శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 29 ఏప్రియల్ 2020 (19:29 IST)

కరోనావైరస్: భారత్‌లో టెస్టింగ్ కిట్ల కొనుగోళ్లలో లాభాల వెనుక నిజం ఏంటి?

కరోనావైరస్ టెస్టింగ్ కిట్ల ధర గురించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)పై చాలా తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. 245 రూపాయల ఒక ర్యాపిడ్ డయాగ్నస్టిక్ కిట్‌ను కంపెనీల నుంచి ఐసీఎంఆర్ 600 రూపాయలు పెట్టి కొంటోందని ఆరోపణలు వస్తున్నాయి. అంటే కరోనా సమయంలో కూడా కొందరు లాభాలు సంపాదించడానికి వెనకాడడం లేదని, అది కూడా 145 శాతం ఎక్కువ లాభాలు కళ్లజూస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 
అయితే, ఈ మొత్తం అంశంలో స్పష్టత ఇచ్చిన ఐసీఎంఆర్ భారత ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా నష్టం రానివ్వబోమని చెప్పింది. కానీ టెస్టింగ్ కిట్ కొనుగోళ్లు, విక్రయాలు అందులో వచ్చే లాభాల కథ అక్కడితో ఆగిపోదు. మనం వాటి మూలాల్లోకి వెళ్తే, ఇప్పటివరకూ వెలుగులోకి రాని మరో కథ ఉందనే విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది.

 
వివాదం ఎక్కడ మొదలైంది?
నిజానికి, ఈ మొత్తం వివాదం దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఒక ఆదేశాల నుంచి మొదలైంది. వాటి గురించి తెలుసుకునే ముందు మనం కోవిడ్-19 పరీక్షలు రెండు రకాలుగా జరుగుతాయనే విషయం కూడా తెలుసుకోవాలి. మొదటిది RT-PCR టెస్ట్. ఇందులో రిపోర్ట్ రావడం ఆలస్యం అవుతుంది. కానీ భారత ప్రభుత్వం కోవిడ్ పరీక్షల కోసం ఎక్కువగా ఈ టెస్టులకే ప్రాధాన్యం ఇస్తోంది.

 
ఇక రెండోది ర్యాపిడ్ టెస్ట్ కిట్. ఇందులో నిమిషాల్లో ఫలితాలు వచ్చేస్తాయి. కానీ ఈ పరీక్షను భారత ప్రభుత్వం సర్వేలెన్స్ కోసమే చేయాలనుకుంటోంది. దానివల్ల మన శరీరంలో ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ ఉండేదా, ఇప్పుడు యాండీ బాడీస్ ఏవైనా తయారయ్యాయా అని తెలుసుకోవాలని అనుకుంటోంది.

 
భారత్‌లోని మాట్రిక్స్ ల్యాబ్స్ అనే కంపెనీ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్‌ను చైనా నుంచి దిగుమతి చేసుకుంటోంది. రేర్ మెటబాలిక్స్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వీటిని దేశమంతటా పంపిణీ చేస్తోంది. ఈ రెండు కంపెనీల మధ్య మార్చి నెలలో ఒక ఒప్పందం జరిగింది.

 
కానీ, ఈ రెండు కంపెనీల మధ్య డబ్బు లావాదేవీల విషయంలో వివాదం వచ్చింది. ఆ కేసు దిల్లీ హైకోర్టుకు చేరింది. రేర్ మెటబాలిక్స్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కోర్టులో పిటిషన్ వేసింది. ఒప్పందం ప్రకారం ఆ కంపెనీ దేశవ్యాప్తంగా ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ పంపిణీ చేయాలి. మాట్రిక్స్ ల్యాబ్ దేశంలోకి ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్లను దిగుమతి చేసుకుంటుంది.

 
చైనా నుంచి ఈ టెస్ట్ కిట్స్ దిగుమతి చేసుకునే మ్యాట్రిక్స్ ల్యాబ్స్, డెలివరీకి ముందే తమను డబ్బు డిమాండ్ చేస్తోందని రేర్ మెటబాలిక్స్ ఆరోపించింది. చైనా నుంచి దిగుమతి చేసుకునే ఒక కిట్‌ను ఆ కంపెనీ కేవలం 245 రూపాయలకు కొంటున్నట్లు కోర్టుకు తెలిసిందని కంపెనీ వకీల్ జయంత్ మెహతా బీబీసీతో ఈ కేసు విచారణ సమయంలో చెప్పారు.

 
దాంతో, కోర్టు “ప్రస్తుత సమయంలో టెస్టింగ్ కిట్ లాంటి అత్యవసర వస్తువుకు 245 పైన 155 రూపాయలు పెంచినా, ఆ కంపెనీకి 61 శాతం లాభం వస్తుంది. అది చాలా ఎక్కువ, కిట్ అమ్మేవాళ్లకు ఆ మాత్రం చాలు. అందుకే జీఎస్టీతో కలిపి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ ధర 400 రూపాయల కంటే ఎక్కువకు అమ్మకూడదని ఆదేశించింది.

 
ఈ ఆదేశాలతో చైనా నుంచి తెప్పించే కిట్ నిజానికి 245 రూపాయలకే వస్తుంటే, ఐసీఎంఆర్ ఒక కిట్‌కు ఆ కంపెనీకి 600 రూపాయలు చెల్లిస్తోందనే విషయం బయటపడింది. ఈ మొత్తం విషయం గురించి మాట్రిక్స్ ల్యాబ్స్ లాయర్‌ అమితాబ్ చతుర్వేదితో బీబీసీ మాట్లాడింది. “మేం డిస్ట్రిబ్యూటర్‌కు ఒక కిట్‌ను 400 రూపాయల లెక్కన ఇస్తున్నాం. కానీ, వారు దానిని ఐసీఎంఆర్‌కు, కొన్ని రాష్ట్రాలకు 600 రూపాయలకు పంపిణీ చేస్తున్నారు” అని ఆయన చెప్పారు.

 
చివరకు ఈ కేసును సెటిల్ చేసిన దిల్లీ హైకోర్టు రెండు కంపెనీల సమ్మతితో ఇక నుంచి టెస్ట్ కిట్‌ను 400 రూపాయలకే ప్రభుత్వానికి అమ్మాలని చెప్పింది. ఇదంతా కోర్టుకు ఎక్కడంతో 245 రూపాయల ధర ఉన్న ఒక టెస్టింగ్ కిట్‌ను, ప్రభుత్వం 600 రూపాయలకు, అంటే రెట్టింపు కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేసిందనే విషయం బయటపడింది.

 
రేర్ మెటబాలిక్స్ కంపెనీని 2015 మే 22న స్థాపించారు. దాని అడ్రస్ దిల్లీలోని ద్వారక ప్రాంతంలో రిజిస్టర్ అయి ఉంది. కంపెనీలో ముగ్గురు డైరెక్టర్లు ఉన్నారు. కృపా శంకర్ గుప్తా, శోభా దత్తా, శైలేష్ పాండే. 2019లో కంపెనీ టర్నోవర్ 6.19 కోట్లు ఉంది. బిజినెస్ టుడే పత్రిక వివరాల ప్రకారం కంపెనీ నెట్ వర్త్ 22.06 లక్షలు.

 
ఐసీఎంఆర్ వాదన, టెండర్లు పిలిచే ప్రక్రియ
దీనిపై వివాదం రేగడంతో ఐసీఎంఆర్ ఒక ప్రెస్ నోట్ జారీ చేసింది. మొత్తం అంశంపై స్పష్టత ఇచ్చింది. 2020 ఏప్రిల్ 27న జారీ చేసిన ఆ ప్రకటనలో అది రెండు ముఖ్యమైన విషయాలు చెప్పింది. చైనా నుంచి తెప్పించిన కిట్లు పనికిరాకపోవడంతో ప్రభుత్వం ఆ కంపెనీకి డబ్బు చెల్లించలేదని, ప్రభుత్వానికి ఇప్పటివరకూ ఎలాంటి నష్టం జరగలేదని చెప్పింది.

 
ఐసీఎంఆర్ మొట్టమొదట ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ కొనుగోలు కోసం టెండర్లు పిలిచినప్పుడు ఏ కంపెనీలూ దానికి ఆసక్తి చూపలేదు. రెండోసారి టెండర్లు పిలిచాక బయోమెడిక్స్, వోండఫో టెండర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. అన్ని షరతులూ పూర్తి చేసిన ఆ కంపెనీలు అతి తక్కువ ధరకు ఈ కిట్‌ను ప్రభుత్వానికి అందిస్తామని చెప్పాయి. అవి చెప్పిన ఒక ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ ధర 600 రూపాయలు.

 
ఇటు ఐసీఎంఆర్ కూడా, చైనా కంపెనీ నుంచి నేరుగా ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్‌లు కొనుగోలు చేయడానికి చాలా ప్రయత్నించామని, కానీ అందులో కొన్ని సమస్యలు ఎదురయ్యాయని చెబుతోంది. “ఆ కంపెనీ మొత్తం డబ్బు మొదటే ఇవ్వాలని డిమాండ్ చేసింది. కిట్ పాడైనట్లు తెలిస్తే, వాపసు తీసుకునే నిబంధన ఒప్పందంలో లేదు. ధర కూడా డాలర్ మారకం విలువకు తగ్గట్లు ఉంటుందని చెప్పింది. అన్ని కారణాల వల్ల చైనా నుంచి ఐసీఎంఆర్ నేరుగా కిట్స్ కొనుగోలు చేయలేకపోయింది” అని చెప్పింది.

 
“మేం, మొదటిసారి ఇలాంటి కిట్ విదేశాలనుంచి కొనుగోలు చేస్తున్నాం. అందుకే కంపెనీల నుంచి మాకు వచ్చిన కొటేషన్లే, మాకు రెఫరెన్స్ పాయింట్” అని ఐసీఎంఆర్ చెప్పింది. కానీ, ఆ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ సర్వేలెన్స్ కోసమే ఉపయోగపడతాయని ప్రభుత్వం ఎప్పుడూ చెబుతూ వచ్చింది. కోవిడ్ పరీక్షల కోసం RT-PCR కిట్‌ మాత్రమే ఉపయోగించాలని సూచించింది.

 
RT-PCR కిట్ ధరల్లో గందరగోళం
దేశవ్యాప్తంగా టెస్టింగ్ కిట్ల ధర గురించి రాజకీయాలు మొదలైనప్పుడు సోమవారం ఉదయం రాహుల్ గాంధీ దీనిపై ట్వీట్ చేశారు. “అన్ని దేశాలూ కోవిడ్-19 విపత్తుతో పోరాడుతున్నసమయంలో సైతం కొందరు అన్యాయంగా వచ్చే లాభాలు ఆర్జించడానికి వెనకాడడం లేదు. ఈ అవినీతి మనస్తత్వానికి సిగ్గుపడుతున్నా, అసహ్యంగా ఉంది. ఈ లాభాలు ఆర్జించేవారిపై వెంటనే కఠిన విచారణ జరిపించాలని మేం ప్రధానిని డిమాండ్ చేస్తున్నాం. దేశం వారిని ఎప్పటికీ క్షమించదు” అని రాహుల్ అన్నారు.

 
ఇంతకు ముందు కాంగ్రెస్ నేత డాక్టర్ ఉదిత్ రాజ్ కూడా తన ట్వీట్‌తోపాటు ఒక ఫొటో షేర్ చేశారు. ఇందులో ఎంత నిజం ఉందో నాకు తెలీడం లేదు అన్నారు. ఆ ట్వీట్‌లో ఒక అన్‌వెరిఫైడ్ అకౌంట్ నుంచి ఉన్న ఫొటోలో “భారత్‌లో 17 కంపెనీలు 500 రూపాయలకు కిట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ ప్రధాని ఒక గుజరాతీ కంపెనీకి కాంట్రాక్ట్ వచ్చేలా చేశారు. జయహో మోదీ సర్కార్” అని ఉంది. డాక్టర్ ఉదిత్ రాజ్ ట్వీట్‌కు ఐసీఎంఆర్ సమాధానం ఇచ్చింది.

 
“ఇది ఫేక్ న్యూస్. RT-PCR కోసం ఐసీఎంఆర్ 740-1150 రూపాయల ధర పెట్టింది. ర్యాపిడ్ టెస్ట్ కిట్ కోసం 528-795 రూపాయల ధర నిర్ణయించింది. దీనికంటే తక్కువ ధరకు ప్రభుత్వానికి కిట్ అందించేందుకు ఏ కంపెనీ ముందుకు వచ్చినా, అది ఐసీఎంఆర్ లేదా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ, రీసెర్చ్ విభాగం, అను నగర్‌ను సంప్రదించవచ్చు” అని చెప్పింది.

 
ఐసీఎంఆర్ 740-1150 రూపాయల ధర ఇస్తామని ట్వీట్‌లో చెప్పిన RT-PCR టెస్ట్ కిట్ కోసం ప్రజల నుంచి ప్రైవేట్ ల్యాబ్స్ 4500 రూపాయలు వసూలు చేస్తున్నాయి. దీంతో ప్రైవేటు ప్రయోగశాలలు ఏవీ కరోనా టెస్ట్ కోసం 4500 రూపాయలు వసూలు చేయకూడదని ఐసీఎంఆర్ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే 1150 రూపాయలకు లభించే కిట్ కోసం, అవి 4500 ఎందుకు వసూలు చేశాయి అనే ప్రశ్న కూడా వస్తుంది.

 
టెస్టింగ్ కిట్ ధరపై మొదటి నుంచి ప్రశ్నలు
నిజానికి కోవిడ్-19 టెస్ట్ కిట్ గురించి ప్రశ్నలు రావడం ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా అత్యున్నత న్యాయస్థానంలో కరోనాకు సంబంధించిన అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేయాలనే ఒక పిటిషన్ దాఖలైంది. ఏప్రిల్ 8న ఈ పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు ప్రైవేట్ ల్యాబ్స్‌లో కోవిడ్-19 పరీక్షలు ఉచితంగా చేయాలని ఆదేశించింది. అప్పుడు అదంతా జరిగింది RT-PCR టెస్ట్ గురించే.

 
కోవిడ్-19 టెస్ట్ ఉచితంగా చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన శంశాంక్ దేవ్.. తన కుటుంబంలో నలుగురు ఉన్నారని, అందరికీ టెస్ట్ చేయించాలంటే 18000 ఖర్చు అవుతుందని, అందుకే ఈ పిటిషన్ వేశానని బీబీసీతో చెప్పారు. అంతే కాదు, ఒక వ్యక్తికి ఒకసారి టెస్ట్ చేశాక పాజిటివ్ వస్తే, తర్వాత రెండు సార్లు టెస్ట్ చేయాల్సి వస్తుంది. రెండోసారి టెస్టులో నెగటివ్ వచ్చాకే వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారు. దాని ప్రకారం ఒక కుటుంబానికి టెస్టుల కోసమే 50 వేలకు పైగా అవుతుంది. మందులు, ఆస్పత్రిలో అడ్మిట్ కావడానికి ఖర్చులు వేరే ఉంటాయి.

 
కానీ సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చిన వెంటనే ఐసీఎంఆర్ కోర్టులో నిపుణుల అభిప్రాయం తెలుసుకున్న తర్వాతే ప్రైవేట్ ల్యాబ్స్‌లో RT-PCR టెస్ట్ ధర రూ.4500గా నిర్ణయించామని చెప్పింది. అయితే, ప్రైవేట్ ఆస్పత్రుల్లో అవసరమైన వారికి ప్రభుత్వం ఆయుష్మాన్ యోజన కింద ఉచితంగా టెస్టులు చేయిస్తోంది. "ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ టెస్ట్ ఉచితంగానే చేస్తున్నాం. కేవలం 12 శాతం మందే ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ టెస్ట్ చేసుకుంటున్నారు" అని ఐసీఎంఆర్ చెప్పింది.

 
ఆయుష్మాన్ యోజన, కోవిడ్-19 టెస్ట్
దీనిపై ఆయుష్మాన్ భారత్ యోజన సీఈఓ ఇందు భూషణ్‌తో బీబీసీ మాట్లాడింది. ఏప్రిల్ 4న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పటివరకూ 14 మందికి మాత్రమే ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ పరీక్షను ఉచితంగా నిర్వహించారని ఆయన చెప్పారు.

 
వాటిలో ఎక్కువగా 8 టెస్టులు మధ్యప్రదేశ్‌లో జరిగాయి. యూపీలో రెండు, హరియాణాలో రెండు, చత్తీస్‌గఢ్‌, కేరళలో ఒక్కొక్కరికి ఆయుష్మాన్ యోజన ప్రకారం ఉచితంగా టెస్టులు జరిగాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఈ పథకంలో దేశవ్యాప్తంగా 50 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని చెబుతోంది. ఇప్పుడు సుమారు 88 శాతం మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటూ ఉండడంతో ఆ సంఖ్య తక్కువగా ఉండచ్చని ఇందు భూషణ్ చెబుతున్నారు.

 
నిపుణుల అభిప్రాయం
కానీ నిపుణులు దానిని అంగీకరించడం లేదు. టెస్టింగ్ కిట్, వాటి ధరల పూర్తి వివాదంపై సీనియర్ హెల్త్ జర్నలిస్ట్ విద్యా కృష్ణన్‌తో బీబీసీ మాట్లాడింది. ఆమె ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. చాలా ఏళ్ల నుంచి ఆరోగ్యం గురించి పత్రికలకు రాస్తున్నారు. ఆమె ఆర్టికల్స్ ద అట్లాంటిక్, లాస్ ఏంజెల్స్ టైమ్స్‌లో ప్రచురిస్తారు. ఆమె ఈ టెస్ట్ కిట్ కొనుగోలు మొత్తం అంశాన్ని ఒక ‘స్కాండల్‌’గా భావిస్తున్నారు. ప్రభుత్వం పూర్తి హోంవర్క్ చేయలేదని, ప్రభుత్వం ఇచ్చిన వివరణలో కూడా చాలా లోపాలు ఉన్నాయని చెప్పారు.

 
”కేంద్ర ప్రభుత్వం రూ.600కు కొంటున్న అదే ర్యాపిడ్ టెస్ట్ కిట్‌ను చత్తీస్‌గఢ్ ప్రభుత్వం 337 రూపాయలకే కొనుగోలు చేసిందని విద్యా చెప్పారు. “చత్తీస్‌గఢ్ మోడల్ చాలా కచ్చితమైనది. కానీ ఇది అలా లేదు. ప్రభుత్వం కాస్త బేరసారాలు చేసి ఉంటే, వారికి కిట్ మరింత చౌకగా లభించి ఉండేది” అని చెప్పారు. ఫ్రాన్స్, దక్షిణాసియా దేశాలను విద్య ఉదాహరణగా చెప్పారు.

 
“రోగులెవరూ టెస్టులకు డబ్బులు చెల్లించకండి అని అమెరికాలో బోర్డులు పెట్టారు. బంగ్లాదేశ్‌లో కూడా ఈ టెస్ట్ ఉచితంగా చేస్తున్నారు. శ్రీలంకలో ప్రస్తుతానికి ప్రభుత్వ ల్యాబ్స్‌లో మాత్రమే ఈ టెస్టులు జరుగుతున్నాయి. పాకిస్తాన్‌లో ప్రైవేటు ల్యాబ్స్‌లో జరుగుతున్నాయి. కానీ ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఉంది, అది తక్కువగానే ఉంది” అన్నారు.

 
రోగులు డబ్బు చెల్లించి టెస్టులు చేయించుకోమంటే, వారు వ్యాధిని దాచిపెడతారని, దానివల్ల ప్రభుత్వానికి సమాజంలో వ్యాధి ఏ స్థాయికి చేరిందో తెలీకుండా పోతుందని ఆమె అన్నారు. “టెస్టింగ్ కోసం 4500 రూపాయలు నిర్ణయిస్తున్న సమయంలో ఐసీఎంఆర్ చాలా ప్రైవేటు కంపెనీలతో మాట్లాడినట్లు నాకు గత నెలలో తెలిసింది. ఆ కమిటీ గురించి, వారు ఏం మాట్లాడారు అనేది బయటకు రాలేదు. బయోకాన్ కంపెనీకి సంబంధించి కిరణ్ మజుందార్ షా బహిరంగంగానే తను ఆ కమిటీలో భాగం అని చెప్పారు. ఆ కంపెనీకి మాయ్ లాబ్స్‌తో భాగస్వామ్యం ఉంది. అది కోవిడ్ టెస్ట్ కిట్స్ తయారుచేస్తుంది. అందుకే అది ప్రయోజనాలకు విరుద్ధమే అవుతుంది. టెస్టింగ్ కిట్ల ధరల గురించి ఏ సమాచారం ఉన్నా, దానిని బహిరంగపరచాలి” అన్నారు.

 
బీబీసీతో మాట్లాడిన కిరణ్ మజుందార్ షా ఆ ఆరోపణలను ఖండించారు. తను ఏ కమిటీలో భాగం కాదని, కిట్ కొనుగోళ్లపై ప్రభుత్వంతో ఎప్పుడూ మాట్లాడలేదని చెప్పారు. అయితే ప్రభుత్వం తనను సంప్రదించిందని, ప్రైవేట్ ల్యాబ్స్‌లో కోవిడ్-19 టెస్టింగ్ చేయాలని ఒప్పించిందని ఆమె అంగీకరించారు.

 
“ప్రభుత్వ ల్యాబ్స్‌లో టెస్టులు చేస్తే సరిపోదని, ప్రైవేట్ ల్యాబ్స్ భాగస్వామ్యం కూడా కావాలని ప్రభుత్వానికి తెలుసు. మీ దగ్గర డయాగ్నస్టిక్స్ ల్యాబ్ లేవు, కానీ ప్రైవేట్ ల్యాబ్స్ ముందుకు వచ్చే పని మీరు మాత్రమే చేయగలరు అని ప్రభుత్వం నాతో అంది. దాంతో నేను ప్రైవేట్ ల్యాబ్స్‌తో మాట్లాడాను. అప్పుడు ఒక టెస్టుకు 4500 రూపాయలు అవుతుందని వారు చెప్పారు. నేను అదే ధర ప్రైవేట్ ల్యాబ్స్‌కు చెప్పాను. దానిపై తర్వాత అంగీకారం కుదిరింది” అన్నారు.

 
దేశంలో ఈ కిట్ తయారవడం మొదలైతే ఆ ధర తగ్గించవచ్చు అని కూడా అప్పుడు వారితో చెప్పానని ఆమె చెప్పారు. కిరణ్ చెప్పిన ఆ రేటు RT-PCR టెస్ట్ కిట్‌కి సంబంధించినది. ఆ టెస్ట్ కిట్‌లో ఏమేం ఉంటాయో తెలుసుకోవడం కూడా ముఖ్యం. “ఆ ధర కిట్‌కు మాత్రమే కాదు, అందులో టెస్ట్ చేసే వ్యక్తి, అతడి పీపీఈ, అతడు వచ్చిపోయే ఖర్చులు, ల్యాబ్ ఖర్చులు, టెస్ట్ చేయడానికి ఉపయోగించే వస్తువులు, కెమికల్స్ అన్నీ ఉంటాయి. అది అందరూ అనుకున్నంత సులభంగా ఉండదు. ఆ ధరకు పూర్తి బ్రేకప్ ఉంది” అని ఆమె చెప్పారు.

 
"ఈ టెస్ట్ కోసం ఉపయోగించే వస్తువుల ధర ఎప్పుడు తగ్గుతుందో, అప్పుడు టెస్ట్ కిట్ ధర కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు దీనిని దేశంలో 2000 రూపాయల్లో కూడా తయారు చేస్తున్నారని తెలిసింది" అన్నారు. ప్రభుత్వంలోని ఏ కమిటీలో ఎప్పుడూ తను భాగం కాలేదని, ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ చైనా నుంచి దిగుమతి చేసుకోవడంలో తన హస్తం లేదని కిరణ్ చెప్పారు.
 
ప్రస్తుతం ఇప్పటికి కూడా రెండు టెస్ట్ కిట్ల ధరల విషయంలో ఎలాంటి స్పష్టత లేదు. ర్యాపిడ్ టెస్ట్ కిట్ గురించి ప్రభుత్వం తమ వైఖరి, వివరాలు స్పష్టం చేశామని చెబుతున్నా, RT-PCR కిట్ అసలు ధరపై ఇప్పటికీ సందేహాలు అలాగే ఉన్నాయి.