శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

20న క్వాష్ పిటిషన్‌పై సుప్రీం తీర్పు... తర్వాత ఏం చేద్దామంటూ సీఎం జగన్ సమీక్ష

ys jaganmohan reddy
తనపై అక్రమంగా నమోదు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసును కొట్టి వేయాలంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం తుది తీర్పును వెలువరించనుంది. సుప్రీం ద్విసభ్య ధర్మాసనం ఎలాంటి తీర్పును వెలువరిస్తుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొనివుంది. 
 
ఈ నేపథ్యంలో ఈ తీర్పు ఎలా ఉన్నప్పటికీ తదుపరి పరిణామాలపై చర్చించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లి ప్యాలెస్‌లో సమీక్ష నిర్వహించారు. గురువారం సీఎం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పర్యటనకు వెళ్తేన్న దృష్ట్యా ఈ అంశంపై ముందుగానే సమీక్ష చేపట్టారు. ఇందులో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డితో సీఎం తన నివాసంలో సమావేశమయ్యారు.
 
సుప్రీంకోర్టులో తీర్పు ఎలా వచ్చే అవకాశం ఉందనే అంశంపై సుప్రీంకోర్టు న్యాయవాదులు తెలిపిన అభిప్రాయాలను సీఎం తెలుసుకున్నట్టు సమాచారం. సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా.. తదుపరి అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. తీర్పు ఎలా వచ్చినా అందుకు తగినట్టుగా అప్రమత్తంగా ఉండాలని డీజీపీని సీఎం ఆదేశించారు. 
 
ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న పలు కీలక కేసుల పురోగతిపై డీజీపీ, ఏఏజీతో సీఎం ప్రత్యేకంగా చర్చించారు. స్కిల్ డెవలప్మెంట్, ఏపీ ఫైబర్ నెట్, రాజధాని అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల వ్యవహారంపై చర్చించారు. కేసుల విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై డీజీపీ, ఏఏజీకి సీఎం దిశానిర్దేశం చేశారు.