శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 16 మార్చి 2021 (12:45 IST)

ప్రశ్నించే నేత చుట్టూ ప్రశ్నలే, సమయం లేదు మిత్రమా? పవన్ భాజపాతో దోస్తీ?

తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల హడావిడి చేస్తున్న సందర్భంలో,తెలంగాణలోనూ జనసేన తన సత్తా ఏంటో చూపించాలని అనుకుంటోంది. తెలంగాణలో జనసేనకు ఎంతో బలం ఉందనే విశ్వాసంలో పవన్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని బిజెపి స్థానిక నాయకత్వం పట్ల ఇంకా మిశ్రమ అభిప్రాయంతోనే ఆయన ఉన్నారు.
 
ఈ బంధం కొనసాగుతుందా… తెగిపోతుందా.. కాలంలో తేలిపోతుంది.ఒంటరిగా తమ సత్తా, తమ పంథా ఏమిటో చూపించుకోకుండా, మళ్ళీ బిజెపితో కలిసి సాగడం వల్ల జనసేన పార్టీ స్వేచ్ఛను కోల్పోయిందనే విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు, ఉధృతంగా సాగుతున్న ఉక్కు ఉద్యమంలో జనసేన పాక్షికంగానే పాల్గొంటోంది.
 
విశాఖ స్థానిక నేతలు మాత్రమే పాల్గొంటున్నారు. బిజెపితో కలిసి సాగుతున్న కారణంతో, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసే స్వతంత్రతను  జనసేన కోల్పోయింది. ఏ ప్రత్యేక హోదా అంశంలో విభేదించి బయటకు వచ్చిందో?, ఇప్పుడు దాని గురించి కేంద్రంతో యుద్ధం చేసే స్వేచ్ఛ జనసేనకు పోయినట్లే అని భావించాలి. అన్నింటినీ ప్రైవేటుపరం చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ విధానంపై ప్రజల్లో క్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది.
 
ప్రశ్నించే నేత చుట్టూ ప్రశ్నలే
ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనిపై ఏదో ఒక రోజు ప్రజలు తిరగబడతారు. అప్పుడు ఒక రాజకీయ పార్టీగా ప్రజల వైపు పోరాడాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు ఇంకా పూర్తిగా అమలుకు నోచుకోలేదు. వీటన్నిటి పట్ల జనసేన తన గళాన్ని ఏ విధంగా వినపిస్తుంది? అనే ప్రశ్నలు ప్రజల్లో ఉన్నాయి.
 
అన్ని అంశాలకూ,కేవలం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలను విమర్శించడం వల్ల ప్రజాభిమానం పెల్లుబుకదు, అనే సత్యాన్ని గ్రహించాలి.2019 ఎన్నికలకు కాస్త ముందు నుంచీ,అప్పుడు అధికారంలో ఉన్న టిడిపిని  జనసేన తీవ్రంగా విమర్శించింది. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీని మొదటి నుంచీ విమర్శిస్తోంది.
 
అదే.. తేడా. అంతకు మించి ఏమీ లేదనే అభిప్రాయంలోనే ప్రజలు ఉన్నారు.అధికారంలో ఉన్న పార్టీలు చేసే తప్పులను ఎండగట్టడం ప్రతిపక్షాల  బాధ్యత. అదే సమయంలో, కేంద్ర ప్రభుత్వం చేసే తప్పులను కూడా నిలదీయాలి. అప్పుడే ఆ పార్టీలపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది.
 
రాష్ట్రంలోని మిగిలిన రాజకీయ పార్టీల నాయకుల కంటే పవన్ కల్యాణ్ కు ” మిస్టర్ క్లీన్”  ఇమేజ్ ఇంకా ఉంది. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అతనిపైనే ఉంది. పార్టీని ఇంకా బూత్ స్థాయి నుంచి పటిష్ఠంగా నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. పవన్ కల్యాణ్ నాయకత్వం పట్ల, జనసేన పార్టీ పట్ల ఇంకా ప్రజల్లో విశ్వాసం పెరగాలి.
 
పెంచాల్సిన బాధ్యత ఆయనపైనే ఉంది. కేవలం తెలంగాణలో నిర్మాణం చేపడితే సరిపోదు. ఆంధ్రప్రదేశ్ లోనూ నిర్మాణంలో బలమైన అడుగులు వేయాలి. జమిలి ఎన్నికలు వస్తే, సమయం లేదు మిత్రమా…. పార్టీని బలోపేతం చేయడంలో వేగం పెరగాలి. పార్టీ స్థాపించి ఇప్పటికే 7 ఏళ్ళు పూర్తయింది.