శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 16 జూన్ 2018 (13:11 IST)

ప్రేమ పెళ్లికి అంగీకరించలేదనే కాటసాని రామిరెడ్డి కుమారుడి ఆత్మహత్యనా?

కర్నూలు జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడు కాటసాని నాగార్జున రెడ్డి (27) ఆత్మహత్య కేసులో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌లో విద్యాభ్యాసం చేస్తూ వచ్చిన నాగా

కర్నూలు జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడు కాటసాని నాగార్జున రెడ్డి (27) ఆత్మహత్య కేసులో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌లో విద్యాభ్యాసం చేస్తూ వచ్చిన నాగార్జున రెడ్డి.. అక్కడ సహచర విద్యార్థినిని ప్రేమించి, ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలుపగా వారు ససేమిరా అన్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన నాగార్జున రెడ్డి తమ ఇంట్లోనే ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. దీంతో కాటసాని దంపతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
 
అయితే, కాటసాని నాగార్జున రెడ్డి అనారోగ్యంతో మృతి చెందినట్లు బనగానపల్లె సీఐ శ్రీనివాస్‌ విలేకర్లకు శుక్రవారం తెలిపారు. తన కుమారుడు కడుపునొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కాటసాని రామిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారని సీఐ తెలిపారు. ఈ మేరకు నాగార్జున రెడ్డి మృతదేహానికి బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 
 
కాగా, కాటసాని రామిరెడ్డికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారుడు నాగార్జున రెడ్డి, రెండో కుమారుడు ఓబుళరెడ్డి, కుమార్తెలు ప్రతిభ, ప్రణతి. నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కాటసాని రామిరెడ్డికి అల్లుడు. నాగార్జున రెడ్డి ఆత్మహత్య విషయం తెలియగానే పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందారెడ్డి, భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులు బనగానపల్లెకు చేరుకుని నాగార్జున రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. 
 
తన కుమారుడిపై మృతిపై కాటసాని రామిరెడ్డి స్పందిస్తూ, యువత ఆత్మహత్య చేసుకోవడం మంచిది కాదని హితవు పలికారు. తన కుమారుడు నాగార్జున రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం పుత్రశోకాన్ని మిగిల్చిందన్నారు. యువత తమ సమస్యలు ఉంటే స్నేహితులకు, బంధువులకు చెప్పుకొని సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోవాలేగానీ ఇలా బలవంతంగా ప్రాణాలు తీసుకుని తల్లిదండ్రులకు పుత్రశోకం మిగల్చవద్దని కోరారు.