1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 జనవరి 2024 (10:55 IST)

మంత్రి పెద్దిరెడ్డి కాళ్లు పట్టుకున్న వైకాపా దళిత ఎమ్మెల్యే.. ఎందుకో తెలుసా?

ycp mla aadimoolam
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక నియంతగా వ్యవహరిస్తుందని, ఒక్క రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే అమితమైన ప్రాధాన్యత ఇస్తూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వంటి అణగారిన వర్గాల ప్రజలను అణిచివేస్తూ, ఆ వర్గాలకు చెందిన నేతలను తమ కాళ్ల వద్ద ఉండేలా ప్రవర్తిందనే ఆరోపణలను గత కొంతకాలంగా విపక్ష రాజకీయ నేతలు చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని నిజం చేసేలా వైపాకాలోని కొందరు నేతలు నడుచుకుంటున్నారు. తాజాగా జగన్ మంత్రివర్గంలోని సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కాళ్లు అదే పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యే ఒకరు పట్టుకున్నారు. దీనికి కారణం లేకపోలేదు.
 
ఏపీ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం పోటీలో దింపే అభ్యర్థుల ఎంపికపై జగన్ అండ్ కో ముమ్మరంగా కృషి చేస్తుంది. ఇందులోభాగంగా, తిరుపతి జిల్లాలో దళిత సామాజికవర్గానికి చెందిన వైకాపా ఎమ్మెల్యేలు ముగ్గురిని మారుస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం శనివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిరుపతిలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంత్రి కాళ్లకు నమస్కరించడం చర్చనీయాంశమైంది. 
 
ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రిని కలిసినట్లు బయటకు చెబుతున్నా.. అంతర్గతంగా రానున్న ఎన్నికల్లో సీటు విషయమై అడిగినట్లు తెలుస్తోంది. నియోజకవర్గ పరిధిలో పనులన్నీ మంత్రి చెప్పినట్లుగానే చేసినట్లు ఇటీవల వైకాపా పెద్దల వద్ద ఎమ్మెల్యే తన ఆవేదనను తెలియజేసినట్లు తెలిసింది. 
 
ఈ క్రమంలోనే ఆయన శనివారం మంత్రిని కలిసి.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఇప్పటికే 'దళితులుగా పుట్టడం మేం చేసిన నేరమా.. పాపమా.. అదే మా కర్మా..' అంటూ పూతలపట్టు దళిత ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు బహిరంగంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో దళిత ఎమ్మెల్యే మళ్లీ అవకాశం ఇవ్వాలంటూ కాళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.