శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 9 అక్టోబరు 2019 (19:49 IST)

తెలంగాణ ఆర్టీసీ: ఒకప్పుడు అత్యధిక బస్సులతో గిన్నిస్ రికార్డులకెక్కిన ఈ సంస్థ భవిష్యత్ ఏంటి?

ఆస్తుల పరంగా తెలంగాణ ఆర్టీసీ(టీఎస్ఆర్టీసీ) ఆర్థికంగా బలమైనది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీకి హైదరాబాద్‌లోనే ప్రధానమైన ఆస్తులు ఉండేవి. రాష్ట్ర విభజన సమయంలో "ఏ రాష్ట్రంలోని ఆస్తులు ఆ రాష్ట్రానికే" అన్న నిబంధన ఏర్పరచడంతో ఏపీఎస్ఆర్టీసీ కంటే టీఎస్ఆర్టీసీకి ఎక్కువ ఆస్తులు సంక్రమించాయి.

 
టీఎస్ఆర్టీసీకి ప్రధాన కార్యాలయం బస్ భవన్, దాని పక్కనే ఉన్న పాత బస్ భవన్ ఖాళీ స్థలం, హకీంపేటలోని అకాడమీ, తార్నాకలోని ఆసుపత్రి సహా పలు ఆస్తులు సంక్రమించాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ సహా ఇత బస్‌స్టాండ్లు దీనికి అదనం.

 
22 బస్సులతో ప్రారంభమై..
నిజాం రాజ్య రైలు, రోడ్డు రవాణా శాఖలో భాగంగా 1932లో ఆర్టీసీ ప్రస్థానం మొదలైంది. అప్పట్లో 22 బస్సులు, 166 మంది సిబ్బంది ఉండేవారు. అనంతరం ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాలు విలీనమయ్యాక 1958 జనవరి 11న ఏపీయస్ఆర్టీసీ ఏర్పడింది. అంతకుముందు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా ప్రభుత్వ రంగ రవాణా సంస్థ లేదు. ఆంధ్ర ప్రాంతంలో ప్రైవేటు బస్సులే తిరిగేవి.

 
ప్రపంచంలోనే అత్యధిక బస్సులున్న సంస్థ
ఒక దశలో ఉమ్మడి ఆర్టీసీ ప్రపంచంలోనే అతి ఎక్కువ బస్సులు కలిగిన సంస్థగా వరుసగా గిన్నిస్ రికార్డులు సృష్టించింది. రాష్ట్ర విభజన జరిగిన 2014 జూన్ 2 నాటికి ఆర్టీసీ విభజన పూర్తికాలేదు. ఆర్టీసీ ప్రధాన ఆస్తులు హైదరాబాద్‌లో ఉండిపోవడంతో విభజన సంక్లిష్టమైంది.

 
హైదరాబాద్‌లో ఉన్న ఆర్టీసీ ఆస్తుల్లో తమకూ హక్కు కావాలని ఏపీఎస్ఆర్టీసీ పట్టుపట్టినా ఫలితం లేకపోయింది. రాష్ట్ర విభజన తరువాత సంస్థ పూర్తిగా చట్టపరంగా విడిపోకపోయినా, వాస్తవికంగా విభజించి నిర్వహించారు. 2015 జూన్ 30 నుంచి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీగా ఏర్పడింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు 2016 ఏప్రిల్ 27న వచ్చాయి. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ఆర్టీసీకి పూర్తి స్థాయి ఎండీ లేరు.
వివరం సంఖ్య
నడుపుతున్న మొత్తం బస్సులు 10,460
సొంత బస్సులు 8,320
అద్దె బస్సులు 2,140
గరుడ, రాజధాని, వజ్ర 344
సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్, సెమీ ఎక్స్‌ప్రెస్ 2,526
పల్లె వెలుగు, మినీ పల్లె వెలుగు 3,744
సిటీ బస్సులు 3,816
ఎలక్ట్రిక్ బస్సులు 40
డిపోలు 97
బస్ స్టేషన్లు 364
బస్సులు కవర్ చేసే దూరం 35 లక్షల 29 వేల కిలోమీటర్లు
రోజూ ప్రయాణికులు ఒక కోటి 30 వేల మంది
కలిపే ఊర్లు 9,377 గ్రామాలు (పట్టణాలు, నగరాలు కాకుండా)
జోన్లు 3
రీజియన్లు 11
బస్సులు తిరిగే రూట్లు 3,653
రోజుకు సగటు ఆదాయం రూ. 11 కోట్ల 38 లక్షలు
రోజుకు తిరిగే సగటు కిలోమీటర్లు 35 లక్షల 20 వేల కిమీ
బస్సులో సీట్లు నిండే శాతం (ఆక్యుపెన్సీ రేషియో) 77
ఒక లక్ష కి.మీ.కి జరిగే ప్రమాదాల శాతం 0.06
మొత్తం ఉద్యోగులు 50,317