శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 మార్చి 2020 (12:02 IST)

వైద్య పరికరాల ఉత్పత్తికి శ్రీకారం చుట్టనున్న రైల్వేబోర్డు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా మన దేశంలో కూడా లాక్‌డౌన్ ప్రకటించారు. మంగళవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన ఈ లాక్‌డౌన్‌తో అన్ని రంగాలు స్తంభించిపోయాయి. అయితే, మున్ముందు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వీలుగా రైల్వే శాఖతో పాటు.. దేశంలోని అన్ని ప్రభుత్వ శాఖలూ సిద్ధమవుతున్నాయి. ఎలాంటి అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు త‌మ ప‌రిధిలోని వ‌న‌రుల‌ను స‌మీక‌రిస్తున్నాయి. 
 
ఇందులోభాగంగా ఆస్పత్రుల్లో రోగుల‌కు అత్య‌వ‌స‌ర‌మైన బెడ్లు, స్ట్రెచర్లు, శానిటైజర్లు, వైద్య ట్రాలీలతో పాటు.. ఇతర వస్తువులను ఉత్పత్తి చేసేందుకు రైల్వేశాఖ స‌మాయ‌త్త‌మైంది. దేశ‌వ్యాప్తంగా ఉన్న రైల్వే ఉత్ప‌త్తి యూనిట్ల‌లో ధ‌వాఖానాల్లో అవ‌స‌ర‌మైన వ‌స్తువుల‌ను ఉత్ప‌త్తి చేసేందుకు ఏర్పాట్లు చేయాల‌ని ఆయా యూనిట్ల జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ల‌కు రైల్వేబోర్డు ఆదేశాలు జారీ చేసింది.
 
ముఖ్యంగా గుల‌కు అవ‌స‌ర‌మైన వ‌స్తువుల‌ను భారీ మొత్తంలో ఉత్ప‌త్తి చేసేందుకు గ‌ల అవ‌కాశాల‌ను త‌క్ష‌ణం ప‌రిశీలించాల‌ని, ఉత్ప‌త్తికి సంబంధించిన స‌మాచారాన్ని ఎప్పటిక‌ప్పుడు బోర్డుకు తెలుపాల‌ని ఆదేశించింది. ఎలాంటి వ‌స్తువుల‌ను ఉత్ప‌త్తి చేయాలో రైల్వే ప్రిన్సిప‌ల్ మెడిక‌ల్ డైరెక్ట‌ర్స్‌ను సంప్ర‌దించాల‌ని సూచించింది. 
 
కోవిడ్ వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ‌లో భాగంగా దేశ‌వ్యాప్తంగా ప్రయాణికుల రైలు స‌ర్వీసుల‌ను పూర్తిగా నిలిపివేసినప్పటికీ సంస్థ‌లో ప‌నిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్ ఉద్యోగుల‌కు వేత‌నాలు య‌ధావిధిగా చెల్లిస్తామ‌ని బోర్డు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఈ నిర్ణ‌యం క‌నీసం 50,000 మంది ఉద్యోగుల‌కు ప్ర‌యోజ‌నం చేకూరుస్తుంద‌ని తెలిపింది.