బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 నవంబరు 2019 (17:38 IST)

భర్తకు పెళ్లి చేసిన భార్య... ఎక్కడ?

భర్తకు భార్య స్వయంగా పెళ్లి చేసిన అరుదైన ఘటన ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలోని మత్తిలి సమితిలో చోటుచేసుకుంది. కుమార్‌పల్లి గ్రామానికి చెందిన రామ కావసీకి కొన్నేళ్ల క్రితం గాయత్రి అనే అమ్మాయితో వివాహం జరిగింది. భర్త రోజువారీ కూలీ పనుల నిమిత్తం కొంతమంది కార్మికులతో కలిసి గ్రామం సహా గ్రామ చుట్టు పక్కల ప్రాంతాలకు వెళ్తుండేవాడు. 
 
ఈ క్రమంలో ఐత మడకామి అనే మహిళతో రామ కావసీకి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారి, అనంతరం అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇదిలావుండగా, ఉదయం తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా రామ కావసీని ఐత మడకామి అడిగింది. పెళ్లి చేసుకోకపోతే తనను మోసం చేశావని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. 
 
తనకు పెళ్లి అయిందని, ఇప్పటిలో పెళ్లి చేసుకోలేనని రామ కావసీ తెగేసి చెప్పడంతో తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని మత్తిలి పోలీస్‌ స్టేషన్‌లో ప్రియుడు రామ కావసీపై ఐత మడకామి కేసు పెట్టింది. ఇదే విషయం తెలుసుకున్న రామ కావసీ భార్య గాయత్రీ తన భర్త జైలు పాలైతే తన కుటుంబం వీధి పాలవుతుందని భావించింది. 
 
ఇద్దరికీ పెళ్లి చేస్తే తన భర్త ఊరిలోనే ఉంటాడు కదా అని ఆలోచించింది. అనుకున్నదే తడవుగా తన అత్తమామలు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులందరినీ ఒప్పించింది. ఊరిలోని సిద్ధిఈశ్వర్‌ మందిరానికి వారిని తీసుకువెళ్లి పూజారి సమక్షంలో గ్రామస్తుల మధ్య వారిద్దరినీ అగ్నిసాక్షిగా ఒక్కటి చేసింది. 
 
ఇకనుంచి ఎటువంటి గొడవలు లేకుండా ముగ్గురం కలిసి ఒకే ఇంట్లో ఉంటామని వారు చెప్పడంతో గ్రామస్తులంతా సంతోషించారు. ప్రస్తుతం ఐత మడకామి రామ కావసీపై పెట్టిన కేసును విత్‌డ్రా చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.