బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 16 మార్చి 2021 (12:08 IST)

బిజెపి సహకరించనందునే ఓడిపోయాం: జనసేన

విజ‌య‌వాడ‌ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన ఓటుబ్యాంకు పదిలం అని  ఎంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, సెలబ్రిటీలు వచ్చినా కూడా నియోజకవర్గంలో జనసేన కార్పొరేటర్ అభ్యర్థులు ప్రభుత్వంతో తలపడి.. నిలబడ్డార‌ని, బిజెపి నాయకులు ఎక్కడ సహకరించలేనందునే గెలిచే స్థానాలు కూడా ఓడిపోయాం అని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప‌శ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ అన్నారు.

పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన కార్పొరేట్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

వైఎస్సార్సీపీ  ఎలక్షన్స్ ఇన్చార్జిగా ఉన్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి శుభాకాంక్షలు అని, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అవినీతి వల్ల పశ్చిమలో ప్రతికూల ప‌రిస్థితులు వస్తాయని ముందే రాష్ట్ర ప్రభుత్వం ఊహించి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, సెలబ్రిటీలను ఎన్నికల ప్రచారం చేశారని పేర్కొన్నారు.

వెల్లంపల్లి మంత్రిగా ఒక్కరే ప్రచారం చేసినా వారి ఇంటి ముందున్న 52వ వార్డును గెలిపించ‌లేని వ్యక్తి నియోజకవర్గం అంతా గెలిపించారు అంటే హాస్యాస్పదంగా ఉంద‌న్నారు. ప్రస్తుత మంత్రి వెల్లంపల్లి గతంలో ఎమ్మెల్యేగా ఉండి 2014 ఎన్నికల్లో ఒక్క కార్పొరేటర్లు కూడా గెలిపించుకోలేద‌ని ఈ క్ర‌మంలో మంత్రి వెల్లంపల్లి సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని, ఎన్నికల ముందే వెల్లంపల్లి శ్రీనివాసరావు అవినీతి బాగోతాన్ని బయటపెట్టామ‌న్నారు.

దాని ఫలితమే మంత్రిని ఇతర నియోజకవర్గాల‌కు ప్రచారానికి వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం మంత్రి వెల్లంపల్లిని నిలువరించిందన్నారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ 8 స్థానాలు పశ్చిమలో కైవసం చేసుకున్న మాట వాస్తవం కాదా అని ప్ర‌శ్నించారు.

ఈ ఎన్నికలలో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులు ధనస్వామ్యం రాజకీయాలు చేశారని, ఒక్క పశ్చిమ నియోజకవర్గం లోనే ఒక్కొక్క  అభ్యర్థి రూ.70 లక్షలకు పైగా ఖర్చు చేశారని, ఎన్నికల కమిషన్ దీన్ని పట్టించుకోలేదని, పలుమార్లు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లిన వారి వద్ద నుండి కనీస స్పందన లేదన్నారు.

అధికారులు, పోలీసులు, వార్డు వాలంటీర్లు వైసీపీ అభ్యర్థుల‌కు సహకరించారని ఆరోపించారు. వైఎస్‌ఆర్‌సిపి ఎన్ని ప్రలోభాలు పెట్టిన జనసేన పార్టీ అభ్యర్థులు లొంగ‌లేదని చివరి వరకు ధైర్యంగా నిలబడ్డారని పేర్కొన్నారు.