బుధవారం, 5 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , శనివారం, 18 ఫిబ్రవరి 2017 (02:37 IST)

మైలాపూర్‌ ఎమ్మెల్యే నటరాజన్‌ తిరుగుబాటు: శశికళ వర్గంలో చీలిక తప్పదా!

ముఖ్యమంత్రిగా పళనిస్వామి ప్రమాణస్వీకారం చేయడంతో పన్నీర్ వర్గంలో తాత్కాలికంగా నిరాశ ఏర్పడగా.. శశికళ వర్గం సంబరాలు చేసుకుంది. ఇక అధికారం తమదేనని, తమిళనాడు తమదేనని నమ్మేసింది. ఆ అనుకూలతను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో, బలపరీక్షకు 15 రోజులు సమయం ఉన్నా...

ముఖ్యమంత్రిగా పళనిస్వామి ప్రమాణస్వీకారం చేయడంతో పన్నీర్ వర్గంలో తాత్కాలికంగా నిరాశ ఏర్పడగా.. శశికళ వర్గం సంబరాలు చేసుకుంది. ఇక అధికారం తమదేనని, తమిళనాడు తమదేనని నమ్మేసింది. ఆ అనుకూలతను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో,  బలపరీక్షకు 15 రోజులు సమయం ఉన్నా... ఈ నెల18నే అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి పళనిస్వామి బలపరీక్షకు సిద్ధమయ్యారు. ఆ తరువాత కొన్ని గంటల్లో చెన్నైలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రమాణస్వీకారానికి రాజ్‌భవన్‌కు తీసుకొచ్చిన ఎమ్మెల్యేలను తిరిగి కువత్తూరులోని రిసార్ట్స్‌కు తరలించారు. కానీ మైలాపూర్‌ ఎమ్మెల్యే నటరాజన్‌ శుక్రవారం ఉదయం పళనిస్వామికి ఝలక్‌ ఇచ్చి పన్నీర్‌ శిబిరంలో వచ్చి చేరారు. తాను అమ్మ ఫొటోతో గెలిచానని, అమ్మ వ్యతిరేకులకు ఓటు వేయలేనని ఆయన తేల్చిచెప్పినట్లు సమాచారం. అవసరమైతే తిరిగి అమ్మఫొటోతో ఎన్నికలకు వెళ్లేందుక్కూడా వెనుకాడబోనని ప్రకటించడంతో శశివర్గంలో ప్రకంపనలు బయలుదేరాయి. 
 
తిరుగుబాటుకు ఆజ్యం పోసిన నటరాజన్
నటరాజన్‌ ప్రకటన వెలువడిన వెంటనే రిసార్ట్స్‌లో ఉన్న సుమారు 20 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినట్లు వార్తలు. అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలను వారు తెరమీదకు తెచ్చారు. వెంటనే తీర్చకపోతే తమ నిర్ణయం మరోలా ఉంటుందని హెచ్చరించారు. దీంతో వణికిపోయిన పళనిస్వామి బెంగళూరు పర్యటను ఉన్నట్లుండి రద్దు చేసుకున్నారు. హుటాహుటిన శుక్రవారం రిసార్ట్స్‌కు వెళ్లి ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో పడ్డారు. బెంగళూరు జైల్లో ఉన్న శశికళ కూడా తమ వద్దకు రావడం కంటే ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చూడమని హుకుం జారీచేసినట్లు తెలిసింది.
 
పైగా క్యాంప్‌లో ఉన్న ఎమ్మెల్యేలందరితో శశికళ జైలు నుంచి ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. బలనిరూపణలో గెలిచిన అనంతరం మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అసంతృప్త ఎమ్మెల్యేలకు ఆశ చూపినట్టు తెలుస్తోంది. పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటేయాలని భావించే ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు వారి బంధువులు, అనుచరులను రిసార్ట్స్‌కు పిలిపించి ఒప్పించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. దీంతో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు రిసార్ట్స్‌ పరిసర ప్రాంతాల్లో వాహనాలతో నిండిపోయాయి. రిసార్ట్స్‌కు వచ్చిపోయే వారిని మన్నార్‌గుడి సైన్యం క్షుణ్ణంగా పరిశీలించి అనుమతిస్తోంది. రిసార్ట్స్‌ గేటు ముందు, కువత్తూరు ముఖద్వారం వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.