బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 20 నవంబరు 2017 (15:22 IST)

నల్లధన భారతీయుల చిట్టా వెల్లడిద్దాం : స్విస్ పార్లమెంట్ ప్యానెల్

భారతీయ నల్లధన కుబేరుల గుట్టు త్వరలోనే బట్టబయలుకానుంది. స్విస్ బ్యాంకులో మూలుగుతున్న నల్లధనం వివరాలను బహిర్గతం చేసేందుకు స్విట్జర్లాండ్ పార్లమెంట్ ప్యానెల్ సమ్మతం తెలిపింది.

భారతీయ నల్లధన కుబేరుల గుట్టు త్వరలోనే బట్టబయలుకానుంది. స్విస్ బ్యాంకులో మూలుగుతున్న నల్లధనం వివరాలను బహిర్గతం చేసేందుకు స్విట్జర్లాండ్ పార్లమెంట్ ప్యానెల్ సమ్మతం తెలిపింది. దీంతో స్విస్ బ్యాంకులోని నల్లధన కుబేరుల ఖాతా వివరాలన్నీ బహిర్గతంకానున్నాయి. స్విస్ ఖాతాల సమాచారాన్ని భారత్‌తో పంచుకునేందుకు ఈ పార్లమెంట్ ప్యానెల్ ఓకే చెప్పింది. స్విస్ ఖాతాల సమాచార మార్పిడికి భారత్‌తో స్విట్జర్లాండ్ కుదుర్చుకున్న ఒప్పందానికి ప్యానల్ అంగీకరించింది.
 
ఇదేసమయంలో స్విస్ ప్రభుత్వానికి ప్యానల్ కొన్ని సూచనలు చేసింది. సమాచార మార్పిడికి ఆమోదం తెలుపుతూనే, ఖాతాదారుల వ్యక్తిగత రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేలా చట్ట సవరణ చేయాలని సూచించింది. సమాచార మార్పిడి నేపథ్యంలో, ఎక్కడా చట్టపరమైన సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవాలని కోరింది. నవంబర్ 27వ తేదీ నుంచి ప్రారంభంకానున్న స్విస్ పార్లమెంటు సమావేశాల్లో ఈ ప్రతిపాదనకు ఆమోదం పలకనున్నారు.
 
ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే... స్విస్ బ్యాంక్ ఖాతాదారుల పేర్లు, చిరునామా, ఖాతా నంబరు, పుట్టిన తేదీ, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ తదితర వివరాలను సంబంధిత దేశాలతో పంచుకునే అవకాశం స్విస్‌కు లభిస్తుంది. భారత్-స్విట్జర్లాండ్‌ల మధ్య ఈ ఒప్పందం వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానుండగా... 2019లో తొలి సమాచార మార్పిడి జరుగుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి. తాము పంచుకునే సమాచారాన్ని అత్యంత గోప్యంగా ఉంచాలని భారత్‌తో సహా ఇతర దేశాలకు స్విట్జర్లాండ్ విజ్ఞప్తి చేసిన విషయం తెల్సిందే.