మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలన్న ఆసక్తి మీలో ఉందా?, ఆ సాహసం మీరు చేస్తారా?, ధైర్యం మీది... భరోసా మాది... రాష్ట్ర వ్యాప్తంగా యువతకు ఆహ్వానం పలుకుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఐదుగురు సభ్యులకు ఈ ఏడాది మౌంట్ ఎవరెస్ట్ ఎక్కే అవకాశం కల్పిస్తోంది. ఈ ఏడాది మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేందుకు యువత నుంచి యువజన సర్వీసుల శాఖ ఆహ్వానం పలుకుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాలనుకునే విద్యార్థులకు అవకాశం కలిగిస్తోంది ప్రభుత్వం. మౌంట్ ఎవరెస్ట్ పర్వతారోహణకు సంబంధించిన ప్రకటనను యువజన సర్వీసుల శాఖ విడుదల చేసింది. ‘మిషన్ ఎవరెస్ట్-ఏపీ యూత్ ఆన్ టాప్ ఆఫ ద వరల్డ్’ పేరుతో ఈ యేడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
హిమాలయ పర్వతశ్రేణుల్లో అత్యంత ఎత్తయిన పర్వతమైన మౌంట్ ఎవరెస్ట్ సముద్రమట్టానికి 8848 మీటర్ల ఎత్తులో ఉంది. మౌంట్ ఎవరెస్టును నేపాల్, టిబెట్ ప్రజలు ఆరాధ్య దైవంగా కొలుస్తారు. అలాంటి పర్వత శ్రేణి ఎక్కడం ద్వారా యువతలో సాహస ఆలోచనలను రేకెత్తించాలని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. నిరుపేదలను పర్వతారోహణ చేయించడం ద్వారా ఆయా వర్గాల్లో సరికొత్త ఆలోచనలు రెకెత్తించాలని సర్కారు యోచనగా ఉంది. గ్రామీణ ప్రాంతాల యువతను సైతం పర్వతారోహణవైపు ఆసక్తి చూపించేలా అవకాశాలు కల్పించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.
సాహస విన్యాసాల విషయంలో రాష్ట్ర యువత ప్రపంచంలో మేటిగా నిలవాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. సాహసక్రీడలు, సాహస పర్యాటకంగా ఈ కార్యక్రమానికి ఎంపిక చేసిన యువత భవిష్యత్‌లో మెరుగైన ఉపాధి అవకాశాలు పొందేందుకు ఈ కార్యక్రమం ఉపకరిస్తుంది. రాష్ట్రంలోని యువత ఏదైనా సాధించగలరన్న కాంక్ష రగిలించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని యువజన సర్వీసుల శాఖ పేర్కొంది.
18-29 ఏళ్ల మధ్య వయస్కులు అర్హులు
ఈ ప్రాజెక్టు ద్వారా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేందుకు ఐదుగురికే అవకాశం కల్పిస్తున్నప్పటికీ 7 దశల్లో 20 మందికి పూర్తిస్థాయి శిక్షణ అందిస్తారు. వారందరికీ పర్వతారోహణపై సమగ్రమైన అవగాహన లభించే అవకాశం ఉంది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, మహిళల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేస్తారు. ఓపెన్ కేటగిరి నుంచి మరో ఇద్దరిని ఎంపిక చేస్తారు. రాష్ట్రంలోని అనాధలు, నిరుపేదలకు ఎంపిక ప్రక్రియలో ప్రాధాన్యత ఉంటుంది. రాష్ట్రానికి చెందిన 18-29 మధ్య వయసున్న యువతీయువకులు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల కుటుంబాల నుంచి వచ్చిన వారికి ఆదాయ పరిమితి రూ. 81 వేలు కాగా, పట్టణ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఆదాయ పరిమితి లక్షా మూడు వేలు. తెల్ల రేషన్ కార్డు ఆదాయ పరిమితికి సాక్ష్యంగా పరిగణిస్తారు. చదువు, ఎత్తు కొలతలతో ఎంపిక ప్రక్రియ ఉండదు. హిందీ, ఇంగ్లీషు భాషల్లో ప్రావీణ్యత అదనపు అర్హతగా భావిస్తారు. ప్రభుత్వ వైద్యుడు పరిశీలించిన మీదట దరఖాస్తు పరిశీలిస్తారు. తల్లిదండ్రుల ఆమోదం తప్పనిసరి.
పురుషులు వంద మీటర్ల పరుగు పందాన్ని 16 సెకండ్లలో, 2.4 కి.మీ పది నిమిషాల్లో పూర్తి చేయాలి. ఇక మహిళలు వంద మీటర్ల పరుగు పందాన్ని 18 సెకండ్లలో, 2.4 కి.మీ 13 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. పురుషులు 3.65 మీటర్ల లాంగ్ జంప్‌ను మూడు ఛాన్స్‌లలో దూకాలి. ఇక మహిళలు 2.7 మీటర్ల లాంగ్ జంప్‌ను 3 ఛాన్స్‌లో పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఏడు దశల్లో అభ్యర్థుల ఎంపిక
జిల్లాస్థాయి కమిటీ ఆధ్వర్యంలో ఒక్కో జిల్లా నుంచి పదేసి మందిని ఈ పద్ధతి కింద ఎంపిక చేస్తారు. జిల్లా అధికారులతోపాటు, యువజన సర్వీసుల అధికారులు, వైద్యులు తదితరులు సభ్యులుగా ఉంటారు. జిల్లాకు పదేసి మంది చొప్పున 130 మందికి 5 రోజుల పాటు పర్వతారోహణకు కావాల్సిన శారీరక శిక్షణతోపాటు, క్రమశిక్షణ, టీం స్పీరిట్, సహకారం అంశాల్లో శిక్షణ ఇస్తారు. వారిలో 20 మందిని తర్వాత దశకు పంపిస్తారు. ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ స్కూళ్ల డైరెక్టర్ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు.
సమర్థవంతమైన భద్రతా చర్యలు
ఫేజ్ 3 కింద ఎంపిక చేసిన 20 మంది అభ్యర్థులకు రక్షణ శాఖ ఆమోదించిన పర్వతారోహణ సంస్థలో శిక్షణ ఇస్తారు. వారిలో మెరికల్లాంటి 9 మందిని ఎంపిక చేసి... తర్వాత ఫీజుల్లో శిక్షణ అందిస్తారు. ఫేజ్ 4 కింద మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన సమయంలో ఎలా వ్యవహరించాలి... పర్వతా రోహణ ఏవిధంగా చేయాలి... ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలన్న దానిపై సలహాలు, సూచనలు అందిస్తారు. నెల రోజుల పాటు శిక్షణ కొనసాగుతుంది.
అనుభవమున్న ఆర్మీ అధికారి పర్యవేక్షణలో పర్వతారోహణ
ఫేజ్ 5 కింద ఎంపిక చేసిన 9 మందిని హిమాలయ పర్వతాల వాతావరణ పరిస్థితులను తట్టుకోగలుగుతారా...? లేదా అన్న విషయాన్ని పరిశీలిస్తారు. అతిశీతల పరిస్థితిని, మంచు కరగడాన్ని తట్టుకొని నిలబడగలరా లేదా అన్న అంశాన్ని పరిశీలిస్తారు. పర్వతా రోహణలో అనుభవం నుంచి ఆర్మీలో లెఫ్ట్నెంట్ కల్నల్ స్థాయి అధికారి ఈ వ్యవహారాన్నంతా పర్యవేక్షిస్తారు. వారి వారి ప్రదర్శనను, సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకొని 9 మంది నుంచి ఐదుగుర్ని ఆయనే ఎంపిక చేస్తారు. టీం లీడర్‌తో పాటు, వైద్యుడు పర్వతారోహణ టీంతో కలిసే ఉంటారు.
ఆరో దశ ఐదుగురు సభ్యుల ఎంపిక
ఫేజ్ 6 కింద ఐదుగురు సభ్యుల్ని ఎంపిక చేసి వారికి పర్వతారోహణలో పూర్తి తర్ఫీదునిస్తారు. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి కావాల్సిన అన్ని రకాల మెళకువలు, కృత్రిమ ఆక్సిజన్‌తో శ్వాస అందుకోవడం లాంటి అంశాల్లో టీం సభ్యులకు శిక్షణ ఇస్తారు. ఏప్రిల్ మొదటి వారం వరకు సుమారు రెండు నెలల పాటు శిక్షణ ఇస్తారు. ఫేజ్ 7 కింద ఎంపిక చేసిన సభ్యులను ఏప్రిల్-జూన్ 2017 మధ్య ఎవరెస్ట్ పర్వతారోహణకు తీసుకెళ్తారు.
మౌంట్ ఎవరెస్ట్ పర్వతం అధిరోహించడమన్నది అత్యంత ప్రమాదకరమైనది. అత్యంత సాహసయాత్రగా పేర్కొంటారు. అలాంటి సాహస యాత్రకు రాష్ట్రానికి చెందిన యువతను ఎంపిక చేసి వారిని క్షేమంగా తిరిగి గమ్యస్థానాలు చేరుకోడానికి... అత్యంత సమర్థవంతమైన లీడర్‌ను ఎంపిక చేసి బాధ్యత అప్పగిస్తారు. పర్వతారోహణలో అనుభవమున్న, మౌంట్ ఎవరెస్టుతో పాటు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన పర్వతారోహణ చేసిన వారు, టీం యోగక్షేమాలను చూసుకునే వారు టీంకు నాయకత్వం వహిస్తారు. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు సంబంధిత జిల్లా ముఖ్య కార్యనిర్వహణ అధికారి స్టెప్/ జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారి కార్యాలయాల్లో నిర్దేశిత దరఖాస్తును పూరించి సమర్పించాలి. మరిన్ని వివరాలకు వెబ్ సైట్ youthservices.ap.gov.inలో చూడవచ్చును.