శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 జూన్ 2020 (15:55 IST)

భర్త హత్యకు భార్య పక్కా స్కెచ్.. తెలియగానే పరార్

తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కోపంతో కట్టుకున్న భర్తను కడతేర్చాలని భార్య పక్కా ప్లాన్ వేసింది. ఇందుకోసం తన ప్రియుడుతో పాటు.. మరో వ్యక్తి సాయం తీసుకుంది. రెండుసార్లు, భర్తపై హత్యాయత్న దాడికి పాల్పడింది. కానీ, రెండుసార్లు అదృష్టవశాత్తూ భర్త తప్పించుకున్నాడు. దీంతో అనుమానం వచ్చి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడటంతో భార్య పత్తాలేకుండా పారిపోగా, ఆమెకు సహకరించిన ప్రియుడు, మరో వ్యక్తిని మాత్రం పోలీసులు అరెస్టు చేశారు. ఇది చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం దుర్గసముద్రం పంచాయతీ వడ్డిపల్లి సమీపంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన శివయ్య - సుజాతల దంపతులు. వీరి పదేళ్ళ దాంపత్య జీవితానికి గుర్తుగా ముగ్గురు పిల్లలు పుట్టారు. అయితే, సుజాతకు సమీప బంధువు లక్ష్మయ్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన భర్త.. భార్యను యేడాది క్రితం పుట్టింటికి పంపించాడు. దీంతో భర్తపై కోపం పెంచుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని తన ప్రియుడుతో కలిసి ప్లాన్ వేసింది. ఇందుకోసం ప్రియుడిని రెచ్చగొట్టింది. 
 
ఈ పరిస్థితుల్లో గత మార్చి 21వ తేదీన ఐరన్‌ రాడ్‌తో శివయ్యపై దాడి జరిగింది. మే నెల 23న కత్తితో నరికారు. రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వివాహేతర సంబంధంతోనే శివయ్యను హత్య చేసేందుకు రెండు సార్లు ప్రయత్నాలు చేసినట్లు, శివయ్య భార్య సుజాతను ఇందులో ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. 
 
ప్రియుడు లక్ష్మయ్యతో కలిసి ఈ హత్యయత్నానికి పాల్పడినట్లు నిర్ధారించారు. మార్చి 21న ఐరాన్‌రాడ్‌తో చంపేందుకు ప్రయత్నించిన సమయంలో శివయ్యకు తలకు తీవ్రగాయమైంది. తర్వాత చిగురువాడకు చెందిన వినయ్‌తో కలిసి మే 23న సాయంత్రం వడ్డిపల్లికి సమీపంలోనే కత్తితో పొడిచి శివయ్యపై హత్యయత్నానికి లక్ష్మయ్య ప్రయత్నించాడు. 
 
ముఖంపై కత్తితో నరికాడు. మరోసారి పొడిచేందుకు ప్రయత్నించడంతో శివయ్య కేకలు వేశాడు. దీంతో పరార్‌ అయ్యారు. నిందితులు వినయ్, లక్ష్మయ్యను మంగళవారం అరెస్టు చేశారు. ఇద్దరినీ రిమాండ్‌కు పంపించారు. ఈ కేసులో నిందితురాలైన శివయ్య భార్య సుజాత పరారీలో ఉందని, త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.