1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 18 జులై 2015 (12:31 IST)

మహబూబ్ నగర్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు వ్యతిరేకం : వైకాపా ఎంపీ మేకపాటి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహబూబ్ నగర్ ఎత్తిపోతల నీటి పథకానికి వైఎస్ఆర్ సీపీ కూడా వ్యతిరేకత తెలిపింది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ఎంపీ సీఎం రమేష్‌లు ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. దీనిపై తెలంగాణ అధికార పార్టీ నేతలు తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
ఈనేపథ్యంలో టీ ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు వ్యతిరేకమంటూ వైకాపా ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నీటి లభ్యతను ప్రశ్నార్థకం చేయనున్న సదరు ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. 
 
పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో ఆయన శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్టు మేకపాటి తెలిపారు. ముఖ్యంగా గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట, ఓటుకు నోటు కేసు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఏపీకి ప్రత్యేక హోదా తదితర అంశాలను పార్లమెంటు సమావేశాలలో ప్రస్తావించేందుకు నిర్ణయించామన్నారు.