గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 15 జూన్ 2021 (21:22 IST)

ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థులు ఎక్కువ ఎందుకు?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం పారిశ్రామికవేత్తలు ఎదురుచూసేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని అధ్యాపకులకు ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర సూచించారు. ప్రైవేట్ కాలేజీలతో  పోల్చుకుంటే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో  నైపుణ్యం కలిగిన అధ్యాపకులు ఉన్నారని  ఆయన అన్నారు.

అయినా  ప్రైవేట్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటానికి గల కారణాలను ప్రభుత్వ అధ్యాపకులే ఆలోచన చేయాలని అన్నారు. మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాయలసీమ విశ్వవిద్యాలయం, యోగి వేమన విశ్వవిద్యాలయం పనితీరుపై సమీక్షించారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పానికి అనుగుణంగా అధ్యాపకులు తమ బోధన విధానాన్ని మార్చుకోవాలని చెప్పారు.

ఎంతో నైపుణ్యం కలిగిన  ప్రభుత్వ అధ్యాపకులు చిత్తశుద్ధితో  బోధిస్తే విద్యార్థులు మంచి నైపుణ్యం కలిగిన వారుగా తయారవుతారని చెప్పారు.   ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అంటే పారిశ్రామికవేత్తలు వెంటనే  ఉద్యోగాలు ఇచ్చేలా వారిలో నైపుణ్యాన్ని పెంపొందించాలని అన్నారు. కరోనా కారణంగా విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా ఆన్లైన్ ద్వారా విద్యాబోధన చేయాలని చెప్పారు. విశ్వవిద్యాలయాల్లోని ప్రతి ప్రొఫెసరు వారానికి 8 గంటల థియరీ, 6 గంటలు ప్రాక్టికల్ క్లాస్ లను ఆన్ లైన్ ద్వారా విద్యార్థులకు బోధించాలని స్పష్టం చేశారు.

వర్చువల్ ల్యాబ్ ద్వారా ప్రాక్టికల్ క్లాస్ లు నిర్వహించాలని చెప్పారు. వర్చవల్  ల్యాబ్ లేనిచోట వీడియో ద్వారా ప్రాక్టికల్ క్లాసులను ఆన్లైన్ ద్వారా వివరించాలని సూచించారు. విద్యార్థుల అటెండెన్స్ కూడా 90 నుంచి 100 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం లో ఆన్లైన్ క్లాస్ ల అటెండెన్స్ 90 శాతానికి పైగా ఉండటంపై విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఎం. సూర్య కళావతి, రిజిస్టర్, రెక్టార్,  అధ్యాపకులను ఆయన అభినందించారు.

అధ్యాపకులు కూడా వారానికి 14 గంటలు తగ్గకుండా ఆన్ లైన్ క్లాస్ ల ద్వారా విద్యార్థులకు బోధించడాన్ని ఆయన అభినందించారు. నెల రోజుల క్రితం చాలా తక్కువగా ఉన్న  అటెండెన్స్  ఇప్పుడు 90 శాతానికి పైగా మెరుగుపడటం ప్రశంసనీయమన్నారు.   అధ్యాపకులు బోధించే విధానాన్ని బట్టి విద్యార్థుల సంఖ్య ఆధారపడి ఉంటుందన్నారు.

కొన్ని కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య  తక్కువగా ఉండటాన్ని ఆయన ప్రస్తావించారు. అటువంటి చోట అధ్యాపకులు తమ బోధన విధానాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఈ  సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రేమ చంద్రారెడ్డి కూడా పలు అంశాలపై అధ్యాపకులకు సూచనలు చేశారు.