బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 7 ఏప్రియల్ 2021 (11:22 IST)

పంచాయతీ ఎన్నికలు ముగిసినా వైసీపీ దాదాగిరి ఆగడం లేదు: కింజరాపు అచ్చెన్నాయుడు

వైసీపీ నేతలు మానవత్వం మరచి ప్రవర్తిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు ముగిసి నెలలు గడుస్తున్నా వైసీపీలో మాత్రం ఓటమి బాధ ఇంకా తొలగలేదని టీడీపీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
 
 "గుంటూరు జిల్లా మాచవరం మండలం కొత్తపాలెం గ్రామంలో గర్భిణి రోజాను వైసీపీ గూండాలు గర్భంపై తన్నారు. ఆమె భర్త గుడె రామారావు 590 ఓట్ల మెజారిటీతో సర్పంచ్ గా విజయం సాధించాడాన్న అక్కసుతోనే ఈ దారుణానికి ఒడిగట్టారు.

పెట్టుబడుల వీణ మోగాల్సిన రాష్ట్రంలో దౌర్జన్యం, దమనకాండ పెల్లుబుకుకోంది. ఓటమిని అంగీకరించలేని వైసీపీ నాయకులు దాడికి తెగబడిందిగాక తిరిగి మా కార్యకర్తలపైనే కేసులు పెట్టారు. గర్భిణీపై వైసీపీ నేతలు చేసిన దాడిని ఖండిస్తున్నా.

ప్రజా మద్ధతుతో గెలిచిన వారిపై దాడికి పాల్పడటం సిగ్గుచేటు. మీరు గెలిచిన చోట మా కార్యకర్తలు ఏమైనా దాడుల చేశారా? వైసీపీ క్రూరత్వం కొత్త పుంతలు తొక్కుతోంది. సమస్యను చెప్పుకునే పోలీసులు కూడా దారుణంగా వ్యవహరిస్తున్నారు.

మహిళల రోధన మీ కంటికి కనిపించడం లేదా? వైసీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్యనున్న గురుత్వాకర్షన శక్తి తొలగాలి. లేదంటే ప్రజలే మీ శక్తిని నశింపజేస్తారు. మహిళకు హోంమంత్రి పదవి ఇచ్చినా ప్రయోజనం ఏంటి.?

మహిళా కమిషన్ ఎవరిని ఎక్కడుందో తెలుసుకోవడానికి మహిళలంతా కేసు పెట్టాలి. దిశ చట్టం పనిచేస్తుందా జగన్ రెడ్డి.? ఏపీని చూసి తమ రాష్ట్రంలోనే శాంతి భద్రతలు బాగున్నాయని బీహార్ భావిస్తోంది. అన్నొచ్చాడు.. అరాచకం సృష్టిస్తున్నాడని రాష్ట్రం మొత్తం భయపడుతోంది.

23 నెలల్లో ఎవరికి రక్షణ కల్పించారో సమాధానం లేదు. తండ్రిని కోల్పోయిన చెల్లికి జరుగుతున్న అన్యాయంతోనే రాష్ట్రంలో మహిళలకు భరోసా లేదని అర్థమైంది. ఏం జరుగుతున్నా పట్టించుకోని గుడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే.

మహిళలకు స్వేచ్ఛగా వెళ్లి జరిగిన అన్యాయాన్ని పోలీసులకు చెప్పుకునే స్థితి వుందా? మహిళల మాన, ప్రాణాలకు రక్షణ వుందా? కనీసం ఇప్పటికైనా తీరుమార్చుకుని మహిళలను కాపాడాలి.

ఆడబిడ్డల ఉసురు తగిలితే పుట్టగతులుండవు. 23 నెలలుగా మహిళలను కంట కన్నీరు మాత్రమే మిగిల్చారు. వచ్చే ఎన్నికల్లో మహిళల ఆగ్రహంతోనే వైసీపీ కనుమరుగు అవుతుంది" అని హెచ్చరించారు.