శబ్దం లేని 'గంటా' : అమ్మతోడుగా వైకాపా తీర్థంపై నోరు మెదపడం లేదు!!
తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి, విశాఖపట్టణం జిల్లాలో అత్యంత కీలక నేతలగా ఉన్న గంటా శ్రీనివాస రావు త్వరలోనే పార్టీ మారబోతున్నట్టు సమాచారం. ముఖ్యంగా, ఆయన టీడీపీకి గుడ్‌బై చెప్పి.. అధికార వైకాపాలోకి వెళుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. పైగా, గంటా చేరికకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం పచ్చజెండా ఊపినట్టు సమాచారం. ఇపుడు గంటా పార్టీ మారే అంశం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
అయితే, ఈ వ్యవహారంపై అసలు వ్యకి గంటా శ్రీనివాస రావు మాత్రం పెదవి విప్పడం లేదు. నిజానికి ఎన్నికలకు ముందునుంచే వైసీపీలో చేరేందుకు గంటా ప్రయత్నాలు కొనసాగించినా, అవి ఫలించలేదు. గంటాకు తరచూ నియోజకవర్గాలను మార్చే అలవాటు ఉంది. 2019లో భీమిలి నియోజకవర్గాన్ని వీడి విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి గెలిచారు.
ఎన్నికల ఫలితాలు వెల్లడైన నాటి నుంచి ఆయన టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ, ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో గంటా వైసీపీలో చేరుతున్నారంటూ రాజకీయవర్గాలలో మరోసారి చర్చ మొదలైంది.
ఇటీవల విశాఖ పర్యటనల సమయంలో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి తరచూ గంటాపై నేరుగా విమర్శలు చేస్తూవచ్చారు. గంటాను ఉద్దేశించి ట్వీట్లూ చేశారు. దీంతో గంటా విషయంలో వైసీపీ గుర్రుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తం అయింది.
దానికితోడు విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా గంటాకు వ్యతిరేకంగా ఉండటం.. ఆయన వైసీపీలోకి రావడానికి అడ్డంకిగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావించారు.
అయితే, ఇటీవల వైసీపీ శిబిరంలో చోటు చేసుకున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న నేతలూ, ఈ శిబిరంలో ముఖ్యభూమికను పోషిస్తున్నవారూ గంటాను వైసీపీలో చేర్చుకునేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.
ఈ విషయమై గంటాను సంప్రదించేందుకు ప్రయత్నించగా, ఆయన స్పందించకం పోవడం గమనార్హం. దీంతో గంటా పార్టీ మారడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.