బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 19 మార్చి 2021 (14:10 IST)

తల్లిదండ్రుల ప్రేమకు విలువ ఇవ్వండి.. : తెలంగాణ హోం మంత్రి అలీ

తల్లిదండ్రులు ప్రేమను పిల్లలు గుర్తించాలని, ప్రేమ పేరుతో వారికి కన్నీటిని మిగల్చడం సరికాదని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మొహమ్మద్ అలీ అన్నారు. స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జీవితం విలువపై సదస్సు నిర్వహించారు. 
 
ముఖ్యఅతిథిగా పాల్గొన్న హోం మంత్రి మొహమ్మద్ అలీ మాట్లాడుతూ ప్రేమ పేరుతో యువత చావడం, చంపడం చేసి జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు లక్ష్యాలను ఏర్పరుచుకుని, జీవితాన్ని చక్కదిద్దుకుని తల్లిదండ్రుల కళ్ళలో సంతోషం నింపాలని సూచించారు. 
 
తమ ఇంట్లో జరిగిన విషాదం మరో ఇంట్లో జరగకూడదనే గొప్ప సంకల్పంతో ఈదా శామ్యూల్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవలు అమూల్యమని తెలిపారు. ఫౌండేషన్ కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. 
 
మరో అతిథి ఎక్సయిజ్, క్రీడా, యువ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తల్లిదండ్రులు పిల్లలను మార్కుల కోసం ఒత్తిడి చేయకుండా, వారికి సంస్కారం నేర్పాలని సూచించారు. స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రారంభించిన మహోద్యమం స్ఫూర్తిదాయకమని తెలిపారు. 
 
ఫౌండేషన్ చైర్మన్ ఈదా శామ్యూల్ రెడ్డి మాట్లాడుతూ 22 ఏళ్ల పాటు అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు దూరమైతే తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం అని తెలిపారు. తమ కుటుంబం ఇప్పటికీ ఆ బాధ అనుభవిస్తుందని, ఆ కడుపు కోత మరెవరికీ ఉండకూడదనే ఫౌండేషన్ ద్వారా జీవితం విలువ పై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
 
యువత తీవ్ర నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్కసారి తల్లిదండ్రులు గురించి ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. మాజీ మంత్రి ఎస్. వేణుగోపాలాచారి మాట్లాడుతూ యువత ఆత్మహత్యల నివారణకు ఫౌండేషన్ చేస్తున్న కృషి అపూర్వమని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా విద్యా సంస్థల్లో ఈ తరహా సదస్సులు నిర్వహించేందుకు ఫౌండేషన్‌కు తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. 
 
తెలంగాణ భాషా, సంస్కృతిక  శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ ప్రేమ ఓ పాజిటివ్ శక్తి అని, జీవితాలను చక్కదిద్దుకోవడానికి దాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస గుప్తా మాట్లాడుతూ పిల్లల విషయంలో తల్లిదండ్రుల  వైఖరిలో మార్పు రావాలని అన్నారు. యువత  ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకుండా ముందుకు సాగితే విజయం వరిస్తుందని తెలిపారు.