గురువారం, 27 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (13:29 IST)

జగన్మోహన్ రెడ్డి బహిరంగ లేఖ.. నిరుద్యోగ భృతిపై ఫైర్.. పవన్ ప్రస్తావన కూడా తెచ్చారెందుకు?

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి బహిరంగ లేఖ ద్వారా టీడీపీ తీరును ఎండగట్టారు. నిరుద్యోగ సమస్యను అస్త్రంగా ఉపయోగించారు. ఇదే లేఖలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ గురించి కూడా ప్రస్తావించడం ఆసక్తి రేపుతోంది.

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి బహిరంగ లేఖ ద్వారా టీడీపీ తీరును ఎండగట్టారు. నిరుద్యోగ సమస్యను అస్త్రంగా ఉపయోగించారు. ఇదే లేఖలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ గురించి కూడా ప్రస్తావించడం ఆసక్తి రేపుతోంది. నిరుద్యోగ భృతి హామీపై ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాసిన జగన్మోహన్ రెడ్డి.. గత ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పవన్ సైతం పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. దీనిని బట్టి అటు చంద్రబాబుతో పవన్‌ను కూడా జగన్ టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. 
 
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచిపోతున్నప్పటికీ.. ఇంతవరకు నిరుద్యోగ భృతి హామిని నిలబెట్టుకోలేకపోయిందని టీడీపీని జగన్ ఏకి పారేశారు. ఇందులో పవన్‌ను కూడా టార్గెట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇప్పటిదాకా జగన్, పవన్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న దాఖలాలు లేవు. కానీ ఈ లేఖలో జగన్ పవన్ పేరెత్తడం ద్వారా ఎన్నికల హామిలకు ప్రభుత్వంతో పాటు టీడీపీకి మద్దతునిచ్చిన పవన్ కూడా బాధ్యత వహించాలని జగన్ పరోక్షంగా ప్రస్తావించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
కాగా, నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.2వేలు చొప్పున ప్రతి నిరుద్యోగికి చెల్లించాల్సి వుంటుందని బహిరంగ లేఖ ద్వారా జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఆ లెక్కన ప్రభుత్వం 1.15 లక్షల కోట్లు బకాయిలు పడిందని జగన్ బహిరంగ లేఖలో పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ వర్గాలు మాత్రం జగన్ రాసిన బహిరంగ లేఖను తిప్పికొట్టే పనిలో ఉన్నాయి.