ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : బుధవారం, 3 జూన్ 2020 (19:01 IST)

తిరుపతి: వేంకటేశ్వర స్వామి భూముల విక్రయం ఎందుకు? టీటీడీ అధికారులు ఏమంటున్నారు

తిరుపతికి 800 కిమీ దూరంలో తమిళనాడులోని ఓ ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానాలకు 10 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. దాని చుట్టూ పొలాలే ఉన్నాయి. నీరు లేదు. దారి లేదు. ఆ భూమికి కౌలుకు ఇద్దామన్నా వందల రూపాయల కంటే ఎక్కువ రాదు.

 
ఈ పరిస్థితుల్లో టీటీడీ ఆ భూమిని అలా పొదల మధ్య వదిలేయాలా? ఐదు వందలకో వెయ్యికో కౌలుకు ఇవ్వాలా? పోనీ కౌలుకు ఇవ్వాలన్నా, ఆ ప్రక్రియ చేపట్టడానికి వేల రూపాయలు ఖర్చు పెట్టి అంత దూరం వెళ్లాల్సి ఉంటుంది.. అంటే ఆ రూపంలో భక్తుల సొమ్మును వృథా చేసినట్టే! ఈలోగా ఆ భూమిని పక్క భూమి యజమానులు కలిపేసుకుంటే… అప్పుడు ఏం చెయ్యాలి?

 
కంచిలోని ఒక పారిశ్రామిక ప్రాంతంలో టీటీడీకి ఉన్న ఒక ప్రాపర్టీ లీజుకు ఇవ్వడానికి వేలం పెట్టారు. వచ్చేవారు రూ.2 వేలు, రూ.2,300 కంటే ఎక్కువ కోట్ చేయడం లేదు. కానీ దాన్ని నిర్వహణ కోసం పెట్టే ఖర్చులు, పన్నుల భారం కలపి ఏడాదికి రూ.70 వేలు అవుతోంది.

 
మరోచోట బాగా దెబ్బతిన్న ఆస్తి ఒకటి ఉంది. ఉండటానికి పనికిరాదు. కానీ పన్ను మాత్రం కట్టాలి. మరోచోట ఇళ్ల మధ్య ఫ్లాట్ ఉంది. దాన్ని భజన కార్యక్రమాలకు అప్పగిస్తే, చుట్టూ ఉన్న వారికి ఇబ్బంది. ఏం చేయాలి? ఈ ఆస్తులన్నీ కొద్ది రోజుల క్రితం టీటీడీ వేలం వేయాలని ఆగిపోయిన వాటిల్లో కొన్ని.

 
స్వామికి బహుమానమా.. భారమా ?
‘‘ఇప్పుడు వాటిని గిఫ్టుగా ఇచ్చారని అలాగే పెట్టుకోవాలా? లేదా 2 వేల రూపాయలకే లీజుకు ఇవ్వాలా? నష్టమైనా ఫరవాలేదు, మనకు భక్తులు డబ్బులు ఇస్తున్నారు కదా, ఆ డబ్బుతో ఆ వాటి నిర్వహణ భారం మోయాలా ? కొన్ని ఆస్తులు భవిష్యత్తులో విలువ తగ్గుతాయి. వాటినేం చేయాలి? దీనికి తోడు ఈ టెండర్లు ప్రొసెస్ చేయడానికి తిరుపతి నుంచి దేవస్థానం ఉద్యోగులను వేల రూపాయలు ఖర్చుపెట్టి వందల కిమీ దూరం పంపాలి. నోటిఫికేషన్ వేయాలి. ఈలోపు ఎవరైనా ఆక్రమణ చేసి వెకేట్ చేయకపోతే లీగల్ యాక్షన్ తీసుకోవాలి. ఆ ఖర్చంతా భక్తుల సొమ్మే కదా?’’ ఆస్తుల అమ్మకం నిర్ణయం ఎందుకు అని టీటీడీ ఉన్నతాధికారి ఒకరిని బీబీసీ ప్రశ్నించినప్పుడు.. ఆయన ఇచ్చిన సమాధానం ఇది.

 
‘‘మేం అమ్మేది డబ్బు కోసం కాదు. నిజంగా టీటీడీ డబ్బుకోసం అమ్మదలచుకుంటే, పది ఎకరాలు అమ్మితే 400 కోట్లు వచ్చే ఆస్తులు కూడా ఉన్నాయి. కానీ అవి భవిష్యత్తులో ఉపయోగపడతాయని అలా ఉంచేశాం. తప్పని పరిస్థితుల్లోనివే అమ్ముతున్నాం. చాలా చాలా చిన్న ఆస్తి అయి, ఇప్పుడూ, భవిష్యత్తులోనూ ఏ రకంగానూ ఉపయోగపడే విధంగా లేనివి, ఆక్రమణల నుంచి కాపాడలేనివి అనుకున్నవి మాత్రమే అమ్ముతున్నాం. అమ్మగా వచ్చిన డబ్బు కూడా శ్రీవారి కార్పస్ ఫండ్ లోనే వేస్తాం. ఈ జాబితాలో ఉన్నవి ఒకటి నుంచి 5 సెంట్లలోపు ఉన్న ఖాళీ ఇంటి స్థలాలు, 10 సెంట్ల నుంచి ఎకరం లోపు విస్తీర్ణం ఉన్న వ్యవసాయ భూములూ ఉన్నాయి. ఎకరం కంటే పెద్దవి మూడే ఉన్నాయి.’’ ఆ అధికారి తన వివరాలు వెల్లడించవద్దని కోరారు.

 
టీటీడీ భూముల అమ్మకం వివాదం అయిన పరిస్థితుల్లో, అసలు టీటీడీ ఎందుకు భూములు అమ్ముతోందనే పరిశీలన చేసింది బీబీసీ. ఓవైపు టీటీడీ భూముల అమ్మకం విషయంలో తీవ్రంగా స్పందించిన రాజకీయ పార్టీలు, అదే భూములను ఆక్రమణ నుంచి రక్షించే, విడిపించే విషయంలో మాత్రం అంతకు చురుగ్గా లేవు.

 
‘‘మనం వాడుకోక, ఎవరూ లీజుకు తీసుకోక ఖాళీగా వదిలేస్తే ఎలా? తరువాత ఎవరైనా ఆక్రమిస్తారు. ఒక్కో చోట ఒక్కో మనిషిని పెట్టలేం కదా? పెద్దవైతే గోడ కడతాం. చిన్నవి అలా కూడా చేయలేం కదా. తిరుపతిలోనే కోట్ల రూపాయల స్థలాలు ఆక్రమించి ఇళ్లు కట్టేశారు. కోర్టుకు వెళ్లాం. ఈలోపు ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. కోర్టులో ఆక్రమణదారులకు ఫేవర్ గా వచ్చినవెన్నో ఉన్నాయి. పోనీ డబ్బులు కట్టించుకుని రెగ్యులరైజ్ చేద్దామా అంటే, అలే చేస్తే ఇంకా ఆక్రమణలు పెరిగిపోతాయి కాబట్టి అలా చేయకూడదంటూ ఇంకెవరో కోర్టుకెళ్లి స్టే తెచ్చారు. తిరుపతికి 800-900 కిమీల దూరంలో ఒక సెంటు, రెండు సెంట్లూ, దెబ్బతిన్న ఇళ్లూ, పది సెంట్ల కంటే తక్కువ పొలాలూ ఉన్నాయి. 20-30 ఏళ్ల నుంచి అవి అలాగే ఉన్నాయి. ఆస్తుల పర్యవేక్షణకు ప్రతీ ఏటా వెళ్లి రావడం కూడా వ్యయ ప్రయాసలతో కూడినదే’’ అని సదరు అధికారి వివరించారు.

 
ఎలామొదలైంది?
వేంకటేశ్వర స్వామికి భక్తులు డబ్బు, బంగారం, వస్తువులతో పాటూ ఆస్తులు కూడా ఇస్తారు. ఖాళీ స్థలాలు, ఇళ్లు, పొలాలు స్వామికి సమర్పించుకుంటారు. కొందరు వాటిని దేవస్థానం అధికారులకు అందజేస్తే, కొందరు పత్రాలను హుండీలో కూడా వేస్తారు. ఇలా వచ్చిన వాటిని టీటీడీ ఆస్తుల విభాగం వారు పరిశీలించి స్వాధీనం చేసుకుంటారు. అయితే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచీ ఆస్తులు వస్తుంటాయి. వాటిలో కొన్ని వివాదాల్లోనూ, వారసత్వ గొడవల్లో ఉన్న ఆస్తులు కూడా ఉంటాయి. తమ ఆధీనంలో ఉన్న వాటి నిర్వహణను టీటీడీ చూసుకుంటుంది. గొడవల విషయంలో అధికారులు, న్యాయ నిపుణులతో మాట్లాడి టీటీడీ బోర్డు తుది నిర్ణయం తీసుకుంటుంది.

 
ఆ క్రమంలో నిర్వహణ కష్టంగా ఉన్న ఆస్తులు, భవిష్యత్తులో దేవస్థానానికి ఉపయోగపడవు అని భావిస్తున్న కొన్ని స్థలాలను అమ్మాలని దేవస్థానం బోర్డు నిర్ణయించింది. ఇదే తాజా వివాదానికి కారణం అయింది. తమిళనాడులోని 23 స్థలాలను బహిరంగ వేలంలో అమ్మాలని టీటీడీ నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం రాజకీయ దుమారాన్ని రేపింది. మొత్తం 53 స్థలాలు ఉన్నప్పటికీ, తాజా గొడవకు కారణమైన నోటిఫికేషన్ మాత్రం తమిళనాడులోని 23 ఆస్తుల అమ్మకానికి సంబంధించినది.

 
2015 జూలైలో అప్పటి టీటీడీ బోర్డు ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో ఒక ఉప సంఘం వేశారు. అందులో ప్రస్తుత బీజేపీ నాయకులు జి.భాను ప్రకాశ్ రెడ్డి, జె.శేఖ‌ర్‌, డి.పి.అనంత, ఎల్లా సుచ‌రిత, తెలంగాణ నుంచి అప్పటి టిడిపి ఎమ్మెల్యేగా సండ్ర వెంక‌ట వీర‌య్యలు ఉన్నారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదికలో ‘ఆదాయం లేని, నిర్వహించలేని, దూరంగా ఉన్న భూములు గుర్తించి అమ్మవచ్చనీ, అమ్మగా వచ్చిన సొమ్మును టీటీడీ కార్పస్ ఫండ్‌కి జమ చేయాలని’ ఆ నివేదకి స్పష్టం చేసింది.

 
ఆ ఉప సంఘం ఇచ్చిన నివేదికను 2016 జనవరిలో కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన పాలకమండలి ఆమోదించింది. కానీ ఆ భూములు వేర్వేరు ప్రాంతాల్లో ఉండడం వల్ల, అక్కడొకటీ, అక్కడొకటీ ఉండడం వల్ల, ఇతర పనుల్లో అధికారులు తీరిక లేకుండా ఉండటం వల్ల అమ్మకానికి సంబంధించి విధి విధానాలు నెమ్మదిగా జరుగుతూ వచ్చాయి. వాస్తవానికి ఆ ఉప సంఘం ముందు మొత్తం 53 స్థలాల గురించిన ప్రతిపాదన ఉంచగా, వాటిలో మూడు మినహా మిగిలిన స్థలాల అమ్మకానికి సంఘం ఒప్పుకుంది. ఆ మిగిలిన మూడు ఆస్తుల విషయంలో వివాదాలున్నాయి.

 
2020 ఫిబ్రవరి 29న వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశం ఆ ప్రక్రియపై ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. వీటిలో 23 ఆస్తులను టీటీడీ బహిరంగ వేలం ద్వారా అమ్ముతుండగా, 17 ఆస్తులను ఏపీలోని జిల్లా కలెక్టర్లు అమ్ముతారు. రిషీకేష్‌లో ఉన్న స్థలం సహా మరికొన్ని పట్టణ ప్రాంతాల ఆస్తులను ఈ టెండరింగ్ ద్వారా ఎంఎస్టీసీ సంస్థ అమ్ముతుంది. దానికి అనుగుణంగా 23 స్థలాల విషయంలో 2020 ఏప్రిల్ 30న టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని తిరుమల బడ్జెట్ సమయంలో మీడియా ముందు ప్రకటించారు కానీ, అప్పుడు ఇది వివాదం కాలేదు.

 
టీటీడీకి భూముల్ని అమ్మే హక్కు ఉందా?
1990 ఏప్రిల్ నాటి జీవో నంబర్ 311 ప్రకారం, టీటీడీ అవసరం లేదా లాభం కోసం, టీటీడీ లక్ష్యాల కోసం, సరైన కారణాలతో అమ్ముకోవచ్చు. 2002 జూలై నాటి జీవో 405 ప్రకారం పట్టణ ప్రాంతాల్లోని ఎండోమెంటు ఆస్తులు అమ్ముకోవచ్చు. అయితే ఎండోమెంట్ భూముల అమ్మకాలకు ముందుగా హైకోర్టు అనుమతి అవసరం. కానీ ఆ నిబంధన టీటీడీకి వర్తించదు. అంటే టీటీడీ భూముల అమ్మకాలకు హైకోర్టు అనుమతి అక్కర్లేదు.

 
టీటీడీ భూములు అమ్మకూడదంటూ 2005 నవంబరులో కొందరు కోర్టుకు వెళ్లారు. అసలు ఉపయోగం లేని, ఇళ్ల మధ్యన ఉండీ, ఆక్రమణకు గురయ్యే అవకాశం ఉన్న భూములను, నామినేషన్ పద్ధతిలో కాకుండా, బహిరంగ వేలంలో అమ్ముకోవచ్చని కోర్టు టీటీడీకి అనుమతి ఇచ్చింది.

 
‘‘టీటీడీకి సుమారు 6 వేల ఎకరాలు భూములు ఉంటాయని అంచనా. ఇప్పుడు అమ్మాలనుకున్నది 6 ఎకరాలు. 98 శాతం భూములు అమ్మరు. కానీ 2 శాతం అమ్మాల్సి వస్తుంది. ఆమాటకొస్తే 1974 నుంచి ఇప్పటి వరకూ రకరకరాల ప్రభుత్వాల, బోర్డుల హయాంలో టీటీడీ అమ్మినవి కేవలం 129 ఆస్తులే’’ అని వివరించారు టీటీడీలో పనిచేస్తోన్న పేరు చెప్పడానికి ఇష్టపడని మరొక అధికారి. అయితే ఇక సమీప భవిష్యత్తులో టీటీడీ భూములు అమ్మే అవకాశం లేదు. ఇది రాజకీయ వివాదంగా మారడంతో, రాష్ట్ర ప్రభుత్వ సూచనతో, మొత్తం భూములు అమ్మే నిర్ణయాన్నే వెనక్కు తీసుకుంది టీటీడీ.

 
టీటీడీ భూముల బాధ్యత ఎవరిది?
తిరుపతి దేవస్థానాల భూముల గొడవ ఏళ్ల నుంచి ఉంది. రాజుల కాలం నాటి అగ్రహారాల గొడవ వేరే కథ. ఇక ఈస్ట్ ఇండియా కంపెనీ, దేవస్థానం నిర్వహణని హాథీరాంజీ మఠానికి ఇచ్చినప్పుడు గుడి భూములు చాలా వరకూ మఠం పేరిట నమోదయ్యాయి. 1935లో బ్రిటిష్ పాలనలో మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి ఒక కమిషనర్ ని పెట్టి, మఠం చేతుల్లోంచి పాలన ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుంది. అప్పుడే టీటీడీ మఠంపై కేసు పెట్టి తిరుపతిలోని 4 వేల ఎకరాలను 1940లలో స్వాధీనం చేసుకుంది. భూములనే యూనివర్సిటీలు, ఆసుపత్రులకు ఇచ్చారు.

 
ఇప్పటికీ హాథీరాంజీ మఠానికి చెందిన మహారాష్ట్రలోని 300 ఎకరాలు, తమిళనాడులోని 250 ఎకరాలు భూమిపై టీటీడీకీ, హాథీరాం మఠానికీ గొడవలు ఉన్నాయి. తరువాత కూడా తిరుపతి భూముల నిర్వహణ అలా అలా జరిగిపోతూ వచ్చింది. 1991లో మొదటిసారి టీటీడీ భూములు చూడడానికి టీటీడీ ఎస్టేట్స్ విభాగాన్ని ఏర్పాటు చేసి దానికి డిప్యూటి కలెక్టర్ స్థాయి అధికారిని నియమించారు. ప్రస్తుతం ఆ విభాగం పరిధిలోనే ఈ భూముల నిర్వహణ ఉంటుంది. పూర్వం నుంచి తిరుపతి దేవస్థానం భూములతో పాటూ, కొత్తగా టీటీడీ చేతికి వచ్చిన గుళ్ల భూములు వాటి ఆక్రమణలు కూడా టిటిడి ఎస్టేట్స్ విభాగం చూస్తుంది.

 
ఆక్రమణల సంగతి?
ఆలయ భూముల ఆక్రమణలు చాలా పెద్ద కథ. టెంపుల్ ప్రొటెక్షన్ ఫోర్స్ నిర్వహిస్తోన్న హైదరాబాద్ చిలుకూరు వేంకటేశ్వర స్వామి దేవస్థానం అర్చకులు రంగరాజన్ లెక్క ప్రకారం, రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 33 వేల ఎకరాల దేవాలయ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. టీటీడీ అందుకు మినహాయింపు కాదు. ‘‘చెన్నైలోని రాయపేటలో ఒక టీటీడీ స్థలాన్ని లీజుకు ఇచ్చాం. గడవు తీరాక కూడా, వాళ్లు ఖాళీ చేయలేదు. ఏం చేయాలి? కోర్టుకు వెళ్లాం. ఇప్పుడు కేసు నడుస్తోంది.’’ అన్నారు టీటీడీ లీగల్ సెల్‌కి చెందిన ఒక అధికారి.

 
‘‘ఇప్పుడు వీటి అమ్మకం గురించి మాట్లాడే నాయకులు, ఆ ఆక్రమణలను ఖాళీ చేయించగలరా?’’ అన్ని ప్రశ్నించారు టీటీడీలో రిటైర్ అయిన మరో ఉన్నతాధికారి. ‘‘దేవస్థానం భూములు ఖాళీ చేయించే సత్తా ఏ పార్టీకీ లేదు. ఎందుకంటే అలా చేస్తే ఓట్లు పోతాయి. ఆక్రమించకముందు మీరేం చేశారు అంటారు మమ్మల్ని. కాపాడగలిగే వాటిని కాపాడతాం. కాపాడలేని వాటిని ఇలా తీసేస్తాం అంటే అడ్డు పడతారు. కాపాడే పరిస్థితి లేని భూములను అమ్మనివ్వరు, ఆక్రమిస్తే విడిపించనివ్వరు. మరేం చేయాలి? మేం అమ్మం. వాటిని ఎలా కాపాడాలో వారినే సలహా ఇవ్వమనండి’’ అంటూ అన్ని రాజకీయ పార్టీలపై అసహనం వ్యక్తం చేశారు సదరు రిటైర్డ్ అధికారి.

 
‘‘దేవస్థానికి బహుమానంగా కొందరు కొంత బంగారం ఇస్తారు. వారు ఇచ్చిన ఆభరణం అలానే ఉంచకుండా, దాన్ని కరిగించి మరో రూపంలో మార్చి భద్రపరుస్తున్నారు. బంగారాన్ని కరిగించి రూపం మార్చినప్పుడు, భూమిని అమ్మి ఆ డబ్బుని తిరిగి దేవుడికే చెందేలా కార్పస్ ఫండ్లో వేస్తే తప్పేంటి? తేడా ఏంటి? అసలు నేనిచ్చింది ఇందుకే వాడాలి అనే షరతులతో ఇచ్చే దానాలు దేవస్థానం తీసుకోదు. షరతులతో ఇస్తే దానమే కాదు’’ అని వ్యాఖ్యానించారు ఆ అధికారి. ‘‘గిఫ్టుగా ఇచ్చింది అలాగే ఉంచాలి, దాన్నేం చేయకూడదు అంటే అసలు గిఫ్టు ఇవ్వడం ఎందుకు?’’ అని ఆయన ప్రశ్నించారు. భూ ఆక్రమణల విషయంలో తాము చెయ్యాల్సిందంతా చేస్తున్నామనీ, చట్ట ప్రకారం భూముల స్వాధీనం కోసం ప్రయత్నిస్తున్నామనీ వివరించారు ఎస్టేట్ అధికారులు. నిజానికి భూములు ఆక్రమణ కాకుండా కాపాడల్సింది వారే.

 
‘‘టీటీడీకి రావాల్సిన భూముల విషయంలో కూడా మేం పనిచేస్తూనే ఉన్నాం. దాతలు, భక్తుల సాయంతో ఆ పని జరుగుతోంది. తమిళనాడు కుంభకోణం దగ్గర దేవస్థానానికి చెందిన 22 ఎకరాలు స్వాధీనం చేసుకున్నాం. ఆ భూమి దేవస్థానానికి ఇచ్చి వందేళ్లయింది. దాన్ని మేం ఇప్పుడు స్వాధీనం చేసుకోగలిగాం. అప్పట్లో తిరుమలై దేవస్థానం అని రికార్డుల్లో ఉంది. మా రికార్డులు, అక్కడి స్థానిక రికార్డులు చూసి తీసుకున్నాం. తమిళనాడు, మహారాష్ట్రల్లోని హాథీరాం భూముల పనులు జరుగుతున్నాయి. మనవి అనుకున్నవి ఎక్కడున్నా, ఎలా ఉన్నా పోరాడి స్వాధీనం చేసుకుంటున్నాం.

 
కానీ కొన్ని మాత్రమే అమ్మక తప్పని పరిస్థితుల్లో ఉంటాయి. అందు కోసం ప్రత్యేకంగా న్యాయవాదుల బృందం ఉంది. చాలా కేసులు గెలుస్తున్నాం. ఉదాహరణకు హైదరాబాదులో రామకృష్ణ మఠం వాళ్లు టీటీడీకి ఐదెకరాలు ఇచ్చారు. వారికో ఐదెకరాల స్థలం ఉంది. అది విల్లు ద్వారా వచ్చింది. కానీ ఎవరో, 2000వ సంవత్సరానికంటే ముందే, నకిలీ విల్లు, నకిలీ పత్రాలు సృష్టించి అక్కడ అపార్టుమెంట్లు కట్టేశారు. దానిపై హైదరాబాద్ కోర్టుల్లో కేసు ఉంది. త్వరలోనే మేమా కేసు గెలవబోతున్నాం. సినీ నటి కాంచన టీటీడీకి 30 సెంట్లు ఇచ్చారు. అది చాలా మంచి స్థలం. కానీ అందులో 7 ఆక్రమణలు ఉన్నాయి. టీటీడీ డబ్బు, సమయం, శక్తి పెట్టి హైకోర్టులో పోరాడి, ఆ స్థలం నుంచి ఆక్రమణలు తొలగింపచేశాం. కాంపౌండ్ గోడ కట్టి భద్రం చేశాం’’ అని టీటీడీ ఉన్నతాధికారి ఒకరు వివరించారు.
 
నిజానికి భూములు అమ్మడమే కాదు, చాలా సందర్భాల్లో భక్తుల డబ్బుతో భూములు కొంటోంది టీటీడీ. రోడ్ల వెడల్పు కోసం, మండపాలు, గుళ్లు ఇతర అవసరాల కోసం వీటిని కొంటున్నారు.