలో ముసలం చెలరేగింది. ఆ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైకాపా తీర్థం పుచ్చుకోనుండటాన్ని జిల్లాకు చెందిన వైకాపా శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గంటా రాకకు వ్యతిరేకంగా భీమిలి నియోజకవర్గం వ్యాప్తంగా ఫ్లెక్లీలు, బ్యానర్లు వెలిశాయి. వీటిని ఇదే జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ అనుచరగణం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. 
 
కాగా, గత కొన్ని నెలల సస్పెన్స్‌కు తెరదించుతూ ఈ నెల 15వ తేదీన గంటా శ్రీనివాస రావు వైకాపాలో చేరబోతున్నారు. ఆయన చేరికకు ముఖ్యమంత్రి జగన్ ఆమోదం తెలపడం, పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు కావడం కూడా జరిగిపోయాయి. 
 
మరోవైపు గంటా రానుండటంతో విశాఖ వైసీపీలో ముసలం పుట్టింది. గంటా రాకను స్థానిక వైసీపీ ప్రముఖులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే మంత్రి అవంతి శ్రీనివాస్ గంటాపై బహిరంగ విమర్శలు చేశారు.
 
మరోవైపు, భీమిలి నియోజక వర్గంలో గంటాకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. గంటా మాకొద్దు అంటూ నిరసనకారులు నినాదాలు చేస్తున్నారు. జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో వైయస్సార్ విగ్రహాన్ని గంటా తొలగించారని... ఇప్పుడు ఆయన పార్టీలోకి ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారు. 
 
గంటాను పార్టీలోకి తీసుకోవద్దని జగన్‌ను కోరుతున్నారు. మరోవైపు గంటా వైసీపీలో చేరితే... విశాఖ వైసీపీలో ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గంటా రాకను కూడా మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెల్సిందే.